న్యాయం వధ!

ABN , First Publish Date - 2021-02-18T07:55:34+05:30 IST

పట్టపగలు.. నడిరోడ్డుపై దారుణం జరిగింది.. కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో కారులో వచ్చి అడ్డుకున్నారు..

న్యాయం వధ!

  • పట్టపగలు.. నడిరోడ్డుపై లాయర్‌ దంపతుల కిరాతక హత్య
  • కల్వచర్ల వద్ద కారును అటకాయించిన దుండగులు
  • అందరూ చూస్తుండగానే కత్తులు, గొడ్డళ్లతో దాడి
  • ఆస్పత్రికి తరలించేలోపే మరణించిన 
  • హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి
  • హత్యను సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన ప్రయాణికులు
  • హత్య చేసింది టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు?
  • కుంట శీను పేరు చెప్పిన వామనరావు.. వీడియో వైరల్‌
  • గ్రామంలో నెలకొన్న వివాదాలే కారణమా?
  • నేడు కోర్టు విధుల బహిష్కరణకు హైకోర్టు లాయర్ల పిలుపు
  • పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు
  • వామనరావు చెప్పిన పేర్లు, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు
  • పోలీసులకు డీజీపీ దిశా నిర్దేశం 
  • నిందితుల్ని వదలొద్దు: హోంమంత్రి 
  • నేడు మీడియా ముందుకు నిందితులు?


పెద్దపల్లి/రామగిరి/హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): పట్టపగలు.. నడిరోడ్డుపై దారుణం జరిగింది.. కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో కారులో వచ్చి అడ్డుకున్నారు.. కారులోంచి న్యాయవాదిని బయటకు లాగి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద చోటుచేసుకుంది. మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు. బుధవారం వారిరువురూ హైదరాబాద్‌ నుంచి మంథని కోర్టుకు ఒక కేసు విషయమై వచ్చారని బంధువులు చెబుతున్నారు. కోర్టు వద్దకు తన సోదరుడు గట్టు ఇంద్రశేఖర్‌రావు, తన తండ్రి గట్టు కిషన్‌రావు, మేనల్లుడు శ్రీనాథ్‌ రాగా కేసు పిటిషన్లపై వారితో సంతకాలు చేయించుకుని ఇంటికి పంపించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వామనరావు దంపతులు నేరుగా కోర్టు నుంచి హైదరాబాద్‌కు కారు (టీఎ్‌స10ఇజె2828)లో బయలుదేరారు.


 కారులో డ్రైవర్‌ సతీశ్‌తో పాటు వామనరావు దంపతులు మాత్రమే ఉన్నారు. రామగిరి మండలం కల్వచర్ల దాటిన తర్వాత కల్వర్టు రాగానే వారి వెనుకాలే ఒక కారులో వచ్చిన దుండగులు వారి కారును ఓవర్‌ టేక్‌ చేసి దానికి అడ్డంగా నిలిపారు. కారులో కూర్చున్న వామనరావును బయటకు లాగారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచారు. గొడ్డళ్లతో నరికారు. కారులో ఉన్న నాగమణిపై మరో ఇద్దరు వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు. ఆమె కారులోనే కుప్పకూలిపోయింది. దంపతులిద్దరిపైనా విచక్షణారహితంగా దాడి చేసిన అనంతరం దుండగులు కారెక్కి వెళ్లిపోయారు. అటువైపుగా వెళుతున్న కొందరు వ్యక్తులు పోలీసులకు, 108కి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కొన ఊపిరితో ఉన్న న్యాయవాదులను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్త స్రావం కావడంతో వాళ్లు ఆస్పత్రికి చేరేలోపే మృతిచెందారు. హత్యా ఘటనను ఆర్టీసీ బస్సులో వెళుతున్న కొందరు తమ సెల్‌ ఫోన్లలో చిత్రీకరించడం గమనార్హం. కొన ఊపిరితో ఉన్న వామనరావు వద్దకు వెళ్లి కొందరు విచారించగా.. తమపై కుంట శ్రీనివా్‌సతో పాటు మరికొందరు దాడి చేశారని చెబుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ హత్యలను మంథని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌, అతడి అనుచరులు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


గ్రామంలో నెలకొన్న వివాదాలే కారణం..?

