అంత నిర్లక్ష్యమా..!

ABN , First Publish Date - 2020-08-11T10:37:32+05:30 IST

రంగారెడ్డి - నల్గొండ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి మరమ్మతు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామస్థులు సోమవారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

అంత నిర్లక్ష్యమా..!

 శిథిలావస్థలో బ్రాహ్మణపల్లి- కుర్మేడ్‌ ప్రధాన రహదారి

 అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై వరినాట్లు 

 బ్రాహ్మణపల్లి గ్రామస్థుల వినూత్న నిరసన 


ఆమనగల్లు: రంగారెడ్డి - నల్గొండ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి మరమ్మతు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ మాడ్గుల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామస్థులు సోమవారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. బ్రాహ్మణపల్లి నుంచి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు మీదుగా నాగార్జునసాగర్‌ - హైద్రాబాద్‌ ప్రధాన రహదారికి వెళ్లే 8.2కి.మీ. బీటీరోడ్డు ఏళ్లుగా నిర్వాహణ లేక పూర్తిగా శిథిలమైంది.


పలుచోట్ల బీటీ లేచి, కంకర కొట్టుకుపోయి మోకాళ్ల లోతు గోతులు పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఏడాది కాలంగా నరకయాతన పడుతున్నారు. ఇదే రోడ్డుపై అనేక ప్రమాదాలు చోటుచేసుకొని పలువురు మృతిచెందిన, గాయపడిన సంఘటనలున్నాయి. పలుమార్లు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారులు, ఆమనగల్లు, చింతపల్లి డీఈలకు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. దీంతో ఆందోళనకు దిగారు. బ్రాహ్మణపల్లి - కుర్మేడ్‌ రెండో కల్వర్ట్‌ వద్ద గోతుల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. శ్రమదానంతో గ్రామ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో గోతుల్లో మొరం పోసి చదును చేశారు.


ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బ్రాహ్మణపల్లి అభివృద్ధి సంక్షేమ పరిరక్షణ సంఘం నాయకులు జెరుసలెము ముత్తయ్య, కుక్కుడాల రాములు తెలిపారు. నిరసన కార్యక్రమంలో నాయకులు లక్ష్మినారాయణ, ప్రేమ్‌, శేఖర్‌, రాజు, గంగాజీ, నాగరాజు, అజయ్‌, నర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-11T10:37:32+05:30 IST