స్మార్ట్‌ఫోన్స్‌ నయా ట్రెండ్స్‌

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

ఒకప్పుడు మనం చూసిన స్మార్ట్‌ ఫోన్‌ కి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న దానికి చెప్పలేనంత వ్యత్యాసం కనిపిస్తోంది.

స్మార్ట్‌ఫోన్స్‌ నయా ట్రెండ్స్‌

ఒకప్పుడు మనం చూసిన స్మార్ట్‌ ఫోన్‌ కి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న దానికి చెప్పలేనంత వ్యత్యాసం కనిపిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ డిజైన్స్‌ మొదలుకొని అందులో పొందుపరిచి ఉన్న ఫీచర్స్‌ వరకు కాలక్రమేణా అన్నిటా అనేక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్‌లో కొత్తగా వస్తున్న వినూత్నమైన సదుపాయాలను ఇప్పుడు చూద్దాం. 




స్ర్కీన్‌లోనే సెల్ఫీ కెమెరా


వీడియోలు చూడటానికి, గేమ్స్‌ ఆడటానికి అందరూ స్ర్కీన్‌ పరిమాణం ఎక్కువగా కోరుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది, మరి సెల్ఫీ కెమెరాని ఎక్కడ పెట్టాలి? ఈ ఇబ్బందిని చాలాకాలంగా ఫోన్‌ తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. స్ర్కీన్‌లోనే ఓ చిన్న రంధ్రం చేసి కొన్ని కంపెనీలు కెమెరాలు పెడితున్నాయి. మరికొన్ని పాపప్‌ సెల్ఫీ కెమెరాలను అందిస్తున్నాయి.


అయితే ఈ సమస్య ఏమీ లేకుండా కళ్లకు కనిపించని విధంగా ఫోన్‌ స్ర్కీన్‌లోనే కెమెరాలు రాబోతున్నాయి. ఇప్పటికే అనేక ఫోన్‌ తయారీ సంస్థలు తమ హై ఎండ్‌ మోడల్స్‌కి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అప్పుడు మనం వీలైనంత ఎక్కువ స్ర్కీన్‌ పరిమాణం  పొందొచ్చు.




బటన్లు, పోర్టులూ లేని ఫోన్లు


చాలామంది గుర్తుందో లేదో ఐదారు సంవత్సరాల క్రితం వరకు స్మార్ట్‌ఫోన్ల క్రింది భాగంలో హోమ్‌, బ్యాక్‌, రీసెంట్‌ అనే మూడు హార్డ్‌వేర్‌ బటన్లు ఉండేవి. తదుపరి మెల్లగా వాటి స్థానంలో ఆపరేటింగ్‌ సిస్టంలోనే స్ర్కీన్‌ అడుగు భాగంలో కనిపించే విధంగా ఆ మూడింటికి నావిగేషన్‌ బటన్లు వచ్చాయి. ఇప్పుడు జెశ్చర్‌ నావిగేషన్‌ చూస్తున్నాం. ఇప్పుడు చాలా వరకూ స్ర్కీన్‌ మొత్తం మనం వాడుకోటానికి లభిస్తోంది. ఒక స్మార్ట్‌ ఫోన్‌లో ఇంకా మిగిలి ఉన్నవి పవర్‌, వేల్యూమ్‌ బటన్లు, సిమ్‌ కార్డ్‌ ట్రే, ఆడియో జాక్‌, యుఎస్‌బి పోర్ట్‌! వీటిని కూడా తొలగించే ప్రయత్నంలో ఫోన్‌ తయారీ కంపెనీలు ఉన్నాయి.