న్యాయవాది వామనరావు దంపతుల హత్యకు గుంజపడుగులో నెలకొన్న వివాదాలే కారణమని తెలుస్తోంది. ఇదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివా్‌సతో నెలకొన్న వివాదాలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్‌ ఇటీవల గ్రామంలో ఓ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. పంచాయతీ అనుమతులు లేకుండానే ఇల్లు నిర్మిస్తున్నారంటూ ఆ ఇంటి వద్ద ఎవరి పేరు లేకుండానే ఇటీవల ఒక ఫ్లెక్సీ వెలిసింది. అలాగే ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఓ కుల దైవం ఆలయ నిర్మాణాన్ని శ్రీనివాస్‌ చేపట్టారు. శ్రీనివాస్‌ అదే కుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆ గుడి నిర్మాణం వద్ద కూడా ఒక ఫ్లెక్సీ వెలిసింది. వీటిపై వామనరావు కేసులు వేస్తానని బయట చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం మంథని కోర్టుకు వచ్చిన వామనరావు తన కుటుంబ సభ్యులు, మరికొందరిని పిలిపించుకుని పిటిషన్లపై సంతకాలు తీసుకున్నారని.. అందుకే వారిని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వామనరావు తండ్రి, విశ్రాంత ఉపాధ్యాయుడు గట్టు కిషన్‌రావు మాత్రం తన కుమారుడు, కోడలిని కుంట శ్రీనివాస్‌, తన అనుచరులతో కలిసి హత్య చేశాడని, ఈ హత్య వెనుక జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, గుంజపడుగుకు చెందిన రిటైర్డ్‌ డీఈఈ వసంత్‌రావు హస్తం ఉందని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఏడాది క్రితం మంథని పోలీస్‌ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న శీలం రంగయ్య పోలీసుల వేధింపుల కారణంగానే చనిపోయాడంటూ వామనరావు కేసు వేశారని, ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై కేసులు వేయడం వల్లనే ఈ హత్య జరిగి ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. 


కీలక కేసులు వేసిన వామనరావు దంపతులు

హత్యకు గురైన న్యాయవాది గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి పలు కీలక కేసుల్లో న్యాయవాదులుగా ఉన్నారు. మంథనిలో ఇసుక మాఫియాపై, కులాంతర వివాహం చేసుకున్న ఒక ఎస్సీ యువకుడి హత్యలో ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు వ్యతిరేకంగా, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల కంటే వందల రెట్లు అధికంగా ఆస్తులు ఉన్నాయని.. ఇలా పలు కేసులు వేశారు. 2019లో మంథని పోలీసు స్టేషన్‌లో శీలం రంగయ్య అనే దళితుడ్ని లాక్‌పడెత్‌ చేశారని మరో కేసు వేశారు. ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్వయంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లాక్‌పడెత్‌ కేసు ఈ నెల 8న మరోసారి విచారణకు వచ్చింది.


లాక్‌పడెత్‌ కేసుకు సంబంధించి తమకు గుర్తుతెలియని ఫోన్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని న్యాయవాది వామనరావు దంపుతులు హైకోర్టు సీజేకు తెలిపారు. కేసు నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని బెదిరించినట్లు విన్నవించారు. శీలం రంగంయ్య లాక్‌పడెత్‌పై తాము కేసు వేసినందుకు పోలీసులూ వేధిస్తున్నారని, మంథనిలోని అన్ని స్టేషన్లలో తప్పుడు కేసులు నమోదు చేశారని వివరించారు. మంచిర్యాలలో తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని సీజేకు విన్నవించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధి సహా మరే కేసులోనూ విచారణకు హాజరవ్వాలంటూ వామనరావు దంపతులను పిలవరాదని గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 9 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మంథని కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా హత్యకు గురవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.


నేడు కోర్టు విధుల బహిష్కరణ

వామనరావు, నాగమణి హత్యను బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, వివిధ బార్‌ అసోసియేషన్లు, న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై హైకోర్టు సిటింగ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. హత్యకు నిరసనగా గురువారం హైకోర్టులో విధులు బహిష్కరించాలని, స్వచ్ఛందంగా నిరసనలో పాల్గొనాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టుల బార్‌ అసోయేషన్‌, సిటీ సివిల్‌ కోర్టులు, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నాంపల్లి కోర్టుల న్యాయవాద సంఘాలు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరూ వకాలత్‌ వేయరాదని న్యాయవాద వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 


కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో శ్రీను

వామన్‌రావు దంపతుల హత్యకు కొన్ని గంటల ముందు కుంట శ్రీను సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు మంథని అంబేద్కర్‌ చౌరస్తాలో కేక్‌ కట్‌ చేసిన కార్యక్రమంలో, మధున పోచమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం ప్రారంభోత్సవంలో, దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమంలో మంథని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడి హోదాలో శ్రీను పాల్గొన్నారు. కొద్ది గంటల వ్యవధిలోనే వామనరావు దంపతుల హత్య జరగడం.. కొన ఊపిరితో ఉన్న వామనరావు తనపై శ్రీను, అనుచరులే దాడి చేశారని వీడియోలో చెప్పడం గమనార్హం. 

Updated Date - 2021-02-18T07:55:34+05:30 IST