గుట్టుగా గంజాయి దందా

ABN , First Publish Date - 2022-06-17T07:08:37+05:30 IST

జిల్లా మీదుగా గంజాయి రవాణా గుట్టుగా సాగుతోంది. పోలీసుల నిఘాను తప్పించుకుంటూ కొందరు అక్రమార్కులు గంజాయి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

గుట్టుగా గంజాయి దందా

లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో బయటపడిన గంజాయి

విశాఖ ఏజెన్సీ నుంచి  సరఫరా చేస్తున్నారని సమాచారం

దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు

ప్రమాదంలో నలుగుగురికి గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

నిజామాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మోర్తాడ్‌: జిల్లా మీదుగా గంజాయి రవాణా గుట్టుగా సాగుతోంది. పోలీసుల నిఘాను తప్పించుకుంటూ కొందరు అక్రమార్కులు గంజాయి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున జిల్లాలోని మోర్తాడ్‌ మండలం డొంకల్‌వద్ద ఆగి ఉన్న లారీ ని వెనుక నుంచి కారు ఢీ కొనడంతో గంజాయి సరఫరా వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన లారీని పరిశీలించేందుకు వచ్చిన అధికారులు వాహన తనిఖీ చేయగా భారీగా బెండల్స్‌ బయటపడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

         ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు..

మోర్తాడ్‌ మండలంలోని దొన్కల్‌ సంతోష్‌నగర్‌ కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఎస్సై ముత్యంరాజ్‌ తెలిపారు. గురువారం వేకువజామున మెట్‌పల్లి నుంచి సిఫ్ట్‌కారులో బాను, సల్మాన్‌, నితిన్‌, వెంకటేష్‌ అనే నలుగురు ఫొటోగ్రాఫర్లు పెళ్లి ఫొటోషూట్‌ కోసం హైదరాబాద్‌కు బయలుదేరారని ఎస్సై తెలిపారు. అయితే సంతోష్‌నగర్‌ కాలనీ వద్ద చెడిపోయిన లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచడంతో కారు డ్రైవర్‌ గమనించక లారీని ఢీ కొట్టాడని తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా నితన్‌, వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కాగా, లారీ వెనుక భాగంలో ఎలాంటి లైట్లు, సూచికబోర్డు లేకపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

        లారీలో భారీగా గంజాయి సంచులు..

ప్రమాదానికి కారణమైన రాజస్థాన్‌కు చెందిన లారీలో 19 గంజాయి బెండళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బెండల్‌ ఖరీదు సుమారు రూ.లక్షకు పైగా ఉంటుందని సమాచారం. అయితే పోలీసులు మొదట కేవలం రోడ్డు ప్రమాదంపై దృష్టి పెట్టినా.. అనుమానం వచ్చి లారీని సోదాచేయగా గంజాయి సంచులను గుర్తించారు. దీంతో లారీనీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

        విశాఖపట్నం నుంచి తరలింపు..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి గంజాయిని రాజస్థాన్‌కు చెందిన లారీలో తరలిస్తున్నట్టు సమాచారం. అయితే వీరు మధ్యలో తెలంగాణలో కూడా అక్కడక్కడ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. లారీకి వెనుక భాగంలో నెంబర్‌ ప్లేట్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌, భీమ్‌గల్‌ సీఐ వెంకటేశ్వర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, పోలీసులు ఇప్పటి వరకు గంజాయి సంచుల స్వాధీనం విషయంలో ఎలాంటి  ప్రకటన చేయలేదు.

       పోలీసుల ఆరా..

లారీ చెడిపోవడం వల్ల రోడ్డు పక్కన నిలిపి ఫోన్‌లో మెకానిక్‌ను సంప్రదించడంతో జిల్లాకు సంబంధించిన వ్యాపారులకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. లారీ డ్రైవరే డబ్బుల కోసం గంజాయి రవాణాదారులకు సహకరించాడా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లారీలో భారీగా గంజాయి లభించిందని అది ఎక్కడినుంచి ఎక్కడికి రవాణా చేస్తున్నారో వివరాలను సేకరిస్తున్నామని భీంగల్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. లారీ డ్రైవర్‌ పారిపోవడం వల్ల ఇతర కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దర్యాప్తు తర్వాతనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-17T07:08:37+05:30 IST