Abn logo
Jun 9 2021 @ 01:26AM

చిన్న ముందడుగు

భారత నౌకాదళం కోసం రూ.43,000 కోట్ల వ్యయంతో ఆరు జలాంతర్గాములను నిర్మించే ప్రతిపాదనకు రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల మండలి (డీఈసీ) ఆమోదం తెలిపింది. స్వదేశీ డిఫెన్స్‌ కంపెనీలు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకుని వీటిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ మజగాన్‌ డాక్స్‌ లిమిటెడ్‌ సంస్థతో పాటు ప్రైవేటు రంగంలోని ఎల్‌ అండ్‌ టీ సంస్థకు కూడా ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌) జారీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం భారత నౌకాదళం వద్ద 15 సంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణు జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి. 1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత కొత్త జలాంతర్గాముల కోసం భారత్‌ భారీ ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్ట్‌ 75 కింద విదేశీ సంస్థలతో కలిసి ఒక డజను, ప్రాజెక్ట్‌ 75ఐ కింద దేశీయంగా మరో డజను సంప్రదాయ జలాంతర్గాముల్ని 2030లోగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 20 ఏళ్లు దాటినా భారత ఆ 24 సంఖ్యకు చేరువ కాలేకపోయింది. తాజాగా ఆరు జలాంతర్గాముల నిర్మాణాన్ని 12 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించడంతో 2030 గడువును మరి కొన్నేళ్లపాటు పొడిగించినట్టు అర్థమవుతోంది.


గతంలో ప్రధానంగా పాకిస్థాన్‌ ముప్పును మాత్రమే దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ వ్యూహరచన సాగేది. తాజాగా చైనా ఆయుధ బలం, భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మన దేశ రక్షణ మరింత భారమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. చైనా, పాకిస్థాన్‌లతో ఒకేసారి యుద్ధం వస్తే ఎదుర్కోగలిగే స్థాయిలో మన వాయుసేన వద్ద యుద్ధ విమానాలు లేవు. నౌకాదళం వద్ద తగినన్ని నౌకలు, జలాంతర్గాములు లేవు. భారత రక్షణ వ్యూహకర్తలపై ఇది ఒత్తిడి పెంచుతోంది. ప్రపంచంలో విమానవాహక నౌకలు కలిగిన అతి కొద్ది నౌకాదళాల్లో ఒకటిగా ఇండియన్‌ నేవీ గతంలో పేరు పొందింది. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో మన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత ఒక దశలో భారత్‌ అమ్ములపొదిలో రెండు క్యారియర్లు ఉండగా చైనా వద్ద ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అమెరికాతో పోటీపడుతూ ప్రపంచాధిపత్యంపై గురిపెట్టిన చైనా లియావోనింగ్‌, షాన్‌డాంగ్‌ అనే రెండు క్యారియర్లను సమకూర్చుకుంది. మరో మూడింటిని నిర్మించబోతోంది. ఇవి కాకుండా చైనా వద్ద 70 జలాంతర్గాములు ఉన్నాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాముల సంఖ్యలో చైనా అమెరికాను మించిపోయిందని అమెరికా రక్షణ శాఖ ఇటీవల ఒక నివేదికలో తెలిపింది. అమెరికా, భారత్‌లు రెండూ కలిసి తమపై యుద్ధానికి వచ్చినా ఓడించగలమని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కొన్ని నెలల కిందట ప్రకటించింది. నౌకాబలాన్ని నానాటికీ పెంచుకుంటూ దక్షిణ చైనా సముద్రం తనదేనంటున్న చైనా నౌకాదళాన్ని కట్టడి చేయాలంటే భారత్‌ ఆయుధపరంగా, దౌత్యపరంగా అత్యంత క్రియా శీలంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది.


ఈ దిశగా తాజా నిర్ణయం ఓ చిన్న ముందడుగు మాత్రమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచినా భారత్‌ ఆయుధ దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడడం వల్ల దేశీయంగా ఆయుధ తయారీ వెనుకబడింది. గత రెండు, రెండున్నర దశాబ్దాలుగా మాత్రమే దేశీయ ఆయుధ తయారీపై భారత్‌ తగినంతగా దృష్టి సారించింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణుల తయారీలో కొంత ముందడుగు వేసింది. దేశీయ ఆయుధ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం గత ఏడాది 101 రక్షణ పరికరాల దిగుమతుల్ని నిషేధించిన భారత్‌, పది రోజుల కిందట మరో 108 పరికరాల పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది. ఆయుధ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆయుధ ప్రాజెక్టుల్లో జాప్యాన్ని తగ్గించగలుగుతున్నట్లు రక్షణ నిపుణులు చెబుతున్నారు. తేలిక రకం యుద్ధ విమానం తేజస్‌ నిర్మాణానికి భారత్‌కు దాదాపు 30 ఏళ్ల సమయం పట్టగా... ఇప్పుడు వాయుసేన కోసం తేజస్‌ మార్క్‌-1ఏ, తేజస్‌ మార్క్‌-2, అయిదోతరం యుద్ధ విమానం ఏఎంసీఏతోపాటు నౌకాదళం కోసం టీఈబీడీఎఫ్‌ అనే మరో యుద్ధ విమానాన్ని భారత్‌ ఏకకాలంలో నిర్మించగలుగుతోంది. ఈ ప్రాజెక్టులన్నింటిలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా ఉంది. అయితే కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాన్ని ఎంత తొందరగా గాడిలో పెట్టగలిగితే మన రక్షణ ప్రాజెక్టులకు అంత మంచిది. భారత కంటే కొన్ని దశాబ్దాల ముందే స్వదేశీ ఆయుధ తయారీపై దృష్టి సారించినందువల్ల చైనా తక్కువ ఖర్చుతో తన ఆయుధ బలాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. స్వదేశీ తయారీకి పెద్దపీట వేయడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని, సమన్వయాన్ని, సమ న్యాయాన్ని సాధించడం భవిష్యత్తులో భారత రక్షణ వ్యూహకర్తల ముందు ఉండబోయే అతి పెద్ద సవాలు. ఈ సవాలును సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు మళ్లీ భిన్న ధ్రువ ప్రపంచం రూపొందుతున్న క్రమంలో దౌత్యపరంగా ముందుచూపుతోను, విజ్ఞతతోను వ్యవహరించడం కూడా దేశ రక్షణకు అత్యంత కీలకం.

Advertisement