ట్రాక్‌ తప్పుతున్న టీనేజ్‌..!

ABN , First Publish Date - 2021-10-24T05:17:30+05:30 IST

కొన్ని కుటుంబాల్లో టీనేజ్‌ ట్రాక్‌ తప్పుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం విరిసీ విరియని మనసులపై విషం చిమ్ముతున్నాయి. హైస్కూల్‌ చదివే వయసు నుంచే లవ్‌స్టోరీలు మొదలవుతున్నాయి.

ట్రాక్‌ తప్పుతున్న టీనేజ్‌..!

వికసించని మనసుల్లో వింత ఆలోచనలు

స్మార్ట్‌ ఫోన్లతో బరువవుతున్న బాల్య ప్రేమలు

అజమాయిషీ కోల్పోతున్న పెద్దలు

విషబీజాలు నాటుతున్న సీరియల్స్‌

కుల సంఘాల పంచాయితీల్లో సర్దుబాట్లు

మైనార్టీ తీరకముందే దండల మార్పు


కొన్ని కుటుంబాల్లో టీనేజ్‌ ట్రాక్‌ తప్పుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం విరిసీ విరియని మనసులపై విషం చిమ్ముతున్నాయి. హైస్కూల్‌ చదివే వయసు నుంచే లవ్‌స్టోరీలు మొదలవుతున్నాయి. ప్రేమో.. ఆకర్షణో తెలుసుకునే సరికే బాల్యం బలవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఇటీవల వెలుగు చూస్తున్న టీనేజ్‌ లవ్‌లే ఇందుకు నిదర్శనం. వికసించని మనసులతో జీవితాలను నాశనం చేసుకుంటున్న కొందరి జీవితాలపై ఆంధ్రజ్యోతి పరిశీలనాత్మక కథనం.


పాలకొల్లు, అక్టోబరు 23 :

పాలకొల్లు మండలంలోని ఒక గ్రామంలో కుల సంఘం కొలువుతీరింది. అక్కడకు 14 ఏళ్ల అమ్మాయి, 16 ఏళ్ల అబ్బాయిని తీసుకొచ్చారు. గత రాత్రి వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సందర్భంలో అదే పేటలోని కొందరు యువకులు వారిద్దరిని పట్టుకుని కులపెద్దలకు అప్పగించారు. వారు పంచాయితీ పెట్టారు. ఏడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని చెప్పారు. పిల్ల తాలుకా పెద్దలు పెళ్లికి పట్టుబట్టారు. కుర్రాడి తరపు పెద్దలు ససేమిరా అన్నారు. చివరకు సంఘ పెద్దలు తీర్పు ఇచ్చారు. మైనార్టీ తీరిన వెంటనే పెళ్లి చేయాలని, ఇప్పుడు దండలు మార్పించాలని సూచించారు. ఈ ఘటనతో 8, 10 తరగతులు చదువుతున్న ఆ ఇద్దరి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


తణుకు పట్టణానికి చెందిన ఒక వార్డులో మైనార్టీ తీరని యువతీ యువకులను చెట్టుకు కట్టి నిర్బంధించారు. విషయం ఆరా తీస్తే వీరిద్దరూ రాత్రి సమయాలలో కలిసి తిరుగుతున్నారని, సంగతి తేల్చాలని ఆ ప్రాంత పెద్దలు పంచాయితీ నిర్వహించారు. వారి కులాలు వేరు కావడం, మైనార్టీ తీరకపోవడంతో యువకుడికి రూ.లక్ష జరిమానా విధించారు. అదికాకుండా పంచాయతీ నిర్వహించిన పెద్దలకు రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనతో కళాశాల విద్యలో ఉన్న మైనర్ల జీవితం నాశనమైంది.


భీమవరం ప్రాంతంలోని ఒక గ్రామంలో 13 ఏళ్ల బాలిక, 17 ఏళ్ల మైనర్‌ యువకుడు కనిపించకుండాపోయారు. దీంతో ఆందోళన చెందిన పెద్దలు బంధువుల ఇళ్ల వద్ద, సమీప గ్రామాలలో ఆరా తీశారు. వారం తర్వాత వారిద్దరూ వివాహం చేసుకుని గ్రామంలో ప్రత్యక్షమయ్యారు. ఏంచేయాలో పాలు పోని ఇరు వర్గాల పెద్దలు తలలు పట్టుకున్నారు. ఈ తరహా ఘటనలు జిల్లాలో తరచూ వెలుగుచూస్తున్నాయి. కొన్ని కేసులు పోలీసుస్టేషన్ల మెట్లు ఎక్కుతుండగా మరికొన్ని కుల పెద్దలు పరిష్కరిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో మైనర్లు అయినప్పటికీ వివాహాలు జరిపిస్తుంటే మరికొన్నిచోట్ల జరిమానాలు విధిస్తున్నాయి. అమ్మాయికి నష్టపరిహారం ఇప్పిస్తున్నారు.