పవర్‌, వేల్యూమ్‌ బటన్లని వర్చ్యువల్‌గా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో స్ర్కీన్‌పై టాప్‌ చేయడం ద్వారా అది ఆన్‌ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. సిమ్‌ కార్డ్‌ అనేదే లేకుండా ఇ-సిమ్‌ ఇక మీద రాజ్యమేలనుంది. ఆడియో జాక్‌కి బదులు బ్లూటూత్‌ ఆధారంగా పనిచేసే వైర్లెస్‌ ఇయర్‌ బడ్స్‌ వాడాలని సూచిస్తున్నారు. యుఎస్‌బి ఛార్జింగ్‌ బదులు వైర్లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌లను అందిస్తున్నారు. ఇలా పూర్తిగా ఎలాంటి బటన్లు, పోర్టులూ లేకుండా ఫోన్లు రానున్నాయి. ఇప్పటికే వివో అపెక్స్‌ ఇలాంటి ప్రయత్నం చేసింది. మున్ముందు అనేక ఫోన్లు ఇలా బటన్‌లెస్‌గా వస్తాయి.




ఇయర్‌బడ్స్‌ కొనాల్సిన పనిలేకుండా


ఈమధ్య చాలామంది వైర్లెస్‌ ఇయర్‌ బడ్స్‌ కొనుగోలు        

చేస్తున్నారు. ఇలా ప్రత్యేకంగా వాటిని కొనుగోలు చేయాల్సిన పనిలేకుండా, ఫోన్‌ లోపలే వైర్లెస్‌ ఇయర్‌బడ్స్‌ అమర్చుకోవడానికి ఓ స్లాట్‌ ఉంటుంది. ఉదాహరణకు శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ ఫోన్లని ఉపయోగిస్తున్నవారికి అందులో ప్రత్యేకంగా పెన్‌ అమర్చుకోవచ్చన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఇయర్‌బడ్స్‌ని కూడా అమర్చుకునే సదుపాయాన్ని కొన్ని ఫోన్‌ తయారీ కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఫోన్‌ లోపల అవి ఉన్నప్పుడు ఛార్జింగ్‌ అవుతూ ఉంటాయి. అలాగే స్పీకర్ల మాదిరిగా కూడా పనిచేస్తాయి.


ఎప్పుడైతే ఫోన్‌ నుంచి బయటకు తీసి చెవిలో పెట్టుకుంటారో, అప్పుడు వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌గా పనిచేస్తాయి. అయితే ఈ సదుపాయంతో ఫోన్‌ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రత్యేకంగా ఇయర్‌బడ్స్‌ కొనుగోలు చేయాల్సిన పనిలేకుండా, వాటిని ఎక్కడపడితే అక్కడ మర్చిపోవటం లాంటి ప్రమాదాలు లేకుండా ఇలా ఫోన్‌లో అంతర్భాగంగా ఉంటే చాలా సురక్షితంగా ఉంటాయి. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో అధిక శాతం ఫోన్లు ఈ తరహా సదుపాయాన్ని అందించే ప్రయత్నాల్లో ఉన్నాయి.




మరిన్ని ఫోల్డబుల్‌ ఫోన్లు


రెండేళ్ళుగా శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ వంటి అనేక ఫోల్డబుల్‌ ఫోన్స్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్‌ సంస్థ ఇప్పటికే మూడు మోడల్స్‌ విడుదల చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు శాంసంగ్‌ సంస్థ గెలాక్సీ నోట్‌, ఎస్‌ సిరీస్‌ ఫోన్లని తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లుగా పరిగణించేది. కొత్తగా తీసుకువచ్చే అన్ని సదుపాయాలు ఆ మోడల్స్‌లో అందించేది. అలాంటిది కాస్తా తాజాగా ఆ ఫోన్స్‌కి ఫ్లాగ్‌షిప్‌ హోదా తొలగించింది.


వాటి స్థానంలో ఆ సంస్థ విడుదల చేసే ఫోల్డబుల్‌ ఫోన్స్‌ని మాత్రమే ఫ్లాగ్‌షిప్‌లుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. దీన్నిబట్టి మామూలు ఫ్లాట్‌ ఫోన్స్‌ ఇకముందు పాత చింతకాయ పచ్చడేనని భావించాల్సి ఉంటుంది. దాదాపు అన్ని ఫోన్‌ తయారీ కంపెనీలు వివిధ ఆకారాల్లో ఫోల్డబుల్‌ ఫోన్స్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు మైక్రోసాఫ్ట్‌ సంస్థ కూడా విండోస్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేసే ఓ ఫోల్డబుల్‌ డివైజ్‌ని తీసుకు వస్తోంది. ఇలాంటి మోడల్స్‌తో ఎక్కువ స్ర్కీన్‌ పరిమాణం లభించడమే కాకుండా, ఫోన్‌ ద్వారా ప్రొఫెషనల్‌ పనులు చేసుకోగలిగే విధంగా మల్టీటాస్కింగ్‌ కూడా సాధ్యపడుతుంది.



