రాయితీ లేనట్టే!

ABN , First Publish Date - 2020-09-27T11:17:01+05:30 IST

మత్స్యకారులకు రాయితీ అటకెక్కింది. గత ఏడాది మత్స్యశాఖ ద్వారా మంజూరు చేసిన పడవలు, వలలకు సంబంధించి రాయితీ నిధులు చెల్లించరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

రాయితీ లేనట్టే!

 పడవలు, వలలకు విడుదల కాని నిధులు

 ఆందోళన చెందుతున్న మత్స్యకారులు


(ఇచ్ఛాపురం రూరల్‌):

మత్స్యకారులకు రాయితీ అటకెక్కింది. గత ఏడాది మత్స్యశాఖ ద్వారా మంజూరు చేసిన పడవలు, వలలకు సంబంధించి రాయితీ నిధులు చెల్లించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాయితీ నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న మత్స్యకారుల్లో నిరాశ నెలకొంది. మత్స్యకారులకు 90 శాతం రాయితీపై పడవలు, వలలు అందిస్తామని గత ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. మత్స్యకారులు తమ వాటాగా పది శాతం మత్స్యశాఖకు డీడీలు చెల్లించాలని స్పష్టం చేసింది.


దీంతో జిల్లావ్యాప్తంగా 11 మండలాల్లో పడవల కోసం 88 మంది రూ.92.50 లక్షలు, వలల కోసం 207 మంది రూ.27.87 లక్షలు, ఇంజిన్ల కోసం 92 మంది రూ.19.49 లక్షలు మొత్తం రూ.1.39 కోట్లు డీడీల రూపంలో చెల్లించారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వమైనా రాయితీ మొత్తం విడుదల చేస్తుందని మత్స్యకారులంతా ఏడాదిగా ఎదురుచూశారు. కానీ, ప్రభుత్వం తాజాగా దీనిపై నిర్ణయం తీసుకుంది.  2019 ఫిబ్రవరిలో మంజూరు చేసిన పరికరాలకు ఎలాంటి రాయితీ చెల్లించరాదని నిర్ణయించింది.


లబ్ధిదారులు చెల్లించిన డీడీలను వెనక్కి ఇచ్చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించింది. దీంతో మత్స్యకారులంతా నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా రాయితీ ఇస్తుందనే ఉద్దేశంతో అప్పుచేసి పడవలు, వలలు కొనుగోలు చేశామని వాపోతున్నారు. ఇప్పుడు ఆర్థికంగా తమపై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


 అప్పుల పాలయ్యాం 

ప్రభుత్వం 90 శాతం రాయితీపై వలలు అందిస్తామని చెప్పడంతో మేము ఎంతో సంతోషంతో వలలు కొన్నాం. ఏడాదైనా రాయితీ  నిధులు రాకపోవడంతో అప్పులు చేసి మిగతా సొమ్ములు చెల్లించాం. ఏడాదిగా డీజిల్‌ రాయితీ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా కారణంగా వేట లేక ఇబ్బందులు పడుతున్నాం.


సూరాడ.తిరుపతి, మత్స్యకారుడు, డొంకూరు

ఇబ్బందులు పడుతున్నాం 

ప్రభుత్వం రాయితీపై వేట పడవలు ఇస్తుందన్న ఆశతో రూ. 1.25 లక్షలు అప్పు చేసి డీడీ చెల్లించాం. రాయితీ ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరిపై రూ.2.50 లక్షలు భారం పడింది. ఇంజన్లు విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులను అడిగితే బడ్జెట్‌ కేటాయింపులు లేవని చెబుతున్నారు. 

                              బుడ్డ రాజారావు, మత్స్యకారుడు, డొంకూరు


 డీడీలు వాపసు ఇస్తున్నాం.. 

మత్స్యశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు గతంలో రాయితీ వేట పడవలు, పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి డీడీలు వెనక్కి ఇచ్చేస్తున్నాం. కొత్త పరికరాల మంజూరుపై ప్రభుత్వ ఆదేశాలు వచ్చాక దరఖాస్తులు స్వీకరిస్తాం. 

Updated Date - 2020-09-27T11:17:01+05:30 IST