చిన్న కాలేజీలు ఖల్లాస్‌!

ABN , First Publish Date - 2021-01-11T07:41:27+05:30 IST

కరోనా వైరస్‌.. దాని కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కొన్ని కార్పొరేట్‌ కాలేజీలకు అద్భుతంగా కలిసి వచ్చింది! ఇదే కారణంగా కొన్ని బడ్జెట్‌ కాలేజీలు తీవ్రంగా నష్టపోయాయి! మరికొన్ని ఏకంగా మూతపడ్డాయి! దాంతో, నిరుపేద విద్యార్థులు మాత్రమే కాదు..

చిన్న కాలేజీలు ఖల్లాస్‌!

123 మూత.. మరికొన్ని మూసివేత దిశగా.. కరోనా, లాక్‌డౌన్‌తో కాలేజీలకు తీరని నష్టం

పరిస్థితిని అనుకూలంగా మలచుకున్న కార్పొరేట్‌

ఒక్కో ఆన్‌లైన్‌ తరగతిలో 500 మంది విద్యార్థులు

భవనాలు, నిర్వహణ ఖర్చు నో.. లెక్చరర్ల కుదింపు

ఫీజులు మాత్రం యథాతథంగా వసూలు

చదువు మానేసిన విద్యార్థులను గుర్తించండి

ఇంటింటి సర్వేతో మళ్లీ బడి బాట పట్టించండి

స్కూళ్ల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు


బడ్జెట్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే పరిస్థితి లేదు. దీనికితోడు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో గత ఆరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 685 కాలేజీలు చదువుకు స్వస్తి చెప్పగా.. ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 123 కాలేజీలు మూతపడ్డాయి. మరో వందకుపైగా కాలేజీలు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కరోనా వైరస్‌.. దాని కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కొన్ని కార్పొరేట్‌ కాలేజీలకు అద్భుతంగా కలిసి వచ్చింది! ఇదే కారణంగా కొన్ని బడ్జెట్‌ కాలేజీలు తీవ్రంగా నష్టపోయాయి! మరికొన్ని ఏకంగా మూతపడ్డాయి! దాంతో, నిరుపేద విద్యార్థులు మాత్రమే కాదు.. లెక్చరర్లూ రోడ్డున పడ్డారు. నెలల తరబడి వేతనాలు అందక.. ఉపాధి కరవై ఆకలి కేకలు పెడుతున్నారు. తమ ఉద్యోగం ఉందో లేదో కూడా తెలియని అయోమయం వారిలో నెలకొంది. కాలేజీలు ఎప్పుడు తెరుస్తారా అని కొందరు ఎదురు చూస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ ఉన్నా కొన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో అడ్మిషన్లు యథావిధిగానే జరిగాయి. పైగా, లాక్‌డౌన్‌ను ఆయా కాలేజీల యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలచుకున్నాయి కూడా. ఉదాహరణకు, ఓ కార్పొరేట్‌ కాలేజీ గతంలో 20కిపైగా ఫస్టియర్‌ తరగతులు నిర్వహించేది. ఒక్కో తరగతిలో 50 మంది వరకూ విద్యార్థులు ఉండేవారు.


ఇందుకు పెద్దఎత్తున లెక్చరర్లను నియమించుకునేది. దీనికితోడు, ఉదయం, సాయంత్రం ట్యూషన్లు చెప్పేది. ఇందుకు భారీ సంఖ్యలో ట్యూటర్లు ఉండేవారు. కాలేజీ భవనాలు, హాస్టల్‌ భవనాలు, నిర్వహణకు పెద్దఎత్తున ఖర్చయ్యేది. అదే కాలేజీ లాక్‌డౌన్‌ కారణంగా ఆన్‌లైన్‌ బాట పట్టింది. ఇప్పుడు భవనాలు, ఇతర నిర్వహణ ఖర్చు తప్పింది. ఒక్కో ఆన్‌లైన్‌ తరగతిలో దాదాపు 500 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. వాళ్లకు అర్థమైందా? అవగాహన చేసుకున్నారా? అనే పట్టింపు లేదు. నోట్సు, హోం వర్కుల గోల లేదు. సిలబస్‌ పూర్తి చేశామని అనిపించుకోవడానికి పాఠాలు చెప్పుకొంటూ వెళ్లిపోవడమే. ఒక్కో ఆన్‌లైన్‌ తరగతిలో 500 మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు కనక.. అధ్యాపకుల సంఖ్యను భారీగా తగ్గించేసింది.


