Abn logo
Sep 24 2021 @ 13:30PM

వానా కాలం... చర్మ సంరక్షణ ఎలా?

ఆంధ్రజ్యోతి(24-09-2021)

ప్రశ్న: వానాకాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- యమున, గుంటూరు


డాక్టర్ సమాధానం: వర్షాలు పడడం మొదలవగానే ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణంలో తేమ పెరుగుతుంది. ఈ పరిస్థితులు సూక్ష్మజీవులు పెరగడానికి వ్యాపించడానికి అనుకూలమైనవి. కాబట్టి జలుబు, జ్వరాలు మొదలవుతాయి. రకరకాల వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవుల వల్లే అనారోగ్యాలు వస్తాయి. వాటితో పాటు, కొన్ని రకాల చర్మవ్యాధులు కూడా ప్రబలుతాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అనారోగ్యాల నుంచి కొంత రక్షణ పొందవచ్చు. దీని కోసం కొన్ని రకాల పోషక పదార్థాలు అత్యవసరం. నిమ్మ, నారింజ, ఆపిల్‌, జామ లాంటి తాజా పండ్లన్నిటిలోను అధికంగా ఉండే విటమిన్‌ - సి కేవలం రోగనిరోధకశక్తికే కాక చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొలాజెన్‌ తయారీలో కూడా ఉపయోగపడుతుంది. బాదం, పిస్తా, ఆక్రోట్‌, పొద్దు తిరుగుడు గింజల లాంటి వాటిలో ఉండే విటమిన్‌- ఈ కూడా చర్మ ఆరోగ్యానికి మంచిదే. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల పండ్లు, కాయగూరలు తీసుకోవడం ద్వారా కూడా చర్మం మెరుపు సంతరించుకుంటుంది. సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా బ్యాక్టీరియా ఫంగస్‌ లాంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత అవసరం. ఎప్పుడు బయటికి వెళ్లి వచ్చినా కాళ్ళు, చేతులు, ముఖం సబ్బుతో కడుక్కోవడం, కాలి వేళ్ళ సందుల్లో కూడా తడిలేకుండా పొడి బట్టతో తుడుచుకోవడం, వర్షంలో తల తడిస్తే త్వరగా జుట్టు ఆరబెట్టుకోవడం, వేడిగా ఉండే ఆహారం మాత్రమే తినడం, మంచినీళ్లు కాచి చల్లార్చినవి తాగడం, ఇంట్లో తేమ లేకుండా చూసుకోవడం లాంటివి పాటిస్తే జలుబు, జ్వరాలతో పాటు చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

ప్రత్యేకంమరిన్ని...