సొసైటీ దొంగల పట్టివేత

ABN , First Publish Date - 2021-07-30T05:57:28+05:30 IST

ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ నిధుల గోల్‌మాల్‌లో నిందితులు మొత్తం ఎనిమిది మందిని డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలిక గర్గ్‌ కేసు వివరాలను వెల్లడించారు. మొదట ది వేటపాలెం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పేరుతో 1949 ఆగస్టు 1న ఏర్పాటుచేశారు. దీనిని 1984లో ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌గా మార్చారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీలో ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, మిగిలిన ఏడుగురు డైరెక్టర్లుగా ఉంటారు. వీరు సెక్రటరీ కమ్‌ మేనేజర్‌ను నియమించుకుంటారు.

సొసైటీ దొంగల పట్టివేత
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మలిక గర్గ్‌

దివేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ స్కామ్‌లో నిందితుల అరెస్ట్‌ 

ప్రెసిడెంట్‌, సెక్రటరీ, డైరెక్టర్లు మొత్తం ఎనిమిదిమంది అరెస్ట్‌

మొత్తం రూ.22,69,91,882 డిపాజిట్లు

లావాదేవీలు నిలిపివేయాలని బ్యాంకులకు లేఖలు

వివరాలు వెల్లడించిన ఎస్పీ మలిక గర్గ్‌

వేటపాలెం(చీరాల), జూలై 29 : ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ నిధుల గోల్‌మాల్‌లో నిందితులు మొత్తం ఎనిమిది మందిని డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలిక గర్గ్‌ కేసు వివరాలను వెల్లడించారు.  మొదట ది వేటపాలెం కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పేరుతో 1949 ఆగస్టు 1న ఏర్పాటుచేశారు. దీనిని 1984లో ది వేటపాలెం కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌గా మార్చారు. తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీలో ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, మిగిలిన ఏడుగురు డైరెక్టర్లుగా ఉంటారు. వీరు సెక్రటరీ కమ్‌ మేనేజర్‌ను నియమించుకుంటారు. ఆ క్రమంలో ప్రస్తుతం సెక్రటరీ కమ్‌ మేనేజర్‌ శ్రీరామ్‌ శ్రీనివాసరావు సుమారు 35 సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2008కు ముందు కమిటీ పదవీకాలం మూడేళ్లుగా ఉండేది. ఆ తర్వాత కాలపరిమితిని ఐదేళ్లుగా పొడిగించారు. ఈ నేపఽథ్యంలో మొత్తం కమిటీలో ఒకరు చనిపోయారు. మిగిలిన ఎనిమిది మంది సొసైటీని పర్యవేక్షిస్తున్నారు.

సందేహంతో స్టేషన్‌లో ఫిర్యాదు

సొసైటీలో మొత్తం 1737 మంది షేర్‌ హోల్డర్లు ఉన్నారు. వీరికి సంబంధించి 1,330 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 138 రికరింగ్‌ డిపాజిట్లు, 850 సేవింగ్‌ డిపాజిట్లు ఉన్నాయి. వాటి విలువ రూ.22,69,91,882లు. సొసైటీ కార్యకలాపాలకు సంబంధించిన సందేహాలతో తమ డిపాజిట్లకు భద్రత లేదని భావించిన గుత్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 20న ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణ నేపఽథ్యంలో నిందితులు శ్రీరామ్‌ శ్రీనివాసరావు(సెక్రటరీ కమ్‌ మేనేజర్‌), వలివేటి నాగేశ్వరరావు(ప్రెసిడెంట్‌), వల్లంపట్ల రామలింగస్వామి(వైస్‌ ప్రెసిడెంట్‌), చిల్లంకూరి ఆంజనేయగుప్త(డైరెక్టర్‌), కోడూరి రాజేంద్రప్రసాద్‌ (డైరెక్టర్‌), నూనె మోహనకృష్ణ(డైరెక్టర్‌), కొల్లిశెట్టి వెంకటసత్యన్నారాయణ (డైరెక్టర్‌), రాయవరపు శ్రీనివాసరావు(డైరెక్టర్‌)లను డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేశారు.

