ఉగాది వేళ శుభవార్త చెప్పిన స్కైమెట్

ABN , First Publish Date - 2021-04-13T20:19:47+05:30 IST

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఓ ప్రైవేటు వాతావరణ సూచన సంస్థ

ఉగాది వేళ శుభవార్త చెప్పిన స్కైమెట్

న్యూఢిల్లీ : శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఓ ప్రైవేటు వాతావరణ సూచన సంస్థ అందరికీ శుభవార్త చెప్పింది. 2021లో నైరుతి రుతు పవనాలు సాధారణ స్థితిలో ఉంటాయని తెలిపింది. జూన్ నుంచి ప్రారంభమయ్యే నైరుతి రుతు పవనాలు దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)లో 103 శాతంతో సాధారణ స్థితిలో ఉంటాయని తెలిపింది. 


స్కైమెట్ వాతావరణ సూచన సంస్థ మంగళవారం విడుదల చేసిన నివేదికలో, జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఎల్‌పీఏ 880.6 మిల్లీమీటర్లు ఉంటుందని అంచనా వేసింది. ఇదే నిజమైతే దేశంలో వర్షపాతం దాదాపు 907 మిల్లీమీటర్లు ఉంటుంది. వరుసగా మూడో ఏడాది కూడా రుతు పవన కాలంలో వర్షపాతం సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లవుతుంది. 2020లో దేశవ్యాప్తంగా ఎల్‌పీఏలో 109 శాతం వర్షపాతం నమోదైంది. 2019లో ఎల్‌పీఏలో 110 శాతం వర్షపాతం నమోదైంది.


ఎల్‌పీఏలో 96 శాతం నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతం అంటారు. 2021లో దేశవ్యాప్తంగా సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం 85 శాతం ఉందని స్కైమెట్ మంగళవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 


Updated Date - 2021-04-13T20:19:47+05:30 IST