కలర్‌ ఎప్పటికప్పుడు మారే విధంగా!


గతంలో స్మార్ట్‌ పోన్‌ వెనకభాగాన్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈ మధ్య కాలంలో ఫోన్‌ వెనుక భాగంలో ఆకర్షణీయమైన టెక్చర్‌, రంగురంగులుగా కనిపించే డిజైన్లు చాలా వాటిలో కనిపిస్తున్నాయి. ఫోన్‌ చేతిలో పట్టుకున్నప్పుడు వెనక భాగం చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఫోన్‌ తయారీ కంపెనీలు దీనిపై కూడా శ్రద్ధ వహిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో వివో వంటి కొన్ని ఫోన్‌ తయారీ కంపెనీలు ఫోన్‌ వెనుక భాగం మరింత అందంగా కనిపించడం కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒక చిన్న బటన్‌ ప్రెస్‌ చేస్తేచాలు, ఫోన్‌ వెనుక భాగంలో రకరకాల రంగులు మారిపోతుంది. దీనికోసం ఎలక్ర్టో క్రోమిక్‌ గ్లాస్‌ని వాడుతున్నారు. ఇప్పటివరకు ఈ గ్లాస్‌ ఏరోప్లేన్లు, హోటళ్లలో వాడేవారు. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ డిజైన్‌ లోకి కూడా ఇది 

వచ్చేసింది.



 




బ్యాటరీ ఎక్కువగా ఉండేలా


నాలుగైదు సంవత్సరాల క్రితం 3500, 4000 ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన బ్యాటరీ మాత్రమే చాలా ఫోన్లలో ఉండేది. అలాంటిది కాస్త ఇప్పుడు శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌ 51 వంటి ఫోన్లలో 7000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీని చూస్తున్నాం. మున్ముందు ఒక చిన్న స్థాయి పవర్‌ బ్యాంక్‌ మాదిరిగా, ఫోన్‌ బరువు పెరగకుండానే 10000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఫోన్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఫోన్‌ని కేవలం 10 నుంచి5 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్‌ చేసే విధంగా ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీలు కూడా    వస్తున్నాయి. అవి ఎప్పటికప్పుడు ఛార్జింగ్‌ వేగాన్ని పెంచుతున్నాయి.










ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌


ఒక స్మార్ట్‌ ఫోన్లో వివిధ సందర్భాల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఫొటోలు తీసేటప్పుడు సీన్‌ ఆప్టిమైజేషన్‌ వంటి సదుపాయం ద్వారా మెరుగైన ఫొటోలు లభించడం కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అలాగే కీబోర్డ్‌లో మనం తరవాత ఏం టైప్‌ చేయబోతున్నాం అన్నది తెలుసుకోవడం కోసం ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఒక భాగమైన మిషిన్‌ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నారు.




తరచూ ఇలాంటి అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేస్తున్నాం అన్న దానిబట్టి వాటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచే విధంగా కూడా ఈ టెక్నాలజీ వాడుతున్నారు. అయితే మున్ముందు ఒక స్మార్ట్‌ ఫోన్‌లో వివిధ ప్రదేశాల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తృతంగా ఉపయోగించనున్నారు.. దీనికోసం ఫోన్‌ అంతర్గతంగానే అనేక మొబైల్‌ చిప్‌సెట్లలో ‘ఏఐ’ సామర్థ్యం కలిగిన చిప్‌లు నిక్షిప్తం చేస్తున్నారు.




నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST