Abn logo
Sep 27 2021 @ 00:56AM

నిద్రరోతున్నారు!

పిఠాపురం బైపాస్‌ రోడ్డులో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్సు

పిఠాపురంలో అనధికార నిర్మాణాల జోరు

అయినా కన్నెత్తిచూడని టౌన్‌ ప్లానింగ్‌ విభాగం

నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు

చర్యలు తీసుకుంటామని ప్రకటించినా ఆగని పనులు

మునిసిపల్‌ కౌన్సిల్‌ సాక్షిగా అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు...   చర్యలు తీసుకోకపోగా అక్రమ నిర్మాణాల వేగం పెరిగింది. పనులు జరుగుతున్నా మునిసిపల్‌ యంత్రాంగం అటువైపు చూసే సాహసం చేయలేదు. స్పందించాల్సిన టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నిద్రావస్థలో జోగుతోంది.

పిఠాపురం, సెప్టెంబరు 26: పట్టణంలో అక్రమ కట్టడాలు అధికమవుతున్నాయి. ఎటువంటి అనుమతులూ లేకుండానే భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం చేపడుతున్నా చర్యలు తీసుకోకపోగా మునిసిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. నామామాత్రంగా నోటీసులు ఇచ్చి తమ పని ఇంతటితో అయిందన్నట్టు వారు వ్యవహరిస్తున్న  తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురం బైపాస్‌లో జీవన్‌నగర్‌, జాతీయ రహదారిని చేర్చి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం సాగుతున్నది. ఈ నిర్మాణంపై పలుమార్లు మునిసిపల్‌ కౌన్సిలర్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గత నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించారు. నిర్మాణాలపై తక్షణం చర్యలు తీసుకుంటామని కమిషనర్‌  ప్రకటించారు. నిర్మాణదారులకు నోటీసులు కూడా జారీ చేశారు. నిర్మాణం మాత్రం ఆగలేదు సరికదా మరింత వేగం పుంజుకుంది. దాదాపుగా షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం పూర్తవుతునా ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టకపోవడంతో ఈ వ్యవహారాన్ని కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లాలని కౌన్సిలర్లు భావిస్తున్నారు.  మరోవైపు ఈ అక్రమ నిర్మాణం వెనుక కొందరు అధికార పార్టీ నేతలు ఉన్నట్టు సమాచారం. జాతీయ రహదారిని చేర్చి పలు నిర్మాణాలు జరుగుతున్నా ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు తెలిపారు. అనధికారిక నిర్మాణాల వ్యవహారంలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడే కాకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవట్లేదనే విమర్శలు  వినిపిస్తున్నాయి. పుర పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో అక్రమ, అనధికారిక నిర్మాణాలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.