వుడా పార్కులో స్మార్ట్‌ ఫ్లవర్‌

ABN , First Publish Date - 2020-11-27T05:42:23+05:30 IST

స్మార్ట్‌ సిటీలో మరో అరుదైన ప్రాజెక్టుకు గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు రూపకల్పన చేశారు.

వుడా పార్కులో స్మార్ట్‌ ఫ్లవర్‌

రూ.25 లక్షలతో ఏర్పాటుకు జీవీఎంసీ నిర్ణయం

దేశంలోనే మొదటిది

నగరానికి మరో ఆకర్షణగా మారుతుందని ఆశాభావం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌ సిటీలో మరో అరుదైన ప్రాజెక్టుకు గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) అధికారులు రూపకల్పన చేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సూర్యకాంతికి అనుగుణంగా తిరిగే స్మార్ట్‌ ఫ్లవర్‌ను వుడా పార్క్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రూ.25 లక్షల వ్యయంతో ఏర్పాటుచేస్తున్న ఈ ఫ్లవర్‌ జీవీ ఎంసీకి స్మార్ట్‌సిటీ ఛాలెంజ్‌లో అవార్డును తెచ్చిపెడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ రూ.30 కోట్లతో వుడా పార్క్‌ ఆధునికీకరణ పనులు 

చేపట్టింది. వాకింగ్‌ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్‌, దేశవిదేశాల నుంచి అందమైన మొక్కలను తెప్పించి నాటడం, సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా బోటింగ్‌ సదుపాయం, చిన్నారులు ఆడుకునేందుకు అన్నిరకాల వసతులు, పరికరాలతో కిడ్స్‌ జోన్‌, పార్కు అంతటా సోలార్‌ లైటింగ్‌, సిట్టింగ్‌ బెంచ్‌లు, ఓపెన్‌ జిమ్‌ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఈ పనులు ఇప్పటికి 70 శాతం వరకూ పూర్తయ్యాయి. సందర్శకులను మరింతగా ఆకర్షించడంతోపాటు, పార్కుకే తలమానికంగా వుండేలా స్మార్ట్‌ ఫ్లవర్‌ను పార్కులో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సూర్యుడి గమనానికి అనుగుణంగా తిరిగే స్మార్ట్‌ ఫ్లవర్‌ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటుందని జీవీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.వెంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తంచేశారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా దేశంలో తొలిసారి ఏర్పాటుచేసిన ముడసర్లోవ ఫ్లోటింగ్‌ సోలార్‌కు 2019లో ఉత్తమ ప్రాజెక్టు అవార్డు దక్కగా, బీచ్‌రోడ్డులో ఏర్పాటుచేసిన ఆల్‌ఎబిలిటీ పార్కుకు 2020లో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుందని, తాజా ప్రాజెక్టుకు వచ్చే ఏడాది అవార్డు దక్కడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-27T05:42:23+05:30 IST