Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.3 కోట్ల భూమిపై మీనమేషాలు

కాటన్‌ మిల్లు యాజమాన్యం గుప్పిట్లో ప్రభుత్వ స్థలం

ఆక్రమణగా తేల్చి చేతులు దులుపుకున్న అధికారులు

గొర్రెకుంటలో ఎకరం 15 గుంటల స్వాధీనంపై కదలని అధికారగణం

కలెక్టర్‌కు నివేదిక పంపాం : గీసుగొండ తహసీల్దార్‌


వరంగల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఓ బడాబాబు కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికా రులే నివేదికలు సమర్పించినా స్వాధీనం చేసుకోకపోవడం పలు అను మానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే..


గీసుగొండ మండలం గొర్రెకుంట పరిధిలోని సర్వేనంబర్‌ 494లోని ఎక రం 15 గుంటల అసైన్డ్‌ భూమిని కవిత కాటన్‌ మిల్లు యాజమాన్యం ఆక్రమించి ప్రహరీ నిర్మించిందంటూ స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలను వెలికితీయాలంటూ కలెక్టర్‌  ఆగస్టు 27న గీసుగొండ తహసీల్దార్‌ను ఆదేశించారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎకరం 15 గుంటల అసైన్డ్‌ భూమి సదరు కాటన్‌ మిల్లు ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబరులో కలెక్టర్‌కు నివేదిక సైతం అధికారులు సమర్పించారు.


స్థలం స్వాధీనం చేసుకోవడంలో కాలయాపన చేయడంతో సదరు మిల్లు యాజమాన్యం కోర్టును ఆశ్రయించారు. భూమిపై పేచీ కారణంగా రెవెన్యూ పరంగా ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతో కోర్టు నుంచి పిటీషన్‌ను ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే  టీఎస్‌ఐఐసీ ఈ స్థలంలో పరిశ్రమల స్థాపన కోసం భూమి లభ్యతపై రెవెన్యూ అధికారులను సంప్రదించింది. తమకు అప్పగిస్తే మరొకరికి కేటాయిస్తామనే తరహాలో టీఎస్‌ఐఐసీ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. అయితే కలెక్టర్‌ ఆదేశాలిస్తే మిల్లు యజమాని నిర్మించిన ప్రహరీని కూల్చి, దాని స్థానంలో కొత్తగా ప్రహరీని నిర్మించి ప్రభుత్వ భూమిగా బోర్డు పెడుతామని సిబ్బంది పేర్కొంటోంది.


మిల్లు ఆఽధీనంలోనే అసైన్డ్‌ భూమి..

కలెక్టర్‌కు నివేదిక పంపించి రోజులు గడుస్తున్నా, భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని ప్రహరీని నిర్మించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ అధికారులు నివేదిక పంపినా కూడా, ప్రహరీ కూల్చేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసిన వారికి ఓ నేత వత్తాసు పలుకుతున్నట్టు  ప్రచారం జరుగుతోంది. కాగా, సదరు మిల్లు నిర్మించిన ప్రహరీ కూల్చేందుకు ఉన్నతాధికారి దగ్గరికి ఫైల్‌ వెళ్లకుండా, కిందిస్థాయి సిబ్బందితో కుమ్మక్కై  జాప్యం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


రంగంలోకి ఓ ప్రజాప్రతినిధి 

మిల్లు ఆధీనంలోని భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటారని తెలుసుకున్న మిల్లు యజమాని ఓ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్లి గండం నుంచి గెట్టెక్కించాలని కోరినట్లు తెలిసింది. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల మేరకే రెవెన్యూ సిబ్బంది కదలడం లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. గొర్రెకుంట పరిధిలోని కవిత మిల్లు ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూమి విలువ సుమారు మూడు కోట్లకు పైమాటేనని వారంటున్నారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.


కలెక్టర్‌ ఆదేశాలు ఇప్పట్లో వచ్చేనా..? 

సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలంటే కలెక్టర్‌ ఆదేశాలు తప్పని సరని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గతంలో ఇదే మండలంలో ఓ వ్యక్తి ఆక్రమించిన స్థలంలో నిర్మించిన ప్రహరీని మౌఖిక ఆదేశాలతో అప్పటి రెవెన్యూ అధికారి కూల్చడంతో కోర్టులో చివాట్లు పడినట్టు తెలిసింది. దీంతో సొంత డబ్బులతో మళ్లీ గోడ నిర్మించినట్టు సమాచారం. ఈ కారణంగానే లిఖిత పూర్వక ఆదేశాలు వస్తే తప్ప, అడుగు తాము ముందుకు వేయమనే తరహాలో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. 


కలెక్టర్‌ ఆదేశాల కోసం చూస్తున్నాం : సుహాసిని, గీసుగొండ మండలం తహసీల్దార్‌   

కవిత మిల్లు ఆధీనంలో ఎక రం పదిహేను గుంటల అసైన్డ్‌ భూమి ఉన్నట్లు గుర్తించాం. దానిలో మిల్లు యజమాని నిర్మించిన ప్రహరీ ఉంది. దాన్ని కూల్చి వేసి, అక్కడ ప్రభుత్వ పక్షాన ప్రహరీ నిర్మించాలంటే కలెక్టర్‌ ఆదేశాలు తప్పనిసరి. ఇప్పటికే కలెక్టర్‌కు నివేదిక పంపించాం. కలెక్టర్‌ ఆదేశిస్తే వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకుని ప్రహరీని నిర్మిస్తాం. 

Advertisement
Advertisement