జారిపోతున్న వర్ణం

ABN , First Publish Date - 2021-06-21T06:02:07+05:30 IST

ఖాళీ రంగులరాట్నంలా ఇప్పుడు కాలమొక్కటే నిర్భయంగా తిరుగుతోంది భూమధ్యరేఖలా చుట్టేసుకున్న...

జారిపోతున్న వర్ణం

ఖాళీ రంగులరాట్నంలా

ఇప్పుడు కాలమొక్కటే

నిర్భయంగా తిరుగుతోంది

భూమధ్యరేఖలా చుట్టేసుకున్న

ప్రళయపరిష్వంగంలో ఇరుసూడిపోయిన భూమండలం

ఊపిరిని బిచ్చమెత్తుకుంటోంది


ఎవరికి చివరి పదాన్ని పేరుస్తోందో తెలియని

ఏ క్షణాన్ని స్పృశించబోయినా

కడపటి వీడ్కోలేదో గుమ్మం ముందు

కాపు కాస్తున్నట్లే ఉంటోంది

కలయికల మీద, కలసి పడే అడుగుల మీద

చెరసాలలు దిగ్గొట్టిన వర్తమానం

నీళ్లు కారే చిల్లుకుండను మోసుకుంటూ

మనచుట్టూ తిరుగుతున్నట్లే ఉంటోంది


కలిసి నడిచే నీడ కూడా

ముంచుకొచ్చే చీకటిని

రేపటి నివాళికెక్కడ

మొదటి వాక్యంగా అచ్చొత్తుతుందేమోననే కలతలో

ఖండఖండాలుగా విరిగిపోయి

మనసు బిలాల్లో నేలందక

కొట్టుకులాడుతున్నట్లే ఉంటోంది


చిగురులు తొడిగే సూరీడులోకాల్ని

శిలలు కట్టించేసి

నడిచొచ్చిన నడకల్లోంచి జల్లెడ పట్టుకున్న

పుప్పొడిలోకాల్ని పీలికలుగా చీల్చేసి

చుట్టూ అంకుశాలపానుపుల్ని దిగేసి

హడావిడి ముగింపులకు 

అదేపనిగా పీఠికలు రాసేస్తున్న కాలాంకికల్లో -

అప్పటిదాకా నది, నదిలోని పడవ

కలిసి పాడుకున్న పాటింకిపోయి

నేలనేలంతా ప్రాణవాయువు అందక 

పెడుతున్న పొలికేకలు

నేలనేలంతా రక్కిరక్కి రగిల్చిన చితాగ్నిగుండాలు


చూపు చీల్చుకుపోలేకపోతున్న

పొగమంచులో చిక్కి

చివరికి లెక్కలపట్టీలుగా మిగిలిపోతున్న

చావుల మధ్య

బహుశా, బతుకునరం ఇంతగా

మెలికపడిందెప్పుడూ లేదనుకుంటా

ఏదో పొద్దు తాయెత్తై ఎగిరొచ్చి

ఈ విషపువాన మీద వాలి

కడుపులో కాస్త నమ్మకాన్ని 

ముడుపు కట్టిపోతుందేమోనని

దిగుళ్లింతగా ఎదురుచూపయిందెప్పుడూ లేదనుకుంటా


అలలు తెగిపోయిన సముద్రాల కళేబరాల్ని

చంకనేసుకుపోతూ

ఇంటింటా భయంకావిళ్లు దించిపోతున్న కాలమంతా

ఇప్పటికిక చుక్కలారిపోయిన ఆకాశం!

అత్తరుపూతలింకిపోయిన

బతుకు కాన్వాసుమీంచి

జరజరా జారిపోతున్న వర్ణం!!

యార్లగడ్డ రాఘవేంద్రరావు

99854 11099


Updated Date - 2021-06-21T06:02:07+05:30 IST