కరోనాతో పెరిగిన సోషల్ మీడియా వినియోగం

ABN , First Publish Date - 2020-03-29T19:12:27+05:30 IST

ప్రపంచం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఇప్పటికే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను...

కరోనాతో పెరిగిన సోషల్ మీడియా వినియోగం

ప్రపంచం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిని ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఇప్పటికే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించేశాయి. మన దేశంలో కూడా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోవాల్సి వచ్చింది. దీంతో ఆన్‌లైన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.


ముఖ్యంగా సోషల్ మీడియా సైట్లలో గడిపేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. దీనివల్ల ఇటీవలి కాలంలో 60 శాతానికి పైగా సోషల్ మీడియా వినియోగం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగం విపరీతంగా పెరిగింది. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో ఉన్నప్పుడు 27 శాతం పెరిగిన వాట్సాప్ వినియోగం ఇప్పుడు ఏకంగా 40 శాతానికి పెరిగినట్లు ఒక సర్వే ద్వారా తెలుస్తోంది. 


కంటర్ అనే కన్సల్టింగ్ సంస్థ దీనికి సంబంధించి దాదాపు 25 వేల మంది వినియోగదారులపై సర్వే చేసి ఈ విషయాలను వెల్లడించింది. వెబ్ బ్రౌజింగ్‌ వినియోగం కూడా 70శాతం పెరిగిందని, ఇళ్లలో టీవీలు చూసే వారి సంఖ్యలో 63శాతం పెరుగుదల ఉందని తన అధ్యయనం ద్వారా కంటర్ తెలియజేసింది. 


ఇదిలా ఉంటే ఎంత పాపులర్ అయినప్పటికీ సోషల్ మీడియాను పూర్తిగా నమ్మలేమని, ఏదైనా విషయానికి సంబంధించి వాస్తవాలను తెలుసుకోవాలంటే టీవీ ఛానళ్లు, వార్తాపత్రికలే సోషల్ మీడియాకంటే మేలని 52 శాతం మంది వినియోగదారులు పేర్కొన్నట్లు తెలిపింది. అయితే 11 శాతం మంది మాత్రం సోషల్ మీడియాను కూడా నమ్మవచ్చని, అక్కడ కూడా సరైన సమాచారమే దొరుకుతుందని చెప్పినట్లు కంటర్ సంస్థ తన సర్వే ద్వారా వెల్లడించింది.

Updated Date - 2020-03-29T19:12:27+05:30 IST