ఆ కర్ణాటక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి : స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2021-12-17T23:06:06+05:30 IST

అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్ణాటక కాంగ్రెస్

ఆ కర్ణాటక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి : స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ : అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేసిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్‌ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. ‘‘అమ్మాయిని నేను, పోరాడగలను’’ అంటూ ఉత్తర ప్రదేశ్‌లో నినదించడానికి ముందు, సిగ్గుచేటు వ్యాఖ్యలు చేసిన ఈ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలన్నారు. 


కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ గురువారం అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శాసన సభలో అకాల వర్షాల వల్ల పంటలకు జరిగిన నష్టంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పంటలకు జరిగిన నష్టంపై అనేక మంది సభ్యులు మాట్లాడటానికి ప్రయత్నించడంతో స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగేరి అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాట్లాడటానికి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే ఒకే అంశానికి పరిమితమైతే, ఇతర అంశాలపై మాట్లాడటానికి సమయం ఉండదన్నారు. అనివార్యమైనదానిని అనుభవిస్తున్నట్లు తన పరిస్థితి ఉందని రమేశ్ కుమార్ వైపు చూస్తూ అన్నారు. దీంతో రమేశ్ కుమార్ స్పందిస్తూ, ఓ సామెత ఉందని చెప్పారు. ‘‘అత్యాచారం అనివార్యమైనపుడు, పడుకుని, ఆనందించాలి’’ అన్నారు. 


రమేశ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం స్పందిస్తూ, రమేశ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ‘‘అమ్మాయిని నేను, పోరాడగలను’’ అని ఉత్తర ప్రదేశ్‌లో నినదించడానికి ముందు రమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఉందా? అని నిలదీశారు. 


మహిళల గౌరవాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేసే శాసన సభను ఈ విధంగా మహిళలకు వ్యతిరేకంగా సిగ్గుచేటు వ్యాఖ్యలు చేయడానికి ఓ కాంగ్రెస్ నేత ఉపయోగించుకోవడం దారుణమన్నారు. ఓ కాంగ్రెస్ నేత సంకుచిత ఆలోచనా ధోరణి ఆ పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘‘అమ్మాయిని నేను, పోరాడగలను’’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. 


Updated Date - 2021-12-17T23:06:06+05:30 IST