సోషల్‌ సేవ!

ABN , First Publish Date - 2020-03-28T05:36:05+05:30 IST

యావత్‌ ప్రపంచం కరోనా గురించి భయపడుతోంది. అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. మరి ఎలాంటి షెల్టర్‌లేని అనాథల పరిస్థితి ఏంటి? సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఓ వ్యక్తి ఇలాగే ఆలోచించాడు.

సోషల్‌ సేవ!

యావత్‌ ప్రపంచం కరోనా గురించి భయపడుతోంది. అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. మరి ఎలాంటి షెల్టర్‌లేని అనాథల పరిస్థితి ఏంటి? సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఓ వ్యక్తి ఇలాగే ఆలోచించాడు.  ఎవరికి చేతనైనంతతో వారు ఆహారాన్ని తమ దగ్గరలో ఉండే అనాఽథలకు అందివ్వమని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. దానికి స్పందించిన నెటిజన్లు తెలుగురాష్ట్రాల్లో దాదాపు నాలుగు వేల మంది అనాఽథలకు ఆహారం అందించారు. ఇదంతా సోషల్‌ మీడియా మహిమ.


రేపటి నుంచి ఇంటర్నెట్‌ పనిచెయ్యదు.. ఫేస్‌బుక్‌ ఓపెన్‌ కాదు. ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌లు, కరోనా గురించి భయంకరమైన సందేశాలు సోషల్‌ మీడియాలో స్ర్పెడ్‌ అవుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి విపత్కర సమయంలో సోషల్‌ మీడియాను శక్తిమంతమైన టూల్‌గా ఎందుకు వాడుకోకూడదు అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఒక చిన్నపాటి ఉద్యమమే అనాథలకు ఆహారం పంపిణీ. సోషల్‌ డిస్టెన్స్‌... అనే పదం కొన్ని రోజులుగా బాగా వింటున్నాం. మనిషికి మనిషికి మధ్య బాక్సులు కట్టి దూరంగా నిలుచోపెడుతున్నారు! ఈ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా ఆ పెరుగుతున్న దూరాన్ని తగ్గించి మానవత్వాన్ని ఎందుకు చాటుకోకూడదు.


ఇబ్బందుల్లో ఉన్న వారికి...

వైజాగ్‌లో హాస్టల్‌లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తికి ఫేస్‌బుక్‌ పోస్టు వల్ల కుమార్‌ రెడ్డి అనే వ్యక్తి పదిహేను రోజుల పాటు షెల్టర్‌, ఆహార వసతి కల్పించారు. మరోచోట ఒక పని మీద ఒక పల్లెటూరికి వెళ్లి  ఇబ్బంది పడుతున్న వ్యక్తికి అన్ని సౌకర్యాలూ సమకూరాయి. ఇది కల్పన కాదు, కళ్లారా చూసిన వాస్తవం. ఇదంతా కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో జరిగిపోయింది. నిజంగా సోషల్‌ మీడియాని మెరుగ్గా వాడుకుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అనిపిస్తుంది. అందుకే సోషల్‌ మీడియాని కాలక్షేపానికి వాడడం కాసేపు పక్కన పెట్టి, సమాజం మొత్తం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు చేతనైనంత సాయం చేయడానికి ఉపయోగించండి. అనేక పనుల మీద వేరే ఊరు వెళ్లి ఇరుక్కుపోయిన వారిలో మీ స్నేహితులు, బంధువులు ఉండొచ్చు. వారి గురించి సోషల్‌ మీడియా ద్వారా సహాయం కోరండి. అలాగే మీ ఊళ్లో, మీకు అందుబాటులో ఏదైనా సహాయం గురించి అభ్యర్థన వస్తే వెంటనే స్పందించండి. ఇబ్బందులు వచ్చినప్పుడే మన నిజమైన మానవత్వం తెలుస్తుంది.


పాఠాలు చెప్పడానికి...

లాక్‌డౌన్‌ వల్ల ఇంట్లో కూర్చొని చాలామంది బోర్‌ ఫీలవుతున్నారు. ‘దీన్ని కూడా ఒక చక్కని అవకాశంగా ఎందుకు మార్చకూడదు’ అనే ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది. వెంటనే దాని గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే, ఇంటి నుంచి వాట్సప్‌ ద్వారా, స్కైప్‌ ద్వారా ఉచితంగా పాఠాలు చెబుతామని ఎంతోమంది వృత్తి నిపుణులు స్పందించారు. 10వ తరగతి పిల్లలకి మ్యాఽథ్స్‌ మొదలుకుని, ఫొటోషాప్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, పైథాన్‌ వంటి ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఒకరితో ఒకరికి కనెక్టివిటీ ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు అంతా ఒక కుటుంబం. ఇవన్నీ గత నాలుగైదు రోజులుగా జరిగిన సంఘటనలు. సరిగ్గా ఇలాగే మీకు ఉండే నైపుణ్యాన్ని ఇతరులకు ఎందుకు నేర్పించకూడదు? ఆలోచించండి. వాట్సప్‌ ఉంది, వీడియో కాల్‌ చేసుకోగలుగుతాం, లేదా ఫోన్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు,  సందేహాలు అడిగి తెలుసుకోవచ్చు, సబ్జెక్ట్‌ బోధించవచ్చు.. ఇలా ఎన్నో రకాల అంశాలు  నేర్చుకోవచ్చు. నాలెడ్జ్‌ పంచుకోవచ్చు.


