ఎట్టకేలకు చిక్కాడు

ABN , First Publish Date - 2020-10-01T11:11:39+05:30 IST

ఓ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్‌పై వెళ్లి వస్తానని చెప్పి.. ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లు గప్పి పరారీలో ఉన్న నిందితుడిని కాశీబుగ్గ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించిన సీఐ జి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఎట్టకేలకు చిక్కాడు

 పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న కాశీబుగ్గ పోలీసులు

 ఏడేళ్లుగా ఒడిశాలో మకాం

(పలాస, సెప్టెంబరు 30):

ఓ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్‌పై వెళ్లి వస్తానని చెప్పి.. ఎస్కార్ట్‌ పోలీసుల కళ్లు గప్పి పరారీలో ఉన్న నిందితుడిని కాశీబుగ్గ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించిన సీఐ జి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గకు చెందిన సార దుర్యోధనరావు 2007లో పాతపట్నానికి చెందిన జి.పార్వతి అనే మహిళను హతమార్చి పరారయ్యాడు.


పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. హత్యకేసు రుజువు కావడంతో.. 2013 ఆగస్టులో జిల్లా కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఆయనను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. నాలుగు నెలలు తర్వాత.. తన సోదరి వివాహం చూసేందుకు అనుమతి ఇవ్వాలని నిందితుడు కోరగా.. రెండు రోజుల పాటు పెరోల్‌ ఇచ్చారు. ఈ క్రమంలో ఎస్కార్ట్‌ పోలీసుల   సాయంతో దుర్యోధనరావు కాశీబుగ్గ వచ్చి.. వారి కళ్లుగప్పి పరార  య్యాడు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను సైతం అప్పట్లో పోలీసుశాఖ సస్పెండ్‌ చేసింది. నిందితుడి కోసం జాతీయ స్థాయిలో ఔట్‌లుక్‌ నోటీసులు  జారీ అయ్యాయి.  పరారీలో ఉన్న దుర్యోధనరావు..


ఒడిశా రాష్ట్రం కొందమాల్‌ జిల్లా బల్లిగుడ గ్రామంలో టిఫిన్‌ షాపు నిర్వహిస్తూ ఇన్నాళ్లూ జీవనం సాగించాడు. ఇటీవల ఆయన సోదరుడికి చెందిన ఇళ్ల స్థలాల గొడవలు జరుగుతున్నాయి. దీనిపై దుర్యోధనరావుతో ఆయన సోదరుడు ఫోన్‌లో  మాట్లాడుతున్నట్టు   కాశీబుగ్గ క్రైం పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు బుధవారం దుర్యోధనరావు కాశీబుగ్గ రావడంతో.. ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో పోలీసులు ఆయనను  అరెస్టు చేశారు. దీంతో నిందితుడు ఏ విధంగా పరారయ్యాడు? ఇన్నాళ్లూ ఎక్కడ.. ఎలా జీవనం సాగించాడనే వివరాలను పోలీసులకు తెలిపాడు.


ఈ మేరకు నిందితుణ్ని గురువారం పలాస కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో సహకరించిన క్రైమ్‌టీమ్‌ సభ్యులు ఢిల్లేశ్వరావు, సిబ్బందిని ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ మధుసూధనరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T11:11:39+05:30 IST