ఛాతి ఆస్పత్రిపై విమర్శల హోరు.. కొద్దిరోజులుగా మరణాలు పెగుతుండడంతో..

ABN , First Publish Date - 2020-08-04T20:05:59+05:30 IST

అంతా గప్‌చిప్‌...అసలక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. తెలిసే ఛాన్స్‌ కూడా ఇవ్వడం లేదు. నగరంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. అదే స్థాయిలో ఈ ఆస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది.

ఛాతి ఆస్పత్రిపై విమర్శల హోరు.. కొద్దిరోజులుగా మరణాలు పెగుతుండడంతో..

సరైన వైద్యం అందక పోవడమే కారణమని విమర్శలు

సోమవారం మృతిపై నిరసన తెలిపిన బంధువులు

ఆందోళన కారులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): అంతా గప్‌చిప్‌...అసలక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. తెలిసే ఛాన్స్‌ కూడా ఇవ్వడం లేదు. నగరంలో కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. అదే స్థాయిలో ఈ ఆస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది. కానీ అంతా రహస్యం. దిద్దుబాటు చర్యలైనా చేపడుతున్నారా? అంటే అదీ కనిపించడం లేదు. అసలు ఈ స్థాయిలో ఎందుకు మరణాలు నమోదవుతున్నాయి. కారణాలు ఏమిటి? అంటే అంతా మిస్టరీ. ప్రభుత్వ ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో పరిస్థితిపై వెల్లువెత్తుతున్న అనుమానాలివి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే అనుమానిత కొవిడ్‌ కేసుగా రోగులను ఈ ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. ఇక్కడ చేరుతున్న బాధితుల్లో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వీరికి వైద్యం అందించగలిగితే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. కానీ ఆసత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీస వైద్యసేవలు కూడా అందించడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు.


24 గంటల్లో ఒక్కసారి విజిట్‌

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సోమవారం ఉదయం 11 గంటలకు చనిపోయాడు. ‘ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లో ఒక్కసారే వైద్యుడు వచ్చాడు. నిమిషం పాటు చూసి వెళ్లిపోయాడు. ఊపిరిపీల్చుకోలేక ఇబ్బంది పడుతున్నాడని ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకున్నవారు లేరు’ అని కుటుంబ సభ్యులు వాపోయారు. కరోనా సమస్య కంటే వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వీరు ధ్వజమెత్తుతున్నారు. 


ఉన్నతాధికారి ఏం చేస్తున్నట్టు?

ఇంత జరుగుతున్నా సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. మూడు రోజుల కిందట ఛాతి ఆస్పత్రిలో చేరి ఓ రోగికి చేరి రెండురోజులైన వైద్యం అందకపోవడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయం సూపరింటెండెంట్‌కు తెలియజేసినా సిబ్బంది వెళ్లలేదు. ఇవన్నీ బయటకు వచ్చినవని, బయటకు రానివి ఇంకా చాలావున్నాయని అంటున్నారు.

Updated Date - 2020-08-04T20:05:59+05:30 IST