అలా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషమే!

ABN , First Publish Date - 2021-07-19T05:30:00+05:30 IST

క్లోజప్‌ షాట్‌. కెమెరా రోల్‌ అవుతోంది. పక్కన సీనియర్‌ నటులు. చుట్టూ టెక్నీషియన్లు. యాక్షన్‌... అప్పటి వరకు కంఠస్తం చేసిన డైలాగ్‌ పెదవులు దాటడంలేదు.

అలా గుర్తుపెట్టుకున్నందుకు సంతోషమే!

క్లోజప్‌ షాట్‌. కెమెరా రోల్‌ అవుతోంది. పక్కన సీనియర్‌ నటులు. చుట్టూ టెక్నీషియన్లు. యాక్షన్‌... అప్పటి వరకు కంఠస్తం చేసిన డైలాగ్‌ పెదవులు దాటడంలేదు. ఒక్కసారిగా కంగారు. ఏదో తెలియని బెదురు. కెమెరా ముందు ఆమెకు అదే మొదటి అనుభవం. ఇది ఐదేళ్ల కిందటి మాట.  మరి ఇప్పుడు..! హావభావాలను అద్భుతంగా పలికిస్తుంది. సన్నివేశం ఏదైనా సీనియర్లతో పోటీపడి నటిస్తుంది. అందానికి చక్కని అభినయం తోడైతే... ఆమే కావ్యశ్రీ. ఆమె ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి..


టిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది కన్నడ పరిశ్రమ. కానీ గుర్తింపు తెచ్చింది మాత్రం తెలుగు సీరియల్సే. అందుకే నాకు ఈ ప్రాంతమన్నా, ఇక్కడి మనుషులన్నా చాలా ఇష్టం. గౌరవం. నా బాల్యం, విద్యాభ్యాసమంతా బెంగళూరులోనే సాగింది. మొదటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ. స్కూల్లో, కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఇంటర్‌ కాలేజీ గ్రూప్‌ డ్యాన్స్‌ పోటీల్లో అయితే టాప్‌ లేపేసేవాళ్లం. అది చూసి ‘సీరియల్స్‌లో ప్రయత్నించవచ్చు కదా’ అని అమ్మా నాన్న అనేవారు. ఎందుకంటే నాట్యంలో హావభావాలు కూడా పలికిస్తాం కదా! నటనైనా అదే ముఖ్యమనేది వారి ఉద్దేశం. 


పన్నెండు నుంచే... 

ఇంట్లోవాళ్లు అనేవరకు నటన అనేది నా ఆలోచనల్లోనే లేదు. ఎప్పుడైతే అది నా మెదడులోకి ఎక్కిందో... అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆ సమయంలో నేను సెకండ్‌ పీయూసీ (ఇక్కడ ఇంటర్‌) చదువుతున్నా. ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. కానీ నిరాశే మిగిలేది. ఇలా కనిపించి అలా మాయమయ్యే పాత్రలు చేయమని కొందరు అడిగారు. వద్దన్నాను. చివరకు నా బీఎస్సీ డిగ్రీ అయిన తరువాత అవకాశం వచ్చింది... మా బంధువుల్లో ఒకరి ద్వారా. ఆయన సీరియల్స్‌కు మేనేజర్‌గా చేసేవారు. అలా ఐదేళ్ల కిందట కన్నడ సీరియల్‌ ‘నీలి’తో నా నట ప్రయాణం ప్రారంభమైంది. సీరియల్‌ మొదలై అప్పటికే ఏడాది దాటింది. అందులో నాది ప్రధాన పాత్ర కాదు కానీ... ప్రాధాన్యమున్న పాత్ర. చెప్పాలంటే... సెకండ్‌ హీరోయిన్‌! రెండొందల ఎపిసోడ్స్‌ వరకు చేశాను. 


ఓనమాలు అక్కడే... 