ఆన్‌లైన్‌లో వైద్య సలహాలు

ఇప్పుడు అనేక ఆస్పత్రులు అత్యవసర వైద్య సందేహాల కోసం ఫోన్‌ ద్వారా సంప్రతింపులకు అవకాశం కల్పించాయి. సోషల్‌ మీడియా ద్వారా ఇదేవిధంగా రాకేశ్‌ అనే చిన్నపిల్లల వైద్య నిపుణుడితో పాటు అతని స్నేహ బృందం అనేకమంది ఒక టీంగా ఏర్పడ్డారు. ఒక్కపైసా వసూలు చేయకుండా, అత్యవసరమైన వైద్య సలహాలను తాము ఫోన్‌ ద్వారా అందిస్తామని ప్రకటించారు. కొన్ని వందల మందికి ఇప్పటివరకు విలువైన సూచనలు అందించారు. ఇదంతా కూడా సోషల్‌ మీడియా ద్వారానే జరిగింది. ఇవే రకమైన సేవలు అనేక ఇతర కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కూడా తమ సామాజిక బాధ్యతగా అందిస్తున్నాయి. మీరూ డాక్టర్లు అయితే మీ చుట్టూ ఉండే పేషెంట్లకు, లేదా సోషల్‌ మీడియాలో మిమ్మల్ని అనుసరించే ఆత్మీయులకు ఇలాంటి సేవలు అందించి ఇంటి దగ్గర కూర్చొని ఎవరూ ఇబ్బంది పడకుండా చూడండి.


మానసిక స్థైర్యం కోసం...

కరోనా కారణంగా ఇంటి దగ్గర కూర్చుంటే అందరిలో కొన్ని మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే తన సర్కిల్‌లో ఎవరైనా ఒంటరిగా ఇబ్బంది పడుతుంటే, తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సోషల్‌ మీడియా ద్వారా ముందుకు వచ్చాడో వ్యక్తి. ఇది కూడా కళ్ళారా చూసిన సంఘటనే. అతనికి వచ్చిన ఫోన్‌ కాల్స్‌ గమనిస్తే, మానసికంగా ఎంతమంది కుంగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. నేరుగా ఒకరినొకరు కలిసే అవకాశం లేదు కాబట్టి, కనీసం టెక్నాలజీని ఉపయోగించుకుని ఫోన్‌ కాల్స్‌ ద్వారా గానీ, వాట్సప్‌ ద్వారా గానీ ఒంటరిగా ఉంటున్న వ్యక్తులతో మాట్లాడండి. వారికి అది ఎంత ఊరటనిస్తుందో మీ ఊహకు కూడా అందదు.


పెద్ద వాళ్లకి బాసటగా..

హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో నివాసం ఉండే ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. లాక్‌డౌన్‌ వల్ల బయటకు రాలేక పోతున్న వృద్ధులకి గానీ, మహిళలకు గానీ వారికి కావల్సిన కూరగాయలు, సరుకులు తానే తీసుకువచ్చి అందిస్తానని ఆ పోస్ట్‌ సారాంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది గొప్ప సాయం. ఇలాంటి ఆలోచనలే, సోషల్‌ మీడియాని ఎంతో కొంత సామాజిక బాధ్యత కోసం వాడుకునేలా చేస్తాయి. ఆలోచించండి.. ఇదే సోషల్‌ మీడియా ద్వారా మీ ప్రాంతంలో మీరు ఏం చేయగలుగుతారో,  జనాల అవసరాలు ఏమిటో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి గమనించండి. బయటకు రావడం ప్రమాదమే. అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని సేవ చెయ్యడంలో తప్పేమీ లేదు!


మూగజీవాలను మరువద్దు

కొంత మంది స్వచ్ఛందంగా మూగజీవాలకు ఆహారం అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారానే కలిసి పని చేస్తున్నారు. గాసిప్స్‌ చూడడానికీ, ఫేక్‌ న్యూస్‌ చూడడానికి మనం వాడుతున్న మాదిరి మొబైల్‌ ఫోన్లనే వారూ వాడుతున్నారు. టూల్‌ ఒకటే అయినా గమ్యాలు ఆకాశానికీ, పాతాళానికీ ఉన్నంత తేడా! ఎండాకాలం ఆహారం, నీరు లేక ఎన్నో మూగజీవాల ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటిని పట్టించుకునే నాథుడు లేడు. కరోనా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనకు మనం చేయగలిగినంత ఎందుకు చేయకూడదు?


సమస్యలు అధికారుల దృష్టికి..

నిశితంగా పరిశీలిస్తే లాక్‌డౌన్‌ సమయంలో కూడా మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనేకమంది అధికారులు, ప్రభుత్వ విభాగాలు, రాజకీయ నాయకులకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో అకౌంట్లు ఉంటున్నాయి. ఆయా సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లడం కూడా ఒక రకమైన సామాజిక బాధ్యతే. టెక్నాలజీ ద్వారా  ఇంటిదగ్గర కూర్చునే మనం చేయగల గొప్ప బాధ్యత అది!


మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడొచ్చు.. సోషల్‌ మీడియాలో కరోనా గురించి జోక్స్‌ వేసుకోవచ్చు.. లేదా భయపడనూవచ్చు.. కానీ అంతకంటే భిన్నంగా టెక్నాలజీని వాడుకోగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచించండి.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-03-28T05:36:05+05:30 IST