సామాజిక తెలంగాణే సాగర్‌ తీర్పు కావాలి!

ABN , First Publish Date - 2021-04-16T05:46:16+05:30 IST

తెలంగాణ ప్రాంత విముక్తి జరిగింది, ప్రజల విముక్తి మిగిలింది. దానిని పరిపూర్తి చేయడానికి సాగర్‌ ఉప ఎన్నిక సమరంలో సామాజిక తెలంగాణ...

సామాజిక తెలంగాణే సాగర్‌ తీర్పు కావాలి!

తెలంగాణ ప్రాంత విముక్తి జరిగింది, ప్రజల విముక్తి మిగిలింది. దానిని పరిపూర్తి చేయడానికి సాగర్‌ ఉప ఎన్నిక సమరంలో సామాజిక తెలంగాణ నినాదంతో మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్‌పి) పోటీ చేస్తున్నది. స్వరాష్ట్రంలో అణచివేయబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, అగ్రకుల పేదలను, వికలాంగులను ‘మహాజనుల’ పేరుతో రాజకీయంగా కూడగట్టుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో 93% ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, అగ్రకుల పేదలు, వికలాంగ ప్రజలు ఉన్నారు. వీరందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించడం ద్వారానే విముక్తి సాధ్యమవుతుంది. అందుకు మహాజనుల చేతుల్లోకి రాజకీయ అధికారం రావాలి. ఆ అధికారాన్ని సాధించడానికి ఎంచుకున్న ఎజెండానే సామాజిక తెలంగాణ నినాదం. తెలంగాణ ఉద్యమ కాలంలో మంద కృష్ణ మాదిగ నేతృత్వంలోని సామాజిక ఉద్యమ శక్తులు అణగారిన వర్గాల ప్రాతినిధ్యం కోసం సామాజిక తెలంగాణ అంశాన్ని లేవనెత్తినారు. భౌగోళిక తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర దొరల పాలన పోయి తెలంగాణ దొరల పాలన వస్తుందే తప్ప అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు ఏమీ ఉండదని, సామాజిక ఆర్థిక రాజకీయరంగాలలో 93% జనాభాకు 93% ప్రాతినిధ్యం ఉండే సామాజిక తెలంగాణ కావాలని ఆనాడే ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చారు. రాష్ట్రం ఏర్పడటంతో భౌగోళిక తెలంగాణ లక్ష్యం పూర్తి అయింది. గడిచిన ఏడేండ్లలో బంగారు తెలంగాణ నిర్మాణం భూస్వాముల పాలనకు ప్రతీకగా నిలిచింది. ఏడేండ్ల పాలనలోని మోసాలు, వైఫల్యాలు, విధానాలు అందుకు సాక్ష్యం పలుకుతున్నాయి.


దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి కేసిఆర్‌ పాలన మొదలు పెట్టారు. మూడు ఎకరాల భూమి అందకుండా దళితులు మోసపోయారు. 12% రిజర్వేషన్ల హామీ అమలు కాకుండా ముస్లీంలు, గిరిజనులు మోసపోయారు. 33% రిజర్వేషన్లు అమలు కాకుండా బీసీలు మోసపోయారు. 33% రిజర్వేషన్లు లభించకుండా మహిళలు మోసపోయారు. కేజి నుండి పిజి వరకు ఉచిత విద్య అమలు కాకుండా విద్యార్థులు మోసపోయారు. ఇంటికో ఉద్యోగం, ఆరువేల భృతి అందకుండా నిరుద్యోగులు మోసపోయారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరగకుండా కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మోసపోయారు.... స్పష్టంగా చెప్పాలంటే భూస్వాములు, అగ్రకులాలు తప్ప మిగతా తెలంగాణ సమాజమంతా మోసపోయింది. ప్రస్తుత మంత్రి వర్గంలో 4% జనాభా కలిగిన వెలమ, రెడ్లకు 10 మంత్రి పదవులు ఉంటే 93% జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు 7 మాత్రమే ఉన్నాయి. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు భూస్వాములకు నీళ్లను, భూమిలేని  పేదలకు కన్నీళ్లను ఇచ్చింది. కాళేశ్వరం పూర్తి అయిన తరువాత పేదల వద్ద ముఖ్యంగా దళితుల దగ్గర భూమి ఉండకూడదనే కుట్రతో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములను ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, స్మశాన వాటిక, రైతు వేదిక కోసం బలవంతంగా గుంజుకున్నారు. భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెట్టడానికి రైతుబంధు అమలవుతుంది. విద్యా వ్యవస్థ కొద్దిమంది పెద్దల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. వారి ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు అమలు చేయని ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు గత మూడేండ్లుగా వైస్‌ చాన్స్‌లర్‌లు లేకపోవడం వల్ల, నిధులు రాకపోవడం వల్ల, ఉద్యోగాలు భర్తీ కాకపోవడం వల్ల, ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇలాంటి పరిస్థితిలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలు చట్టసభల్లో లేవు. కనుక ప్రజలను విముక్తివైపు నడిపించే బాధ్యత సామాజిక ఉద్యమ శక్తుల మీద పడింది. ఆ బాధ్యతను సామాజిక ఉద్యమకారుడిగా మంద కృష్ణ మాదిగ స్వీకరించాడు. 


ఇప్పుడు బంగారు తెలంగాణకు ప్రత్యామ్నాయం సామాజిక తెలంగాణ నినాదమే. భూస్వాముల పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో రాజకీయ యుద్దభూమిలోకి మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్‌పి) అడుగు పెట్టింది. 93% జనాభా ఉన్న మహాజనులకు ప్రాతినిధ్యం వహిస్తూ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోటీలో నిలబడింది. ప్రధాన పోటీ దారులుగా ఉన్న టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజెపీ పార్టీలు మద్యం, డబ్బు పంచకుండా ఎన్నికలలోకి రావాలని మంద కృష్ణ మాదిగ సవాల్‌ విసిరాడు. ఎంఆర్‌పిఎస్‌ ఉద్యమం ప్రజలకు చేసిన సేవను చూసి ఓట్లు వేయాలని మహాజన సోషలిస్టు పార్టీ పిలుపునిచ్చింది. సామాజిక తెలంగాణ కోసం, పేద ప్రజల విముక్తి కోసం, తెలంగాణ సమాజ భవిష్యత్తు కోసం సాగర్‌ ప్రజలు చైతన్యంతో ఆలోచించి ఓటు వేయాలి. భూస్వాముల దోపిడీకి దోహదపడుతున్న బంగారు తెలంగాణకు సబ్బండ జాతుల సంక్షేమానికి సరిపడే సామాజిక తెలంగాణకు మధ్య జరుగుతున్న సాగర్‌ రాజకీయ యుద్ధంలో సామాజిక తెలంగాణకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. తెలంగాణ నేల మీద నూతన సామాజిక రాజకీయ శక్తులకు జీవం పోసి తెలంగాణ చైతన్యం జీవించే ఉందని చాటాలి. 

గోవిందు నరేష్‌ మాదిగ

ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Updated Date - 2021-04-16T05:46:16+05:30 IST