అందరూ కుమ్మక్కై దోచేశారు

సొసైటీ కమిటీ వారు మేనేజర్‌ కమ్‌ సెక్రటరీ శ్రీరామ్‌ శ్రీనివాసరావుతో కుమ్మక్కయ్యారు. వారు పదవీ బాధ్యతలు నిర్వహించే సమయంలో ఎలాంటి రికార్డులు పరిశీలించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం సీఏ(ఛార్టెడ్‌ అకౌంటెంట్‌)తో ఆడిట్‌ చేయించాలి. ఆ రిపోర్ట్‌ను జిల్లా కోఆపరేటివ్‌ అధికారికి పంపించాలి. అది జరగలేదు. దానిపైనా విచారణ జరుగుతోంది. మేనేజర్‌ శ్రీనివాసరావు రూ.5కోట్లు విలువచేసే ఆస్తులను వివిధ రూపాల్లో సొసైటీ సొమ్ముతో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు కమిటీ సహకరించింది.


బ్యాంకు ఖాతాలు నిలిపివేత

విచారణలో తేలిన నిజాల ఆధారంగా మేనేజర్‌ శ్రీనివాసరావు, అతని భార్యకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను, లాకర్‌లను నిలుపుదల చేయాలని సంబంధిత బ్యాంకు అధికారులకు పోలీసులు లేఖలు రాశారు. మిగిలిన నిందితులు ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను, లావాదేవీలను కూడా నిలుపదల చేయాలని సంబంధిత బ్యాంకు మేనేజర్లకు లేఖలు రాశారు. అలానే సదురు నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు సిఫార్సు చేశారు. రికార్డులను సీజ్‌ చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఏఎస్పీ చౌడేశ్వరి, డీఎస్పీ శ్రీకాంత్‌, మరి కొంతమంది సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. 


అన్ని కోణాల్లో విచారణ

కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, సహకారశాఖ మంత్రి కన్నబాబు ఆదేశాల మేరకు జిల్లా కోఆపరేటివ్‌ అధికారులు స్పందించారు. విచారణలో తాము వారితో కలిసి అడుగులు వేస్తామని డీఎస్పీ శ్రీకాంత్‌ ఎస్పీకి తెలిపారు. అలానే వేటపాలెంలో శ్రీ వెంకటసాయి ఫైనాన్స్‌ పేరుతో సుమారు రూ.100 కోట్లుకుపైగా సొమ్మును స్వాహా చేసిన కేసులో నిందితుడు శిఖాకొల్లి శ్రీనివాసరావుకు సంబంధించిన కేసును పరిశీలిస్తామని ఎస్పీ మలిక గర్గ్‌ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


ఎస్పీని కలిసిన బాధితులు

వేటపాలెం పోలీస్‌స్టేషన్‌కు ఎస్పీ వస్తున్నారని తెలసుకున్న బాధితులు పలువురు అక్కడకు చేరుకున్నారు. ఎస్పీని కలిసి తాము ఎలా మోసపోయింది వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. వారికి ఎస్పీ భరోసా కల్పించారు.


పరుగులు పెట్టించిన ఎస్పీ

స్ధానిక పోలీసు అధికారులను ఎస్పీ పరుగులు పెట్టించారు. ముందస్తుగా వేటపాలెం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆ తర్వాత సచివాలయాలను సందర్శిస్తారని వారికున్న సమాచారం. అయితే ముందస్తుగా సచివాలయాన్ని సందర్శించి ఆ తర్వాత స్టేషన్‌కు వచ్చారు. దీంతో హైరానా పడటం అధికారులు, సిబ్బంది వంతైంది.


Updated Date - 2021-07-30T05:57:28+05:30 IST