ఏదీ.. సామాజిక దూరం?

ABN , First Publish Date - 2020-03-30T10:32:13+05:30 IST

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు మొత్తుకుంటున్నా కొన్నిచోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. తమకేమవుతుందిలే అన్న ధీమాతో ఒకే చోట

ఏదీ.. సామాజిక దూరం?

అధికారుల సూచనలు బేఖాతరు..

లెక్క చేయని పట్టణ ప్రాంత ప్రజలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు మొత్తుకుంటున్నా కొన్నిచోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. తమకేమవుతుందిలే అన్న ధీమాతో ఒకే చోట గుమిగూడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను నీరుగారుస్తున్నారు.  ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా నిర్లక్ష్యం ఎక్కువ కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కూరగాయలు, నిత్యావసర దుకాణాల వద్ద ప్రజలు బారులుదీరి కనిపించారు. మెదక్‌లో మాంసాహారం విక్రయించే దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నవీపేట మార్కెట్‌యార్డులో నిర్వహిస్తున్న మటన్‌ షాపుల వద్ద జనం పెద్ద ఎత్తున పోగయ్యారు.


ముగ్గుతో కూడిన డబ్బాలు ఏర్పాటుచేసుకోవాలన్న పోలీసుల సూచనలను షాపుల నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో ప్రతీ దుకాణం వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. మొహానికి మాస్క్‌ ధరించని వారితో గుంజీలు తీయించారు. జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో మటన్‌షాపులను పోలీసులు మూసివేయించారు. నిర్మల్‌లోనూ ఏ ఒక్క దుకాణం వద్ద కూడా కొనుగోలు దారులు నిబంధనలను పాటించలేదు. దీంతో 16 మాంసం దుకాణాల్లో  మునిసిపల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.32వేల జరిమానా విధించారు. 


హైదరాబాద్‌లో గుంపులు.. గుంపులుగా

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మాంసం దుకాణాల వద్ద జనం బారులు దీరారు. కాలనీలు, బస్తీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రోడ్లపై ప్రజలు తిరుగుతూ కనిపించారు. గ్రేటర్‌ పరిధిలోని అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట, లంగర్‌హౌజ్‌, మెహిదీపట్నం, సన్‌సిటీ, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, రామంతాపూర్‌, తార్నాక, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం చికెన్‌ దుకాణాల వద్ద సాధారణ రోజుల్లో కంటే విపరీతంగా రద్దీ కనిపించింది. 


మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో లాక్‌డౌన్‌ పరిస్థితులను పరిశీలించేందుకు ఆదివారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు. ఎంపీ వెంట జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, మునిసిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌, ఇతర నాయకులు ఉన్నారు. పట్టణంలో పలుచోట్ల తిరిగిన వారందరూ సామాజిక దూరాన్ని పాటించకపోవడం గమనార్హం.


మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లిలో ఆదివారం ఫాస్టర్‌ డానియల్‌ తన ఇంట్లో సుమారు 40 మందితో కలిసి ప్రార్థనలు మొదలుపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు వారందరినీ చెదరగొట్టి.. ఫాస్టర్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2020-03-30T10:32:13+05:30 IST