షూటింగ్‌లో నా తొలి రోజు అనుభవం గురించి చెప్పాలి. నాకు నటన రాదు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు. కెమెరా ముందు నిలబడడం అప్పుడే. దర్శకుడు సన్నివేశం వివరించారు. అక్కడ నటిస్తూ డైలాగులు చెప్పాలి. లైవ్‌ రికార్డింగ్‌ ఉంటుంది. డైలాగులు కంఠస్తం చేశాను కానీ... యాక్షన్‌ అనేసరికి ఒక్కసారిగా అన్నీ మరిచిపోయాను. చుట్టూ అంతమంది. భయం వేసింది. నోట్లో నుంచి డైలాగ్‌ రావడంలేదు. దర్శకులు, సీనియర్లు అంతా ధైర్యం చెప్పారు. రెండు మూడు రోజుల తరువాత ఆ బెరుకు పోయింది. ఆ తరువాత కన్నడలోనే రెండు సీరియల్స్‌ చేశాను. 


నా ఫొటోతో మీమ్స్‌... 

కన్నడలో నటిస్తున్న సమయంలోనే తెలుగులో ‘స్టార్‌ మా’ నుంచి పిలుపు వచ్చింది. ‘గోరింటాకు’ సీరియల్‌ కోసం. అందులో ‘శ్రీవల్లి’ పాత్ర నాది. ఎప్పుడూ ఏడుపు సీన్లు ఉండేవి. సామాజిక మాధ్యమాల్లో నా ఏడుపు ముఖంతో మీమ్స్‌ కూడా వచ్చేవి. నాన్నను ఏదైనా కొనివ్వమని అడిగి, ఆయన కాదంటే ఏడుస్తారు కదా... అలాంటి వాటికి నా ఫొటో పెట్టి సరదాగా కామెంట్లు రాసేవారు. అవన్నీ చూసి నేనూ నవ్వుకొనేదాన్ని. ఒక రకంగా సంతోషంగా కూడా ఉండేది. ఎందుకంటే అన్ని సీరియల్స్‌ వస్తున్నా, అవన్నీ వదిలేసి ‘శ్రీవల్లి’ని గుర్తు పెట్టుకున్నారని! 


పాజిటివ్‌... నెగటివ్‌... 

ప్రస్తుతం ‘స్టార్‌ మా’ ప్రొడక్షన్‌ హౌస్‌లోనే ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ చేస్తున్నా. ఈ సోమవారం నుంచి ప్రసారమవుతుంది. అందులో ‘పాజిటివ్‌, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న ‘శకుంతల’ పాత్ర నాది. అనాథగా పెరిగిన శకుంతల, దానికి కారణం తన తల్లేనని భావిస్తుంటుంది. చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిన తల్లిపై కోపం. ఆ కోపంతో ఆమెపై పగ తీర్చుకోవాలనుకొంటుంది. రాగద్వేషాలు, భావోద్వేగాలు ఉన్న కథ. 


భాష రాక పాట్లు... 

కర్ణాటకలో మూడు సీరియల్స్‌ చేసినా... నాకంటూ గుర్తింపు, పేరు వచ్చింది తెలుగులోనే. ‘గోరింటాకు’ను అక్కడ కూడా చూసేవారు. హైదరాబాద్‌కి వచ్చిన మొదట్లో భాష రాక చాలా అవస్థలు పడ్డాను. సన్నివేశం వివరించాలంటే... నా భాష వాళ్లకు రాదు. వాళ్లు చెప్పేది నాకు అర్థం కాదు. హిందీలోనో, ఇంగ్లి్‌షలోనో సహనటులను అడిగి, ఇంకా అర్థం కాకపోతే గూగుల్‌లో వెతికి తెలుగు పదాలు నేర్చుకున్నా. డబ్బింగ్‌ వేరేవారు చెప్పినా, సరైన అర్థం తెలియకపోతే దానికి తగిన హావభావాలు పలికించలేం. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నా. 


వాళ్లే నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌... 

