ఏసీలో 40 పాము పిల్లలు... ఆ కుటుంబానికి షాకింగ్... రాత్రంతా జాగారం...

ABN , First Publish Date - 2020-06-04T23:13:49+05:30 IST

ఏసీలో 40 పాము పిల్లలు... ఆ కుటుంబానికి షాకింగ్... రాత్రంతా జాగారం...

ఏసీలో 40 పాము పిల్లలు... ఆ కుటుంబానికి షాకింగ్... రాత్రంతా జాగారం...

మీరట్ : వేసవి కాలంలో తప్పనిసరిగా అవసరమనుకున్నాయో, ఏమో కానీ... పాములు కూడా ఏసీల్లో తిష్ఠ వేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఈ తరహాలోనే ఓ సంఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే... ఒకటీ, రెండు కాదు... ఏకంగా నలభై పాము పిల్లలు. వివరాలిలా ఉన్నాయి.


పవ్లీకుర్ద్‌ గ్రామానికి చెందిన శ్రద్ధానంద్ అనే రైతు  నిద్రపోయేందుకు బెడ్‌రూంలోకి వెళ్లాడు. ఈ సందర్భంగా నేలపై పాము పిల్లను చూశాడు. వెంటనే దాన్ని పట్టుకుని బయట వదిలిపెట్టాడు. మళ్లీ బెడ్రూమ్‌లోకి వెళ్లి చూడగా... మరో మూడు పాములు మంచంపై తిరుగుతూ కనిపించాయి. దీంతో వాటిని కూడా పట్టుకుని బయట వదిలిపెట్టాడు. అయితే, ఈ పాములు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియక శ్రద్ధానంద్ కాసేపు గందరగోళానికి గురయ్యాడు.


ఈ క్రమలోనే వెతకడం మొదలుపెట్టాడు. అతడు చూస్తుండగానే మరో పాము పిల్ల ఏసీ నుంచి బయటకు రావడం కనిపించింది. దీంతో శ్రద్ధానంద్ ఏసీని తెరిచి చూడగా అందులో పాము పిల్లలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. ఈ విషయం తెలిసి గ్రామస్తులు శ్రద్ధానంద్ ఇంటికి వచ్చారు. వారి సాయంతో ఏసీలోని పాము పిల్లలను ఒక్కొక్కటిగా బయటకు తీసి సంచిలో వేశారు. అలా సుమారు 40 పాము పిల్లలను పట్టుకున్నారు.


మొత్తంమీద శ్రద్ధానంద్‌ కుటుంబానికి రాత్రంతా జాగారమే అయ్యింది. ఈ ఘటనపై వెటర్నరీ డాక్టర్ ఆర్కే వాత్సాల్ స్పందిస్తూ... ‘ఎయిర్ కండిషనర్లను ఎక్కువ రోజులు ఉపయోగించకుండా వదిలేసినా, మెయింటెనెన్స్ చేయకపోయినా పాములు అందులోకి దూరి గుడ్లు పెట్టే అవకాశం ఉంది’ అని చెప్పారు. కొద్ది నెలల కిందట కొలరాడోకు చెందిన ఓ జంట తమ కొత్త ఇంట్లోకి వెళ్లి చూడగా 150 పాము పిల్లలు తిరుగుతూ కనిపించాయి.


కొత్త ఇంటిని ఎక్కువ రోజులు ఖాళీగా వదిలేయడంతో పాములు తిష్ట వేశాయని, ఇలాంటి పరిస్థితి రాకూడదంటే.,. ఇళ్లల్లో పెస్ట్ కంట్రోల్‌ను పిచికారి చేయడం ఉత్తమమని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-04T23:13:49+05:30 IST