కొద్దిమందితోనే పాఠాలు చెప్పిస్తూ మిగిలిన వారిని ఇంటికి పంపించేసింది. కొన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ తరగతులు కొనసాగుతున్న తీరిది. అదే సమయంలో, ప్రైవేటు బడ్జెట్‌ కాలేజీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. విద్యార్థులు చేరక.. చేరిన వారికి ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పే స్తోమత లేక అవి ఈసురోమంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,485 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలుండగా వాటిలో 70-75ు బడ్జెట్‌ కాలేజీలు. కాలేజీ ప్రైవేటు అయినా.. దానిలో ఫీజులు సామాన్యులకు అందుబాటులో ఉండటంతో వీటిని బడ్జెట్‌ కాలేజీలుగా పేర్కొంటారు. హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లా కేంద్రా ల్లో నేటికీ అనేకమంది ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్‌ విద్య ను అభ్యసిస్తున్నారంటే ఇలాంటి కాలేజీలు అందుబాటులో ఉండటమే కారణం. అంతేనా, గ్రామీణ ప్రాంతా ల్లో కేవలం ప్రభుత్వం చెల్లించే రీయింబర్సుమెంట్‌ను ఫీజుగా తీసుకునే కాలేజీలు చాలా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు లేకపోయినా.. వాటి కొరతను తీరుస్తూ.. గ్రామీణ యువకులు ఉన్నత విద్య చదివేందుకు ప్రోత్సహిస్తున్నాయి.


ఇంటర్‌ విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఈ కాలేజీలు ఇప్పుడు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది కొన్ని కాలేజీల్లో తక్కువ మందే విద్యార్థులు చేరారు. మరికొన్నిటిలో అసలు చేరలేదు. సెల్‌ఫోన్‌ కొనుక్కునే స్తోమత లేక కూడా కొంతమంది కాలేజీల్లో చేరలేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30ువిద్యార్థులు తగ్గారని అంచనా. ఇక, కాస్త మంచి ప్రైవేటు కాలేజీలో చేరితే పది నుంచి 25 వేల ఫీజు కట్టాలి. దీనికితోడు ఇప్పుడు పది నుంచి 15 వేలతో సెల్‌ఫోన్‌ కొనాల్సి వస్తోంది. ఈ రెండూ భారంగా మారడంతో కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలో చేరారు. ఎలాగూ కాలేజీలు లేవు కనక ఈ ఏడాది కూడా ప్రభుత్వం గత ఏడాదిలాగే నిర్ణయం తీసుకోకపోతుందా? అనే ఉద్దేశంతో ప్రభుత్వ కాలేజీలో చేరామని ఓ విద్యార్థి చెప్పాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దాంతో, బడ్జెట్‌ కా లేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహించే పరిస్థితి లేదు. దీనికితోడు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సా హం లేకపోవడంతో గత ఆరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 685 కాలేజీలు చదువుకు స్వస్తి చెప్పగా.. ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 123 కాలేజీలు మూతపడ్డాయి. మరో వందకుపైగా కాలేజీలు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి.


అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

విద్యార్థులు చేరకపోవడంతో కొన్ని ప్రైవేటు కాలేజీలు ఫీజులు తగ్గిస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5000 నుంచి రూ.10 వేలు తీసుకుని అడ్మిషన్‌ కల్పిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రీయింబర్స్‌మెంట్‌ను తాము తీసుకుంటామని చెబుతున్నాయి. కానీ, కొన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో ఇప్పుడు కూడా ‘ఫీజులుం’ కొనసాగుతూనే ఉంది. ప్రత్య క్ష తరగతులు నిర్వహించకపోయినా, భవనాలు, ఇతర నిర్వహణ లేకపోయినా, లెక్చరర్లను గణనీయంగా తగ్గించేసినా అవి ఫీజులను మాత్రం యథావిధిగానే వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి.. కొన్ని కాలేజీలు అయితే, గత ఏడాదితో పోలిస్తే 10-15ు పెంచాయి కూడా. ఉత్తరాది యాజమాన్యంలో నడిచే ఇంకొన్ని కాలేజీలు రెండేళ్ల ఇంటర్మీడియట్‌కు మొదటి ఏడాదే 75ు ఫీజు కట్టించుకుంటున్నాయి. ఈసారి కరోనా కారణంగా రెండేళ్లూ సమానంగా వసూలు చేయాలని కోరినా అవి ఏ మాత్రం పట్టించుకోలేదు. సరికదా.. ఎప్పటికప్పుడు ఫీజు కట్టకపోతే ఆన్‌లైన్‌ వీడియో లింకులను కట్‌ చేసి విద్యార్థులను వేధిస్తున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ కష్టకాలంలో కార్పొరేట్‌ కాలేజీల ఫీజులుం తట్టుకోలేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.


రీయింబర్స్‌మెంట్‌ ఉంటుందా!?

విద్యార్థుల నుంచి ప్రభుత్వం వసూలు చేసే వార్షిక పరీక్ష ఫీజు, అనుబంధ గుర్తింపు కోసం ప్రైవేటు కాలేజీల నుంచి ప్రభుత్వం ఏటా వసూలు చేసే ఫీజు ఆరేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపైంది. కానీ, ఇంటర్‌ విద్యార్థులకు చెల్లించే పాకెట్‌ మనీ, రీయింబర్సుమెంట్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీనిని కూడా ప్రభుత్వం మరుసటి విద్యా సంవత్సరంలో చెల్లిస్తుండటంతో.. దానిపైనే ఆశలు పెట్టుకున్న బడ్జెట్‌ కాలేజీలపై మోయలేని భారం పడుతోంది. ప్రతి ఇంటర్‌ విద్యార్థికి నెలకు రూ.500 పాకెట్‌ మనీ; ఏడాదికి ఫస్టియర్‌లో రూ.1,760, సెకండియర్‌లో రూ.1,940 చొప్పున రీయింబర్స్‌మెంట్‌ ఇస్తోంది. జీవో-112 ప్రకారం ఈ ఫీజును ఏటా ఖర్చులకు తగ్గట్టుగా పెంచాల్సి ఉండగా.. గత ఆరేళ్లుగా ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో భవనాల అద్దె, సిబ్బంది జీతభత్యాలు చెల్లించలేక కాలేజీలు మూతబడుతున్నాయి.


లెక్చరర్లలో మళ్లీ వచ్చేది ఎందరు!?

ఒకవేళ కాలేజీలు తిరిగి ప్రారంభమైనా అధ్యాపకుల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంతో చాలామంది ప్రత్యామ్నాయ బాట పట్టారు. కొంతమంది యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటున్నారు. మరికొందరు వ్యాపారాలు ప్రారంభించారు. ఇంకొందరు సొంత ఊళ్లకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు. కేవలం ఉద్యోగంపై ఆధారపడిన వారు మాత్రమే కాలేజీలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాలేజీలు తెరిచిన తర్వాత గతంలో పని చేసిన అధ్యాపకులంతా తిరిగి చేరడం అనుమానమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  


ప్రభుత్వమే కాపాడుకోవాలి 

గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రైవేటు జూనియర్‌ కాలేజీ ఏర్పాటైతే, అక్కడి విద్యార్థులకు ఉన్నత విద్య లభించడంతోపాటు ఉన్నత విద్యను అభ్యసించిన నిరుద్యోగులకూ ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రంలో తక్కువ ఫీజుకే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రైవేటు జూనియర్‌ కాలేజీలతో వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. కానీ, విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం గత ఆరేళ్లుగా పెంచలేదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఈ కాలేజీలు మూతపడుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించకపోవడంతో అనేక కాలేజీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వీటిని ప్రభుత్వమే కాపాడుకోవాలి.

గౌరి సతీశ్‌, తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం

Updated Date - 2021-01-11T07:41:27+05:30 IST