రికార్డు ఛేదనలో.. రాజసం

ABN , First Publish Date - 2020-09-28T10:51:50+05:30 IST

రాజస్థాన్‌ ముందు లక్ష్యం 224 రన్స్‌.. శాంసన్‌, స్మిత్‌ బాదుడుకు వావ్‌ అనేలా 8.5 ఓవర్లలోనే స్కోరు 100కి చేరింది.

రికార్డు   ఛేదనలో.. రాజసం

224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన స్మిత్‌ సేన

తెవాటియా వీరోచిత ఇన్నింగ్స్‌

పంజాబ్‌కు ఝలక్‌


ఐపీఎల్‌లో వేగం (45 బంతుల్లో)గా సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌. తొలి స్థానంలో యూసుఫ్‌ పఠాన్‌ (37 బంతుల్లో) ఉన్నాడు.


పంజాబ్‌ తరఫున ఏ వికెట్‌కైనా రెండో అత్యుత్తమ భాగస్వామ్యం (183) నమోదు చేసిన రాహుల్‌-మయాంక్‌. 


రాజస్థాన్‌ ముందు లక్ష్యం 224 రన్స్‌.. శాంసన్‌, స్మిత్‌ బాదుడుకు వావ్‌ అనేలా 8.5 ఓవర్లలోనే స్కోరు 100కి చేరింది. కానీ ఆ తర్వాత ఆరు ఓవర్లలో చేసింది 40 పరుగులే.. శాంసన్‌ దూకుడు మీదున్నా రాహుల్‌ తెవాటియా జిడ్డు ఆట రాయల్స్‌ కొంప ముంచేటట్టుగానే అనిపించింది. కానీ తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేసిన అతడు మంత్రం వేసినట్టుగా ఆ తర్వాతి 12 బంతుల్లో ఏడు సిక్సర్లతో 45 పరుగులు చేయగా ఒక్కసారిగా జీరో నుంచి హీరో అయ్యాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ఛేదన చేసిన జట్టుగా రాయల్స్‌ రికార్డు సృష్టించింది. అంతకుముందు మయాంక్‌ వీరోచిత సెంచరీతో పంజాబ్‌ భారీ స్కోరు సాధించినా ఫలితం లేకపోయింది. 


షార్జా: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో అత్యంత నాటకీయంగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ.. చివరకు రాజస్థాన్‌ రాయల్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ రాహుల్‌ తెవాటియా (31 బంతుల్లో 7 సిక్సర్లతో 53) చూపిన తెగువ అబ్బురపరిచింది. సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85), స్మిత్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) ఆరంభంలో విజయానికి బాటలు వేశారు. ఆదివారం జరిగిన ఈ మ్యా చ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 106), రాహుల్‌ (54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69) రాణించారు. ఛేదనలో రాజస్థాన్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసి నెగ్గింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు.


చెలరేగిన శాంసన్‌, స్మిత్‌: రికార్డు ఛేదనలో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఉత్కంఠభరితంగా సాగింది. మూడో ఓవర్‌లో బట్లర్‌ (4) వికెట్‌ కోల్పోయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా శాంసన్‌ అయితే వచ్చీ రావడంతోనే సిక్సర్‌తో బదులిచ్చాడు. ఐదో ఓవర్‌లో తను 6,4 బాదగా.. ఆరో ఓవర్‌లో స్మిత్‌ మూడు ఫోర్లు సాధించాడు. దీంతో 69 పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. కానీ ప్రమాదకరంగా కనిపిస్తున్న స్మిత్‌ను 9వ ఓవర్‌లో నీషమ్‌ దెబ్బతీయగా రెండో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటిదాకా ఓవర్‌కు 11 పరుగుల రన్‌రేట్‌తో విజయం వైపు సాగిన ఆటతీరు ఒక్కసారిగా నెమ్మదించింది. రాహుల్‌ తెవాటియా వేగంగా ఆడలేకపోవడంతో ఒత్తిడి పెరిగింది. రన్‌రేట్‌ భారీగా పెరుగుతున్న స్థితిలో శాంసన్‌ 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో కాస్త జోష్‌ నింపాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే షమీ అతడి వికెట్‌ తీసి గట్టి షాక్‌ ఇచ్చాడు.


