చిన్న సన్న కారు రైతులను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2021-06-23T04:27:56+05:30 IST

చిన్న సన్నకారు రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు,

చిన్న సన్న కారు రైతులను ప్రోత్సహించాలి
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక బుక్కును విడుదల చేస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

  • రైతుబంధు నిధులు ఇతర రుణాలకు జమ చేసుకోవద్దు
  • వీధి వ్యాపారులకు, చిరువ్యాపారులకు రుణాలు అందించాలి
  • రూ.17604.59 కోట్ల రుణాల లక్ష్యంతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక
  • బ్యాంకర్ల సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : చిన్న సన్నకారు రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కుటీర పరిశ్రమలు, చేతివృత్తుల వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్లో డీసీసీ,డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 2021-22 సంవత్సరానికి ఉద్దేశించి రూ.17604.59 కోట్ల రుణాల లక్ష్యంతో రూపొందించిన రంగారెడ్డి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, చిన్న సన్నకారు రైతులు పంట రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించే విధంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. వీధి వ్యాపారులకు, చిరువ్యాపారులకు రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎంతోమంది పేదవారున్నారని, బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద సకాలంలో వారికి ఆర్థిక సహాయం అందించినట్ల యితే వారు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీ, వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, విద్యారుణాలు, గృహ రుణాల వంటి వాటి విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. రైతులకు వచ్చిన రైతుబంధు నిధులు ఇతర రుణాలకు జమ చేసుకోకుండా వారు పూర్తిగా పెట్టుబడి పెట్టుకునేందుకు ఇవ్వాలని చెప్పారు. కార్యక్ర మంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రిజ్వాన్‌, నాబార్డు ఎజీఎం ప్రవీణ్‌ కుమార్‌, వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ జిల్లాఅధికారి రాజేశ్వర్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-23T04:27:56+05:30 IST