చర్మానికీ రానుందో బ్యాంకు!

ABN , First Publish Date - 2020-08-02T08:44:07+05:30 IST

ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని ఉస్మానియా ఆస్పత్రిలో చర్మాన్ని భద్రపరిచే స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు సిద్ధమయ్యారు.

చర్మానికీ  రానుందో బ్యాంకు!

  • 60 శాతానికి పైగా కాలిన గాయాలైన
  • వారి ప్రాణాలను కాపాడే అవకాశం
  • రూ.75 లక్షలతో ఉస్మానియా ఆస్పత్రిలో 
  • ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్‌ సిద్ధం
  • గతంలోనే ప్రతిపాదనలు పంపిన వైద్యులు
  • రాష్ట్ర సర్కారు ఆమోదమే తరువాయి


మంగళ్‌హాట్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని ఉస్మానియా ఆస్పత్రిలో చర్మాన్ని భద్రపరిచే స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు సిద్ధమయ్యారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రోటరీ క్లబ్‌ సహకారంతో దీని ఏర్పాటుకు వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ బ్యాంకు ఏర్పాటైతే.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పడిన తొలి చర్మ బ్యాంకుగా చరిత్రకెక్కుతుంది. ఉస్మానియా ఆస్పత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఏటా 1500కు పైగా శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. తెగిన చేతులు, వేళ్లు అతికించే సర్జరీలకు.. కాలిన గాయాలతో వచ్చే వారికి.. చర్మం అవసరం అవుతుంది. 30-40ు కాలిన గాయాలతో ఆస్పత్రికి వచ్చే వారి శరీరంలోని ఇతర భాగాల నుంచి 15-20ు మేర చర్మాన్ని సేకరించి గాయాలైన చోట అమర్చుతుంటారు.


ఆలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభించడంతోపాటు.. శరీరంలోకి ఎక్కించిన ఫ్లూయిడ్స్‌ బయటకు రాకుండా ఆపే వీలుంటుంది. ఫలితంగా, బాధితులు త్వరగా కోలుకుంటారు. ప్రాణాపాయం నుంచి బయటపడతారు. కానీ, 60 శాతానికిపైగా కాలినగాయాలైనవారి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మాన్ని సేకరించడం కుదరదు. అలాంటివారికి స్కిన్‌ బ్యాంక్‌ నుంచి చర్మాన్ని సేకరించి తాత్కాలికంగా గ్రాఫ్టింగ్‌ చేస్తుంటారు. దీని వల్ల ఇన్ఫెక్షన్‌ను నియంత్రించొచ్చు. ఇలా అతికించిన చర్మం మూడు వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఊడిపోతుంది. ఈ మూడు వారాల్లో గాయాలు తగ్గేందుకు వైద్యులు చేసే చికిత్సలు సత్ఫలితాలను ఇస్తాయి.


పేదలకు మేలు..

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఒక శాతం స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చేసేందుకు రూ. 40 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు ఖర్చువుతుంది. అదే 35-40ు కాలిన గాయాలైన వారికి రూ. 12 నుంచి 14 లక్షల వరకు ఖర్చువుతుంది. 60ు కంటే ఎక్కువ కాలిన గాయాలైనవారైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచిత చికిత్స ద్వారా ఇప్పటికే వేల మంది ప్రాణాలను కాపాడారు. స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ అందుబాటులోకి వస్తుందని.. ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఉస్మానియా ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు తెలుపుతున్నారు. స్కిన్‌బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వారు గతంలోనే ప్రభుత్వానికి పంపారు. అందుకు దాదాపు రూ. కోటి ఖర్చవుతుందని అంచనా.


ఈ నేపథ్యంలోనే.. రోటరీ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థ ఉస్మానియాలో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఓపీ భవనంలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో స్కిన్‌ బ్యాంకు ఏర్పాటుకు అవసరమైన మ్యాప్‌ను సిద్ధం చేసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ అనుమతి రాగానే స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్కిన్‌ బ్యాంక్‌ ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-08-02T08:44:07+05:30 IST