ఉప ఎన్నికల్లో ‘సోషల్‌’ వార్‌

ABN , First Publish Date - 2021-07-30T05:40:43+05:30 IST

ఉప ఎన్నిక నేపథ్యంలో..

ఉప ఎన్నికల్లో ‘సోషల్‌’ వార్‌

ఈటల బావమరిది చాటింగ్‌ వ్యవహారం వివాదాస్పదం 

విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదులు 

పద్మశాలి, రజక, వైశ్యబంధు పథకాలకు పోస్టింగులు 

ఎమ్మెల్యేలారా... రాజీనామా చేయాలంటూ వైరల్‌  


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లో సోషల్‌ మీడియా వార్‌ సాగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకున్నా సుమారు రెండు నెలలుగా ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌పార్టీ, బీజేపీ ఈసారి సోషల్‌ మీడియా ప్రచారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాకు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ను ఇన్‌చార్జీగా నియమించింది. బీజేపీ కూడా ప్రత్యేక విభాగంతో పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నది. ఇరుపార్టీలు తమ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం కంటే ఎక్కువగా ఇతర పార్టీల ప్రచారాలను, పథకాలను విమర్శించడంపై దృష్టిసారించి ప్రజలను తమ ప్రచారాలతో గందరగోళ పరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటల బావమర్ది మధూసూధన్‌రెడ్డి వాట్సాప్‌ చాటింగ్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 


వాట్సాప్‌ చాటింగ్‌లో ఆయన దళితులను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం హుజూరాబాద్‌లో మధుసూధన్‌రెడ్డి శవయాత్ర నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈటల సతీమణి జమున ఆయన బావమర్ది మధుసూధన్‌రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా అంబేద్కర్‌ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌వీ నాయకుడు పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో సుమారు 10 మంది ఈటల దళితద్రోహి అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ అక్కడికి చేరుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ చెప్పులు విసురుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను పక్కకు తప్పించి టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలను అక్కడి నుంచి వెళగొట్టారు. అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తలు వరంగల్‌-కరీంనగర్‌ రహదారిపై ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 


ఈటల బావమర్ది దళితులను కించపరిచేలా మాట్లాడడాన్ని నిరసిస్తూ హుజురాబాద్‌లోనే కాకుండా జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, చొప్పదండి, గంగాధర మండలాల్లో కూడా దళితులు నిరసన ప్రదర్శనలు నిర్వహించి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం కరీంనగర్‌లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈటల బావమర్ది మధుసూధన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వాఖ్యలకు నిరసనగా ఆగస్టు 4న జమ్మికుంట, హుజురాబాద్‌ పట్టణాల్లో నిరసన ర్యాలీలను నిర్వహిస్తామని ప్రకటించారు. సోషల్‌ మీడియాలో తాను దళితులను కించపరిచినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్‌ వాట్సాప్‌ చాటింగ్‌ను సర్క్యులేట్‌ చేస్తున్నారని, ఈ విషయంలో విచారణ జరిపించి బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఈటల బావమర్ది మధుసూధన్‌రెడ్డి హుజురాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.  అలాగే ఆ చాటింగ్‌లో ఈటల పీఏ నరేశ్‌ పేరు కూడా ప్రస్తావించినట్లు ఉండడంతో ఆయన కూడా జమ్మికుంట పోలీసులకు ఈ విషయంలో విచారణ జరిపించి దోషులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.


అయితే పోలీసులు ఈ రెండు ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామని, కేసులు సైబర్‌ క్రైం పోలీసులకు పంపిస్తామని చెప్పారు. అయితే ఈటల బావమర్ది మధుసూధన్‌రెడ్డి మరొకరితో చేశాడని చెబుతున్న ఈ చాటింగ్‌ ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ చాటింగ్‌లో దళితబంధు పథకం, దళితులపై వ్యాఖ్యలు, డబ్బుల ప్రస్తావన కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఈటల బావమర్ది ఆయనకు మద్దతుగా ఉన్న మరొక వ్యక్తి వాట్సాప్‌ చాటింగ్‌ టీఆర్‌ఎస్‌ నేతలకు ఎలా అందిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చాటింగే ఫేక్‌దిగా బీజేపీ నేతలు పేర్కొంటుండగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం దీనిని విస్తృతంగా ప్రచారంలో పెడుతున్నారు. 


ఈటల మధ్దతుదారుల మధ్య జరిగినట్లు చెప్పబడుతున్న చాటింగ్‌ బయటపడడంతో టెలిఫోన్‌ హ్యాకింగ్‌ అంశం మరోసారి అందరినోళ్లలో నానుతున్నది. విపక్ష నాయకుల ఫోన్లను టాపింగ్‌ చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. మరోవైపు సోషల్‌ మీడియాలో అధికారపక్షంపై కూడా ఒత్తిడి తీసుకువచ్చే ప్రచారం జరుగుతున్నది. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి నిర్ణయంచడంతో పాటు హుజూరాబాద్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకొని ప్రభుత్వం ఈ నియోజకవర్గ పరిధిలో 20,929 కుటుంబాలకు ఇంటికి పది లక్షల రూపాయల మేరకు ఆర్థిక సహాయం అందించి ఉపాధికల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు నియోజకవర్గంలోని 427 మంది దళిత మహిళలు, పురుషులతో ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఈ పథకం అమలుకు మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తుండగా సోషల్‌ మీడియాలో పద్మశాలిబంధు, రజకబంధు, వైశ్యబంధు పథకాలు అమలు చేయాలనే డిమాండ్‌తో ప్రచారాలు ఊపందుకున్నాయి. పద్మశాలి బంధు పథకం కావాలి ప్రతి ఇంటికి పది లక్షలు రావాలి అని ఒక పోస్టింగ్‌, రజకబంధు పథకం కావాలి.. ప్రతి ఇంటికి పది లక్షలు రావాలని మరో పోస్టింగ్‌లను విస్తృతంగా వైరల్‌ చేస్తున్నారు.


అలాగే ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని, ఉప ఎన్నికవస్తే హుజురాబాద్‌లాగా మా నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతుందనే పోస్టింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలారా మీరు రాజీనామా చేస్తే మిమ్మల్ని మళ్లీ గెలిపిస్తామంటూ పలువురు వాట్సాప్‌, ఫేస్‌బుక్కుల్లో పోస్టు చేస్తున్నారు. సోషల్‌ మీడియా ప్రచారాలు ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారి ఎమ్మెల్యేలపై నిజంగానే ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైతే తాము కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాదిరిగా ఆర్థికంగా లబ్దిపొందవచ్చని అటు ప్రజాప్రతినిధులు, ఇటు ప్రజల్లో ఆశలు కలుగుతున్నాయి. ప్రధానంగా దళితబంధు పథకం, కొత్తపెన్షన్లు, రేషన్‌కార్డులు, రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఎస్‌సీ ఎమ్మెల్యేలు ఉన్న మానకొండూర్‌, చొప్పదండి నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రచారం ఊపందుకున్నది. ఈ ప్రచారమే మిగతా నియోజకవర్గాలకు కూడా పాకే అవకాశమున్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం పద్మశాలిబంధు, రజకబంధు, వైశ్యబంధు పోస్టులు సర్క్యులేట్‌ అవుతున్నాయి. ప్రచారాల ద్వారా రాబోయే రోజుల్లో మరింత గందరగోళ పరిస్థితులు తలెత్తే పరిస్థితులు లేకపోలేదని భావిస్తున్నారు. 



Updated Date - 2021-07-30T05:40:43+05:30 IST