6 బంతులు.. 5 సిక్సర్లు:

ఈ దశలో 18 బంతుల్లో 51 పరుగులు కావాల్సి ఉండగా తెవాటియా ఒక్కసారిగా జూలు విదిల్చాడు. కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 6,6,6,6,0,6తో 30 పరుగులు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో లక్ష్యం 12 బంతుల్లో 21 పరుగులైంది. 19వ ఓవర్‌ తొలి బంతికి ఊతప్ప (9)ను షమి అవుట్‌ చేసినా ఆర్చర్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. చివరి బంతికి తెవాటియా అవుటైనా అప్పటికి విజయానికి 2 పరుగులే అవసరం కాగా, ఓ వికెట్‌ పడినా టామ్‌ కర్రాన్‌ ఫోర్‌తో రాయల్స్‌ లాంఛనం పూర్తి చేసింది.


బాదుడే బాదుడు:

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఈసారి మయాంక్‌ అగర్వాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడి దూకుడు గమనించిన కెప్టెన్‌ రాహుల్‌ పూర్తిగా సహకారం అందించాడు. తొలి ఓవర్‌లో 3 పరుగులే వచ్చినా ఆ తర్వాత మయాంక్‌ సిక్సర్లతో విజృంభించగా.. రాహుల్‌ నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇక 8వ ఓవర్‌లో మయాంక్‌ మరింతగా చెలరేగి వరుసగా 6,6,4 బాదాడు. ఆ తర్వాత మరో రెండు సిక్సర్లతో 27 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరి ధాటికి తొలి 10 ఓవర్లలోనే జట్టు 110 పరుగులు సాధించింది.


రాహుల్‌ 35 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. మరోవైపు మయాంక్‌ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీని 45 బంతుల్లోనే పూర్తి చేశాడు. అతడి ద్వితీయ 50 పరుగులు కేవలం 18 బంతుల్లోనే రావడం విశేషం. అయితే టామ్‌ కర్రాన్‌ 17వ ఓవర్‌లో మయాంక్‌ను.. తర్వాతి ఓవర్‌లో రాహుల్‌ను రాజ్‌పుత్‌ అవుట్‌ చేయడంతో రాజస్థాన్‌ ఊపిరి పీల్చుకుంది. అయుతే అప్పటికే తొలి వికెట్‌కు 183 పరుగుల భారీ భాగస్వామ్యం వచ్చింది. అటు చివరి ఓవర్‌లో పూరన్‌ (8 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 25 నాటౌట్‌) 6,4,6 బాది 18 పరుగులు రాబట్టి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉండేలా చూశాడు.


స్కోరుబోర్డు

కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) గోపాల్‌ (బి) రాజ్‌పుత్‌ 69, మయాంక్‌ (సి) శాంసన్‌ (బి) టామ్‌ కర్రాన్‌ 106, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 13, పూరన్‌ (నాటౌట్‌) 25, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 223/2; వికెట్ల పతనం: 1-183, 2-194; బౌలింగ్‌: ఉనాడ్కట్‌ 3-0-30-0, అంకిత్‌ రాజ్‌పుత్‌ 4-0-39-1, ఆర్చర్‌ 4-0-46-0, శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-44-0, రాహుల్‌ తెవాటియా 1-0-19-0, టామ్‌ కర్రాన్‌ 4-0-44-1.


రాజస్థాన్‌ రాయల్స్‌:

జోస్‌ బట్లర్‌ (సి) సర్ఫ్‌రాజ్‌ (బి) కాట్రెల్‌ 4, స్టీవెన్‌ స్మిత్‌ (సి) షమి (బి) నీషమ్‌ 50, సంజూ శాంసన్‌ (సి) రాహుల్‌ (బి) షమి 85, రాహుల్‌ తెవాటియా (సి) మయాంక్‌ (బి) షమి 53, ఊతప్ప (సి) పూరన్‌ (బి) షమి 9, ఆర్చర్‌ (నాటౌట్‌) 13, రియాన్‌ పరాగ్‌ (బి) ఎం.అశ్విన్‌ 0, టామ్‌ కర్రాన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.3 ఓవర్లలో 226/6; వికెట్లపతనం: 1-19, 2-100, 3-161, 4-203, 5-222, 6-222; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-52-1, షమి 4-0-53-3, రవి బిష్ణోయ్‌ 4-0-34-0, నీషమ్‌ 4-0-40-1, మురుగన్‌ అశ్విన్‌ 1.3-0-16-1, మ్యాక్స్‌వెల్‌ 3-0-29-0.



Updated Date - 2020-09-28T10:51:50+05:30 IST