ఈ నెలంతా సినిమాలతో సందడే సందడి

కోలీవుడ్: 2021 సంవత్సరాంతానికి వచ్చేశాం. ఈ డిసెంబరు నెలలో పలు చిత్రాలు వరుసగా విడుదలకానున్నాయి.  ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో గత నెల నుంచి వారంవారం పలు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఆఖరు నెల అయిన డిసెంబరులో పలు చిత్రాలు విడుదలకానున్నాయి. ఈనెల 3వ తేదీన ‘బ్యాచిలర్‌’, ‘రూ.2000’, ‘ఆల్‌ ఇల్లాద ఊరిల్‌ అన్నన్‌దాన్‌ ఎమ్మెల్యే’ వంటి చిత్రాలు థియేటర్‌లో రిలీజ్‌ కాగా, ‘చిత్తిరై సెవ్వానం’ చిత్రం మాత్రం ఓటీటీలో విడుదలైంది. అలాగే, ఈనెల రెండో శుక్రవారమైన 10వ తేదీన మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 


ఈనెల 9వ తేదీన హీరో జీవీ ప్రకాష్‌ నటించిన ‘జెయిల్‌’ చిత్రం విడుదల కానుంది. 10వ తేదీన ప్రభుదేవా నటించిన ‘తేల్‌’, ‘మురుంగకాయ్‌ చిప్స్‌’, ‘యాంటీ ఇండియన్‌’, ‘క్‌’, ‘3.33’ అనే చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో మరికొన్ని చిత్రాలు చేరే అవకాశం ఉంది. అలాగే, ఈనెల 17వ తేదీన టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ కూడా తమిళనాడులో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయనున్నారు. ఇది తమిళం, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ కారణంగా థియేటర్లు లభించవన్న కారణంతో ముందుకునే పలువురు నిర్మాతలు తమ చిత్రాలను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా 24వ తేదీ శుక్రవారం కూడా మరికొన్ని చిత్రాలు విడుదలకానున్నాయి. కొత్త సంవత్సరంలో పలువురు పెద్ద హీరోల చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement