కంపు కంపు..

ABN , First Publish Date - 2021-12-07T04:36:14+05:30 IST

కంపు కంపు..

కంపు కంపు..
ప్రాజెక్టు కాలువలోకి మురుగునీరు

  • ప్రాజెక్టు కాలువలో వదులుతున్న మరుగుదొడ్ల నీరు
  • కంపుకొడుతున్న పరిసరాలు..స్థానికుల బెంబేలు

పెద్దేముల్‌: కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలోకి మరుగుదొడ్లలో వాడుకనీటిని వదులుతున్నారు. మురుగునీరు కాలువలో చేరి కంపుకొడుతోంది. పరిసరాల ప్రజలు దుర్వాసనను భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామంలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కొనసాగుతోంది. గురుకుల పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ రెహమానియాపేరుతో ప్రైవేటు పాఠశాల కొనసాగేది. ఆ పాఠశాల యాజమాన్యం ఇపుడు ఆభవనాన్ని గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చారు. అయితే ఇక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు సెప్టిక్‌ట్యాంక్‌ చిన్నదిగా ఏర్పాటు చేశారు. అందులో నిండిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించకుండా సెప్టిక్‌ ట్యాంకులో నుంచి కోట్‌పల్లి ప్రాజెక్టు కాలువలోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆనీరు కాలువలో చేరి దుర్వాసన వెదజల్లుతోంది. కాలువ గ్రామంలోని ఇళ్ల మధ్యనుంచి ఉండడంతో కాలువ సమీపంలోని ప్రజలు దుర్వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈవిషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ భవన యజమానికి చెప్పడంతో ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నీటిని తోడడం లేదు. దీంతో మరుగుదొడ్లలో వాడిన నీరంతా కాలువలో చేరి పారుతోంది. గుంతలు ఉన్న చోట మడులు కట్టి కంపు కొడుతోంది. దీని వల్ల కాలువసమీపంలోని ఇళ్ల ప్రజలకు దోమల బెడద ఎక్కువైంది. దోమకాటు, దుర్వాసనతో జనం వ్యాధులబారిన పడుతున్నారు.  అధికారులు ఇప్పటికైనా స్పందించి సెప్టిక్‌ ట్యాంకులో నుంచి నీరు బయటకు రాకుండా నిండిన వెంటనే నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-12-07T04:36:14+05:30 IST