పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ABN , First Publish Date - 2021-11-18T17:19:59+05:30 IST

పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల నేరం కేసులో ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్ తప్పనిసరి అని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది...

పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

లైంగిక వేధింపుల కేసుల్లో Skin-to-skin కాంటాక్ట్ అవసరం లేదు

న్యూఢిల్లీ: పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల నేరం కేసులో ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్ తప్పనిసరి అని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.స్పర్శ అనే పదాన్ని ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్‌కి పరిమితం చేయడం సంకుచితమైన, అసంబద్ధమైన వివరణకి దారి తీస్తుందని,చట్టం యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడానికి పోక్సో చట్టం ఉద్ధేశించిందని చెప్పారు.లైంగిక వేధింపుల ఉద్ధేశంతో బట్టలు తాకడం అనేది పోక్సో నిర్వచనంలోనే ఉందని సుప్రీం తెలిపింది.


బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ జనవరి 12 నాటి తీర్పుపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఎన్‌సీడబ్ల్యు, మహారాష్ట్ర చేసిన అప్పీళ్లను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.జనవరి 27 న స్కిన్ టు స్కిన్ సంబంధం లేకుండా బాలిక రొమ్మును పట్టుకోవడం లైంగిక వేధింపుగా పేర్కొనలేమని చెప్పి బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ పోక్సో చట్టం కింద ఒక వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.నిందితుడు బట్టలు విప్పకుండా బాలిక రొమ్ము పట్టుకున్నందున, ఆ నేరాన్ని లైంగిక వేధింపుగా పేర్కొనలేమని జస్టిస్ పుష్పా గనేడివాలా గత తీర్పులో పేర్కొన్నారు.  


Updated Date - 2021-11-18T17:19:59+05:30 IST