స్మార్ట్‌ సిటీకి నిధుల కొరత

ABN , First Publish Date - 2021-08-02T06:25:10+05:30 IST

విశాఖను స్మార్ట్‌ సిటీగా 2016లో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఐదేళ్లపాటు ఏడాదికి రూ.వంద కోట్లు చొప్పున కేంద్రం, మరో రూ.వంద కోట్లు చొప్పున జీవీఎంసీ...స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల కోసం కేటాయించాలి.

స్మార్ట్‌ సిటీకి నిధుల కొరత
మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ (ఫైల్‌ ఫొటో)

రూ.150 కోట్ల విలువైన స్కాడా, మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులను పక్కనపెట్టిన జీవీఎంసీ

ఏడాది కిందటే నిర్ణయం

ఆలస్యంగా వెలుగుచూసిన వైనం

గ్రేటర్‌ ఖజానా ఖాళీ కావడమే కారణం


స్మార్ట్‌ సిటీ మిషన్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రాజెక్టులను నిధుల కొరత కారణంగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఉపసంహరించుకుంటోంది. తాగునీటి వృథాను అరికట్టడంతోపాటు సరఫరాలో పారదర్శకత నెలకొల్పేందుకు రూ.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన స్కాడా ప్రాజెక్టుతోపాటు రూ.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలనుకున్న సోలార్‌ ఫ్లోటింగ్‌  ప్రాజెక్టును ఏడాది కిందటే పక్కనపెట్టిన విషయం ఇప్పుడు బయటపడింది.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖను స్మార్ట్‌ సిటీగా 2016లో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఐదేళ్లపాటు ఏడాదికి రూ.వంద కోట్లు చొప్పున కేంద్రం, మరో రూ.వంద కోట్లు చొప్పున జీవీఎంసీ...స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల కోసం కేటాయించాలి. ఆయా నిధులతో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. దీనికి అవసరమైన సాంకేతిక సహాయం అందించేందుకు అయికామ్‌ అనే కన్సల్టెన్సీని నియమించింది. స్మార్ట్‌ సిటీలో స్మార్ట్‌ రోడ్లు, పురాతన భవనాల పరిరక్షణ, స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లు, కమాండ్‌ అండ్‌ మానిటరింగ్‌ సెంటర్‌, పాఠశాలల ఆధునికీకరణతోపాటు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచేందుకు స్కాడా సిస్టమ్‌, పర్యావరణహితమైన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వీటిలో కొన్ని పూర్తికాగా, మరికొన్ని ప్రారంభ దశలో, ఇంకొన్ని డీపీఆర్‌ తయారీ, టెండరు దశల్లో ఉన్నాయి. 

ఇందులో భాగంగానే నీటి సరఫరా వ్యవస్థలో సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డాటా ఎక్విజిషన్‌ (స్కాడా) విధానం తీసుకువచ్చేందుకు రూ.75 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. నగరానికి నీరు సరఫరా అయ్యే 11 రిజర్వాయర్లతోపాటు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు, మినీ రిజర్వాయర్లు, పైప్‌లైన్ల జంక్షన్లలో ఎలక్ర్టోమేగ్నటిక్‌ ఫ్లో మీటర్లు, ప్రెజర్‌ మీటర్లు ఏర్పాటుచేయాలనుకున్నారు. దీనివల్ల ప్రధాన రిజర్వాయర్ల నుంచి నగరంలోని రిజర్వాయర్లకు, అక్కడి నుంచి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లకు అక్కడి నుంచి నగరవ్యాప్తంగా వున్న మినీ రిజర్వాయర్లతోపాటు అంతర్గత పైప్‌లైన్‌ల ద్వారా సరఫరా జరిగే నీటిని పక్కాగా లెక్కించేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కడ ఎంత నీరు వస్తోంది...ఎక్కడ తగ్గుతోందనేది తెలిసిపోతుంది. ఎక్కడైనా వృథా జరిగితే దానిని అరికట్టవచ్చు. ఎవరు ఎంత నీరు వినియోగిస్తున్నారనేది మీటర్‌ రీడింగ్‌ చెప్పేస్తుంది కాబట్టి ఆ మేరకు చార్జీలు వసూలు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నది జీవీఎంసీ అధికారుల ఆలోచన. దీంతోపాటు ముడసర్లోవ రిజర్వాయర్‌లో ఏర్పాటుచేసిన తరహాలో మేహాద్రిగెడ్డపై కూడా రూ.75 కోట్ల అంచనా వ్యయంతో 15 మెగావాట్‌ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు డీపీఆర్‌ తయారుచేసేందుకు ఆసక్తి వున్న సంస్థల నుంచి ఆర్‌ఎఫ్‌పీ కూడా పిలిచారు. అయితే జీవీఎంసీ వాటాగా చెల్లించాల్సిన నిధులు అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆదాయం కంటే ఖర్చు బాగా పెరిగిపోవడంతో రోజువారీ నిర్వహణకు కూడా జీవీఎంసీ ఇబ్బంది పడుతోంది. నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేసి దాదాపు రెండేళ్లవుతున్నా బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రూ.150 కోట్ల విలువైన రెండు (స్కాడా, ఫ్లోటింగ్‌ సోలార్‌) ప్రాజెక్టులను స్మార్ట్‌ సిటీ మిషన్‌ నుంచి ఉపసంహరించాలని జీవీఎస్‌సీసీఎల్‌కి జీవీఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏడాది కిందటే ఆ రెండు ప్రాజెక్టులను స్మార్ట్‌ సిటీ మిషన్‌ నుంచి ఉపసంహరించారు. అయితే ఆ విషయం ఇప్పటివరకూ అధికారులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం. 

Updated Date - 2021-08-02T06:25:10+05:30 IST