పసుపుగల్లులో సీసీ రోడ్డు నిర్మాణంలో గొడవ

ABN , First Publish Date - 2021-06-16T07:29:09+05:30 IST

మండలంలోని పసుపుగల్లు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వర్గీయుల మధ్య రెండు రోజులుగా వివాదం నడుస్తోంది.

పసుపుగల్లులో  సీసీ రోడ్డు నిర్మాణంలో గొడవ
ఇరువర్గాల వారిని సమన్వయ పరుస్తున్న పోలీసులు

ముండ్లమూరు, జూన్‌ 15 : మండలంలోని పసుపుగల్లు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి వర్గీయుల మధ్య రెండు రోజులుగా వివాదం నడుస్తోంది. ఆరు నెలల క్రితమే స్పెషల్‌ అధికారి తీర్మానంతో పాటు మండల తీర్మానం కూడా తీసుకున్నాం.. సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని ఆ గ్రామ వైసీపీ నాయకుడు బిజ్జం వెంకట సుబ్బారెడ్డితో పాటు ఆయన వర్గీయులు చెబుతున్నారు. గ్రామ సర్పంచ్‌ తీర్మానం లేకుండా రోడ్డు ఎలా వేస్తారని? బూచేపల్లి వర్గీయుడైన సర్పంచ్‌ వరగాని బాల సుందరరావు ఆక్షేపించారు. దీంతో ఇరు వర్గాల వారు సీసీ రోడ్డు నిర్మాణం దగ్గరకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జీ వెంకటసైదులు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని పసుపుగల్లు గ్రామానికి ఆరు నెలల క్రితంఉపాధి హామీ పథకం నిధులు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. ఆ గ్రామ వైసీపీ నాయకుడు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి అప్పుడున్న పంచాయతీ స్పెషల్‌ అధికారి తీర్మానం, మండల తీర్మానం తీసుకొని రూ.5 లక్షలతో సిమెంట్‌ రోడ్డు పనుల్లో నిమగ్నమయ్యారు. కొంత సిమెంట్‌ రోడ్డు కూడా వేశారు. నిర్మాణంలో తమ సొంత స్థలం కొంత ఉందని, ఆ స్థలంలో సీసీ రోడ్డు వేయటానికి వీల్లేదని ఉప సర్పంచ్‌ బిజ్జ జ్యోతికృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ రాజ్‌ ఏఈ సునీల్‌ కుమార్‌, ఎస్‌ఐ జీ వెంకట సైదులు, సిబ్బంది రహదారి నిర్మాణం దగ్గరికి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు. చివరికి ఒకరినొకరు వాదులాడుకుంటుండగా ఎస్‌ఐ ఇరు వర్గాల వారికి సర్దిచెప్పారు. రహదారి నిర్మాణం వద్ద నుంచి ఇరు వర్గాల వారు వెళ్ళిపోవాలని, ఎవరు గొడవలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. గ్రామంలో అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని బిజ్జం వెంకట సుబ్బారెడ్డి ఆరోపిస్తుండగా, సర్పంచ్‌గా ఎన్నికైన తనకు తెలియకుండానే సీసీ రోడ్డు వేయటం ఏమిటంటూ ప్రస్తుత సర్పంచ్‌ బాల సుందరరావు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎంపీడీవో బీ చంద్రశేఖరరావును కలసి ఫిర్యాదు చేశారు. సందిగ్ధంలో పడిన ఏఈ సునీల్‌కుమార్‌ ఏమి తేల్చకుండానే వెళ్లిపోయారు. 


Updated Date - 2021-06-16T07:29:09+05:30 IST