కన్నడలో ‘అంజనీపుత్ర’ అనే సినిమా ఒకటి చేశాను. పునీత్‌ రాజ్‌కుమార్‌ హీరో. అందులో నాది ప్రాధాన్యమున్న పాత్రే. కానీ సీరియల్స్‌తో పోలిస్తే సినిమా వాతావరణం పూర్తి భిన్నం. అది నాకు అంత నచ్చలేదు. సీరియల్స్‌లో అయితే అంతా ఒక కుటుంబంలా మెలుగుతాం. సరదాగా మాట్లాడుకొంటాం. షూటింగ్‌ చేస్తాం... ఇంటికి వెళతాం. ప్రతిదీ ఆస్వాదిస్తాం. అందుకే తరువాత ఒకటి రెండు సినిమా అవకాశాలు వచ్చినా వదులుకున్నా. నాకు స్నేహితులు, పార్టీలు కూడా తక్కువే. బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఇద్దరే... ఒకరు ‘గోరింటాకు’లో చేసిన నిఖిల్‌. ఇంకొకరు సుమ... బెంగళూరులో మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఇక నేను పెంచుకొంటున్న లాసాఆప్సో కుక్కపిల్ల ఎప్పుడూ నాతోనే ఉంటుంది. 


మధుర జ్ఞాపకాలెన్నో... 

నా జీవితంలో మధుర జ్ఞాపకాలంటే హైదరాబాద్‌లోనే! తెలుగులో మొదటి సీరియల్‌ చేసేటప్పుడు నాకు ఇక్కడి ఆహారం పడేది కాదు. అప్పుడు శ్రీకాంత్‌ అని లైన్‌ ప్రొడ్యూసర్‌ ఉండేవారు. షూటింగ్‌ అయిపోగానే వాళ్లింటికి వెళ్లి, తినేసి, మళ్లీ లొకేషన్‌కు వచ్చేవాళ్లం. షూటింగ్‌ లేకపోయినా... అక్కడికి వెళ్లి అందరం సరదాగా గడిపేవాళ్లం. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది. నాకు నచ్చే పిక్నిక్‌ స్పాట్స్‌ కూడా నేను షూటింగ్‌ చేసే స్టూడియోలే.’’ 

హనుమా 


మధుర ‘కావ్య'ం

కన్నడలో బుల్లితెరకు పరిచయం. ‘శ్రీవల్లి’గా తెలుగువారికి అభిమానపాత్రం 

డ్యాన్స్‌లో దుమ్ము రేపుతుంది. అదే నటన వైపు నడిపించింది. 

నచ్చే హీరోలు అల్లు అర్జున్‌, పవన్‌ కల్యాణ్‌. హీరోయిన్లలో సమంత ఇష్టం.

ఇన్‌స్టాగ్రామ్‌లో వందకు పైగా ఫ్యాన్‌ పేజీలు.

ఖాళీ సమయాల్లో ఇన్‌స్టా రీల్స్‌తో కాలక్షేపం 

నటి కాకపోయుంటే లెక్చరర్‌గా సెటిల్‌.


ఇంకా సమయముంది... 

పెళ్లి ఎప్పుడు చేసుకొంటావని అడుగుతుంటారు. అయితే నాకు పాతికేళ్లు వచ్చే వరకు ఆ ప్రస్తావన తేవద్దని ఇంట్లోవాళ్లకు చెప్పాను. అప్పటి వరకు కెరీర్‌పైనే దృష్టి. అలాగని పెద్ద పెద్ద లక్ష్యాలేమీ లేవు. వచ్చిన అవకాశాలు వచ్చినట్టు చేసుకొంటూ వెళ్లడమే నా పని. ఇక భర్తగా ఇలాంటివాడే కావాలని ఏమీ లేదు.  మంచివాడైతే చాలు. ఆస్తులు, అంతస్తులు     లేకపోయినా పర్లేదు.

Updated Date - 2021-07-19T05:30:00+05:30 IST