ఉగాది వేడుకలతో నెమ్మదించిన ప్రచారం

ABN , First Publish Date - 2021-04-14T06:54:51+05:30 IST

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార హడావిడి మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా కాస్తంత నెమ్మదించింది.

ఉగాది వేడుకలతో నెమ్మదించిన ప్రచారం

తిరుపతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార హడావిడి మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా కాస్తంత నెమ్మదించింది. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రధాన పార్టీల ప్రచారాలేవీ నడవలేదు. పలువురు ముఖ్యనేతలు మీడియా సమావేశాలకే పరిమితమయ్యారు. సత్యవేడులో మాత్రమే టీడీపీ,  బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రచారం సాగింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కార్యాలయంలో సోమవారం రాత్రి బస చేసిన చంద్రబాబు మంగళవారం ఉదయం కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పార్టీ నేతలతో సుదీర్ఘంగా మాటామంతీ సాగించారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ తిరుపతిలోనే గడిపిన ఆయన అటు తర్వాత నెల్లూరు జిల్లాకు బయల్దేరి వెళ్ళారు. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్‌ సైతం మంగళవారం తిరుపతిలోనే గడిపారు. నగరి టీడీపీ ఇంఛార్జి గాలి భానుప్రకాష్‌ నివాసంలో ఆయన రోజంతా విశ్రాంతి తీసుకున్నారు. మంత్రి కొడాలి నానీ శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు నివాసంలో గడిపారు. చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆది మూలంతో కలసి ఉప ఎన్నికలపై కసరత్తు చేశారు.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం శ్రీకాళహస్తి, సత్యవేడుల్లో పర్యటించారు. శ్రీకాళహస్తిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన సత్యవేడు పట్టణం ఎస్సీ కాలనీలో కాంగ్రెస్‌ ఇంఛార్జి పెనుబాల చంద్రశేఖర్‌తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్‌, మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సత్యవేడులో ప్రచారం చేపట్టగా కేవీబీపురంలో టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో వైసీసీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2021-04-14T06:54:51+05:30 IST