భారత్‌లో మొదలైన కరోనా ఎఫెక్ట్..!

ABN , First Publish Date - 2020-02-20T06:45:26+05:30 IST

చైనాను వణికిస్తున్న కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ ప్రభావంతో భారత్‌లో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల ధరలు సమీప భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. చైనాలో తయారయ్యే

భారత్‌లో మొదలైన కరోనా ఎఫెక్ట్..!

టీవీలు, స్మార్ట్‌ఫోన్లు  ప్రియం!

రిఫ్రిజిరేటర్లు, ఏసీలు కూడా...

5-10 శాతం వరకు పెరగనున్న ధరలు 

వినియోగదారుడి జేబుకు కరోనా చిల్లు 

చైనాను వణికిస్తున్న కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ ప్రభావంతో భారత్‌లో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల ధరలు సమీప భవిష్యత్‌లో పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. చైనాలో తయారయ్యే వీటి విడిభాగాల ధరలు పెరగటం, సరఫరాలు దెబ్బతినటమే ఇందుకు ప్రధాన కారణం. కొన్ని కంపెనీలు ఈ నెలాఖరులో, మరికొన్ని సంస్థలు మార్చి మొదటి వారంలో ఈ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ధరల పెరుగదల ఎంత లేదన్నా 3 నుంచి 5 శాతం వరకు ఉంటుందని అంచనా. టీవీల ధరలు మాత్రం 7 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి. 


సరఫరాలు బంద్‌

కోవిడ్‌-19 వైరస్‌ దెబ్బతో చైనాలో చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుందన్న వార్తలు వస్తున్నప్పటికీ పనిచేసేందుకు కార్మికులు అంతగా ముందుకు రావటం లేదు. దీంతో చైనా నుంచి పెద్దఎత్తున ఎలకా్ట్రనిక్‌ వినియోగ వస్తువులు, ఉపకరణాలు దిగుమతి చేసుకునే భారత దిగుమతిదారులు లబోదిబోమంటున్నారు. ఈ దెబ్బతో  టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు తయారు చేసే కంపెనీల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. వీటి తయారీకి అవసరమైన విడిభాగాల కోసం ఈ కంపెనీలు ఎక్కువగా చైనాపైనే ఆధారపడతాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో మూతపడిన ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియడం లేదు. మరోవైపు ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఫార్మా కంపెనీలదీ ఇదే పరిస్థితి. 


ధరలు పెంచిన షామీ..

చైనాకు చెందిన షియోమీ కంపెనీ గత వారం ఒక స్మార్ట్‌ఫోన్‌ మోడ ల్‌ ధర రూ.500 పెంచింది. విడిభాగాల సరఫరాకు అంతరాయం ఏర్పడడమే కాకుండా, ధరలు పెరిగినందున తామూ పెంచక తప్పడం లేదని తెలిపింది. కాగా మిగతా చైనా కంపెనీలు మాత్రం ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. 


డిస్కౌంట్లలో కోత

రోజురోజుకు పరిస్థితి దిగజారుతుండటంతో కొన్ని కంపెనీలు అమ్మకాల ప్రమోషన్‌ కోసం చేసే ఖర్చులు, రిటైలర్లకు ఇచ్చే డిస్కౌంట్లు తగ్గించుకుంటున్నాయి. మరో నెల రోజుల వరకు పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ ఇప్పటికే తన రిటైలర్లకు స్పష్టం చేసింది.  ఇదే సమయంలో రిటైలర్లకు ఇచ్చే డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు తగ్గించి, ధరలు పెంచకుండా ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలని యాపిల్‌ ఇండియా భావిస్తున్నట్టు సమాచారం. 


భారత మార్కెట్‌పై చైనా పట్టు..

  1. 85 శాతం స్మార్ట్‌ఫోన్ల విడిభాగాలు చైనా నుంచే దిగుమతి
  2. టీవీల తయారీ విడిభాగాల్లో 75 % అక్కడి నుంచే 
  3. ఏసీలు, ఫ్రిజ్‌ల విడిభాగాలు కూడా


 కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదు. ప్రపంచ జీడీపీ, వాణిజ్యంపై మాత్రం బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌


చైనా నుంచి అన్ని విడిభాగాల దిగుమతి ఆలస్యమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు 3 నుం చి 5 శాతమైనా పెంచక తప్పదు.

కమల్‌ నంది, బిజినెస్‌ హెడ్‌,  గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌

Updated Date - 2020-02-20T06:45:26+05:30 IST