సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకే అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-12T14:48:51+05:30 IST

‘టీడీపీ నేత రాకేష్‌చౌదరి సోషల్‌ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టు..

సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినందుకే అరెస్ట్‌

ఇసుక, మద్యం మాఫియాకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని నాని ఆరోపణ 

త్వరలో సాక్ష్యాధారాలతో బయటపెడతానని వెల్లడి 

చంద్రగిరి పోలీసు స్టేషన్‌ ఎదుట టీడీపీ నిరసన


చంద్రగిరి(చిత్తూరు): ‘టీడీపీ నేత రాకేష్‌చౌదరి సోషల్‌ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టు పెట్టారు. చంద్రగిరి పోలీసులు ఆయన్ను పిలిపించి పోస్టును తీసేయాలని బెదిరించినా ఆ పోస్టును తీయలేదు. అందుకనే ఈ కేసులో ఇరికించి అరెస్టు చేశారు’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరించారనడానికి ఇదే నిదర్శనమన్నారు. చంద్రగిరి మండల టీఎస్‌ఎన్వీ అధ్యక్షుడు రాకేష్‌చౌదరి అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


2006 నుంచి రాకేష్‌చౌదరికి, పద్మావతమ్మకు పొలం విషయమై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఈనెల 4వ తేదిన పోలీసు అధికారులే పద్మావతమ్మ వద్దకు వెళ్లి.. రాకేష్‌చౌదరి తదితరులు పొలంలో అడ్డగించి దాడి చేశారంటూ బలవంతంగా ఫిర్యాదు రాయించుకున్నారన్నారు. ఆ ఫిర్యాదు మేరకు ఇరుపార్టీలను విచారించకుండా సోమవారం ఉదయం నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు పెట్ట అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడినా స్పందించలేదన్నారు. చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ రాజ్యమేలుతోందన్నారు. ఇసుక, మద్యం మాఫియాకే ఇక్కడ న్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇసుక, లిక్కర్‌ మాఫియా, పోలీసుల గుట్టునూ త్వరలో బయట పెడతానన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని నాని చెప్పారు.


దీంతో రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందళనలో టీడీపీ నాయకులు సుబ్రమణ్యంనాయుడు, గౌస్‌బాషా, రమేష్‌రెడ్డి, గంగపల్లి భాస్కర్‌, కుమారరాజారెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ సమన్వయకర్త రవినాయుడు, ఈశ్వర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, బెల్లంకొండ రమేష్‌రాయల్‌, భానుప్రకాష్‌రెడ్డి. యశ్వంత్‌చౌదరి, కోవి దివాకర్‌చౌదరి, సురేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-12T14:48:51+05:30 IST