స్మార్ట్‌ ఫోన్లతో ఇబ్బందులు

కరోనా పుణ్యమా అని పిల్లల చేతుల్లోకి స్మార్ట్‌ ఫోన్లు వచ్చాయి. విద్యాలయాలు మూసివేసి ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణతో కేజీ నుంచి పీజీ స్థాయికి స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరైంది. కొందరు విద్యార్థులు  పాఠాలు వినేందుకు వినియోగిస్తే మరికొందరు వక్రమార్గం పట్టారు. ఇప్పుడు అరచేతిలో ఇమిడే ఫోన్‌లలోనే ఆశ్లీలత చేరిపోవడంతో మానసిక పరిపక్వత చెందని వయసులోనే టీనేజీ యువతపై దాని ప్రభావం పడుతోంది. దీంతో వారు చెడు మార్గం పడుతున్నారు. కొన్ని టీవీ సీరియళ్ల ప్రభావం టీనేజీపై తీవ్రత చూపిస్తున్నది. సీరియళ్లలో వచ్చేకొన్ని సంఘటనలను ఆదర్శంగా తీసుకుని తెలిసీ తెలియని వయసులో పిల్లలు ప్రేమ అనే ముసుగులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.


కొరవడుతున్న అజమాయిషీ

కొన్ని కుటుంబాలలో జీవనోపాధి కోసం భర్త లేదా భార్య ఇతర దేశాలకు వెళుతూ తమ పిల్లలను పెద్దల వద్ద ఉంచుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఏ మేరకు గమనిస్తున్నారోననే విషయం గమనించక ముందే ప్రమాదం జరిగిపోతోంది. మితిమీరిన స్వేచ్ఛ, చేతిలో అవసరానికి సరిపడ సొమ్ములు ఉండడంతో హైస్కూల్‌ వయసు నుంచే ప్రేమ అనే ఆకర్షణ వైపు నడిపిస్తున్నది. జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పదు. కానీ అదే సమయంలో పిల్లల నడవడికను ఎప్పటికప్పుడు గమనించకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


కొంపముంచుతున్న గారాబం

8వ తరగతి చదువుతున్న బిడ్డ మారాం చేస్తుంటే తండ్రి స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చాడు. చాటుగా ఫోన్‌ను స్కూల్‌కి తీసుకెళుతున్న ఆ బాలిక విశ్రాంతి సమయంలో ఫోన్‌తో స్నేహితులతో కాలక్షేపం ప్రారంభించడం, వివిధ వెబ్‌సైట్‌లలో సంబంధం లేని అనేక అంశాలపై ఆకర్షణ పెంచుకోవడంతో చివరకు చదివే సమయాన్ని పక్కన పెట్టి ఫోన్‌ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. ఆ చిన్నారి జీవితం సరిదిద్దడానికి అవకాశం లేకుండాపోయింది. పక్కింటివాళ్లో, ఎదురింటివాళ్లో తమ పిల్లలకు మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారని తెలిసి తమ పిల్లలేమీ తక్కువ కాదని గొప్పలకు పోతూ వాళ్లకు ఫోన్‌లు ఇవ్వడం వల్ల నష్టంతో పాటు కష్టాలు కొని తెచ్చుకోవడమే అవుతోంది. ఇంటర్‌ చదువు పూర్తయ్యేంత వరకూ ఫోన్లు ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులకు ఫోన్‌ అవసరమైతే ఆ సందర్భంలో పెద్దలు పిల్లలను తమవద్దే ఉంచుకుని పాఠాలను నేర్పించాలని చెబుతున్నారు.  


స్నేహభావంతో ఉండాలి

డాక్టర్‌ చల్లా భారతి,సైకియాట్రిస్ట్‌, పాలకొల్లు

తల్లిదండ్రులు పిల్లలతో స్నేహభావంతో ఉండాలి. తల్లిదండ్రులే పిల్లలకు రోల్‌ మోడల్‌. పెద్దల పర్యవేక్షణతోనే పిల్లలు నడవడిక ఆధారపడి ఉంటుంది. ఊహ తెలిసేంతవరకు పిల్లల ఆలనా, పాలన తల్లి చూస్తే ఊహ తెలిసే సమయం నుంచి తండ్రి శ్రద్ధ వహించాలి. పిల్లలకు స్వేచ్ఛ ఇస్తూనే బాధ్యతలు గుర్తెరిగేలా పెంచాలి. ఆంక్షలు పరిమితంగా ఉండాలి. పిల్లలు అన్ని విషయాలను మనసువిప్పి చెప్పుకునే వెసులుబాటు తల్లిదండ్రులు కల్పించాలి. ఇటీవల స్నేహాలు పెరిగాయి. తమ పిల్లలు స్నేహం చేసే వారిని గమనిస్తూ ఉండాలి. విద్యా ప్రమాణాలు మెరుగు పరిచే కోణంలో ర్యాంక్‌ల సాధన కోసం పిల్లలపై ఇపుడు తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఒత్తిడిని తట్టుకునే క్రమంలోనే స్నేహానికి ప్రేమ అనే ముసుగు వేసుకుంటూ పిల్లలు ఆకర్షణకు లోనవుతున్నారు. సరైన సమయంలో తల్లిదండ్రుల గైడెన్స్‌తోనే పిల్లలు సక్రమమార్గంలో నడిచే వీలుంటుంది. సాంకేతికత ఎంత మేలు చేస్తుందో అంత కీడు చేస్తుంది. కాబట్టి స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీల వీక్షణ వద్ద పిల్లలను పరిమితంగా ఉండేటట్లు చూడాలి.


Updated Date - 2021-10-24T05:17:30+05:30 IST