Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కడ అలా.. ఇక్కడ ఇలా

చివరి దశలో పేట మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు

12 ఎకరాల్లో భవనాలు

నల్లగొండలో శంకుస్థాపనకే నోచుకోని వైనం

కనీసం స్థలాన్ని కూడా ఖరారుచేయని అధికారులు

ఇబ్బందులుపడుతున్న వైద్య విద్యార్థులు

ఇప్పటికే పలుమార్లు ఆందోళన

ఐదురోజుల్లో సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ హామీ

హామీ నెరవేరకపోవడంతో ఆరు గంటలపాటు విద్యార్థుల ధర్నా

నల్లగొండ, నవంబరు 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రభుత్వం 2019లో రెండు మెడికల్‌ కళాశాలలను మంజూరుచేసింది. ఒకటి సూర్యాపేట జిల్లాకు, రెండోది నల్లగొండ జిల్లాకు. తాత్కాలికంగా నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలె, సూర్యాపేటలో మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లుచేసి విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు. పేటలో ఎస్వీ డిగ్రీ కళాశాల  ముందు భాగంలో సుమారు 12 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.114కోట్లతో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తికానున్నాయి. ఇదిలా ఉండ గా, నల్లగొండలో నేటికీ పనులు ప్రారంభంకాలేదు. అసలు ఎక్కడ నిర్మిస్తారో భూమిని సైతం సేకరించలేదు. తాత్కాలికంగా ప్రభుత్వ ఆస్పత్రి లో ఏర్పాటుచేసిన కళాశాలలో కనీస వసతులు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శరవేగంగా పేట మెడికల్‌ కళాశాల పనులు

సూర్యాపేటలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు రూ.114కోట్లతో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆరు అంతస్థుల్లో మెడికల్‌ కళాశాల, ఐదు అంతస్థుల్లో విద్యార్థులకు, మరో ఐదు అంతస్థుల్లో విద్యార్థినులకు ప్రత్యేక వసతి గృహాలు, మరో ఐదు అంతస్థుల్లో వేర్వేరుగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల మహిళ పాలిటెక్నిక్‌ కళాశాల్లో, విద్యార్థినులు, విద్యార్థులకు ప్రైవేట్‌గా వేర్వేరు చోట్ల వసతి కల్పించారు. ఏటా 150 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించగా, రెండేళ్లలో నూతన భవన నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మూడో బ్యాచ్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. దీంతో వసతుల పరిశీలనకు ఎంసీఐ బృందం రానుంది. ఆ బృందం తనిఖీకి వచ్చేలోగా పనుల పూర్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నల్లగొండలో ఇదీ పరిస్థితి

నల్లగొండలో రాజకీయ కారణాలతో కళాశాల భవన నిర్మాణానికి ఇప్పటి వరకు స్థల సేకరణే పూర్తికాలేదు. దీంతో కళాశాల భవనం శంకుస్థాపనకు నోచుకోలేదు. తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ప్రభు త్వం రూ.5కోట్లు విడుదలచేసింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లుచేశారు. ఇక్కడ రెండే తరగతి గదులు ఉన్నాయి. సరైన వసతులు లేవు. ల్యాబ్‌, లైబ్రరీ సౌకర్యం సరిగా లేదు. స్టడీ చైర్లు, టేబుళ్లు, మంచినీటి సౌకర్యం కూడా లేదు. విద్యార్థినులకు ఆస్పత్రి పైభాగంలో ఓ గదిలో వసతి కల్పించారు. 60మందికి పైగా విద్యార్థినులు ఉండగా, ఇక్కడ కేవలం రెండే బాత్‌రూంలు ఉన్నాయి. విద్యార్థులకు ఎస్‌ఎల్‌బీసీలో వసతి కల్పించారు. ఈ హాస్టల్‌లో సైతం అన్నీ సమస్యలే. కనీస మౌలిక వసతులు లేవు. రాత్రి వేళల్లో తేళ్లు, పాములు హాస్టల్‌లోకి వస్తున్నాయి. దోమలు సరేసరి. బాత్‌రూముల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. పారిశుధ్య పనులు నిర్వహించేవారు లేరు. డైనింగ్‌ హాల్‌లో టేబుళ్లు కూడా లేవు.

ఆందోళనలు చేసినా..

మెడికల్‌ కళాశాల, హాస్టళ్లలో వసతుల కొరతపై విద్యార్థులు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలు బయటికి పొక్కకుండా ప్రాక్టికల్‌ మార్కులు తగ్గిస్తామని ప్రొఫెసర్లు బెదిరింపులకు గురిచేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ నెల 18వ తేదీన ఆస్పత్రి బయట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీన్ని కళాశాలల ప్రిన్సిపాల్‌గానీ, ఎవ్వరూ గానీ పట్టించుకోకపోవడంతో విద్యార్థులంతా నేరుగా కలెక్టర్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. ఐదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వైద్య విద్యార్థుల ఇబ్బందులను జిల్లా అధికారులు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) అధికారులకు నివేదించినా స్పందన లేదు.

నల్లగొండ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారం

వైద్య విద్యార్థుల ధర్నా

నల్లగొండ అర్బన్‌: మెడికల్‌ కళాశాలలో కనీస వసతులు సమకూర్చాలని కోరుతూ విద్యార్థులు మరోమారు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలపా టు కళాశాల ఎదుట బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ గానీ, ఇతర అధికారులు గానీ ఎవ్వరూ వీరి ఆందోళనను పట్టించుకోలేదు. దీంతో సమస్యలు పరిష్కరించేంతవరకు తరగతులను బహిష్కరిస్తామని, రోజూ ఆందోళనలు నిర్వహిస్తామని విద్యార్థులు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, కనీసం ఇక్కడ చదువుకునే వాతావరణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాక్టికల్స్‌ చేసేందుకు ల్యాబ్‌లలో సరైన వైద్య పరికరాలు లేవని, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఏ ఒక్క సౌకర్యం ఇక్కడ లేదని వాపోయారు. హాస్టల్‌లో రూ మ్‌కు ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉండాలని, కళాశాలకు కిలోమీటరు దూరంలో మాత్రమే హాస్టల్‌ ఉండాలని నిబంధనలు ఉన్నా అవే వీ పాటించడంలేదన్నారు. తాగేందుకు కనీసం నీటి సౌకర్యం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను విన్నవిస్తే ఇంటర్నల్‌ మార్కులు తక్కువ వేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. సమస్యలు పరిష్కరించేంతవరకు తరగతులకు వెళ్లేది లేదని స్పష్టంచేశారు.

కళాశాల ఎదుట ధర్నా చేస్తున్న వైద్య విద్యార్థులు


Advertisement
Advertisement