కర్ర రైతుకు కష్టాలే!

ABN , First Publish Date - 2021-04-13T06:31:12+05:30 IST

జామాయిల్‌, సుబాబుల్‌ కర్రను దళారుల చుట్టూ తిరిగి వారిని బతిమాలుకుని అవసరమైతే తెలిసిన వాళ్ల చేత సిఫార్సులు చేయించుకుంటే తప్ప అమ్ముకోలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

కర్ర రైతుకు కష్టాలే!

దగా పడుతున్న జామాయిల్‌,

సుబాబుల్‌ సాగుదారులు

తెలంగాణకు రవాణాలో ఇబ్బందులు

కొన్నేళ్లుగా శ్రమను దోచుకుంటున్నా 

పట్టించుకోని ప్రభుత్వం 

పక్షం నుంచి కొనుగోళ్లు నిలిపివేసిన మిల్లులు

కొనేనాథుడు లేక లబోదిబో 

పేపరు పరిశ్రమ ఏర్పాటుతోనే సమస్యకు పరిష్కారం 

కర్ర రైతుకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న జామాయిల్‌, సుబాబుల్‌ కర్రను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా వారిని పేపరు పరిశ్రమలు దగా చేస్తున్నాయి. శ్రమకు తగిన ఫలితం కాకున్నా కనీసం పెట్టుబడులు కూడా ఇవ్వకుండా నిలువునా దోచుకుంటున్నాయి. గిట్టుబాటు ధర సంగతి దేవుడికెరుక కనీసం గౌరవంగా అమ్ముకోగలిగే పరిస్థితి అయినా కల్పించండి మహాప్రభో అని రైతులు వేడుకుంటుండగా రాష్ట్రప్రభుత్వం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో పేపరు పరిశ్రమలు, ఏజెంట్లు, మధ్య దళారీలు రెట్టించిన ఉత్సాహంతో రైతు శ్రమని దోచుకుతింటున్నారు. ఎలాగోలా కష్టపడి తెలిసిన వారితో చెప్పించుకుని కర్ర అమ్మితే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని దుస్థితి. రైతు శ్రమ, పొలం కౌలు, పెట్టుబడి వడ్డీలు పూర్తిగా వదిలేసుకున్నా మొక్కలు కొనుగోలు మొదలు సేద్యం, ఎరువులు, కూలీల కోసం పెట్టిన ఖర్చులు కూడా  చేతికి రావటం లేదు. జామాయిల్‌, సుబాబుల్‌ వేసిన పొలాల్లో మోడులు తీసివేయించి ప్రత్యామ్నాయ పంటల సాగుకి అనుకూలంగా మార్చుకోవాలంటే కనీసం రూ.20 వేలు ఖర్చవుతుండటంతో కర్ర అమ్మితే వచ్చే డబ్బు దానికి సరిపోవటం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. 

కందుకూరు, ఏప్రిల్‌ 12 : జామాయిల్‌, సుబాబుల్‌ కర్రను దళారుల చుట్టూ తిరిగి వారిని బతిమాలుకుని అవసరమైతే తెలిసిన వాళ్ల చేత సిఫార్సులు చేయించుకుంటే తప్ప అమ్ముకోలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో కోతలు, కొనుగోళ్లు పక్షంరోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం భద్రాచలం, మహారాష్ట్రలోని భల్లార్ష పేపరు పరిశ్రమలు మాత్రమే జామాయిల్‌ కొనుగోలు చేస్తుండగా.. రాజమండ్రి, భద్రాచలం పేపరు మిల్లులు సుబాబుల్‌ కొనుగోలు చేస్తున్నాయి. భద్రాచలం పేపరుమిల్లుకి పక్షం రోజులుగా సరకు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. తెలంగాణలో కర్ర రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న లక్ష్యంతో ఆప్రభుత్వం మనరాష్ట్రం నుంచి కర్ర రవాణాపై ఆంక్షలు విధించటంతో భద్రాచలానికి కర్ర తరలించటం సమస్యగా మారిందని చెబుతున్నారు. 


ఇండెంట్లను తగ్గించారు

భల్లార్ష పేపరు పరిశ్రమ తాట తీసిన జామాయిల్‌ టన్నుకి రూ.5600 చెల్లిస్తున్నప్పటికీ రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు పోను రైతుకు టన్నుకి రూ.1,900 మాత్రమే చేతికొస్తున్న పరిస్థితి. ఇక స్థానికంగా ఉన్న శ్రీకాళహస్తి పేపర్‌ బోర్డ్స్‌ పరిశ్రమ, కందుకూరు సమీపంలోని కోవూరు వద్ద ఉన్న రంగా పార్టికల్‌ బోర్డ్స్‌ పరిశ్రమ వారు టన్నుకి ముడికర్రకు రూ.2,100  ఇస్తుండగా ఖర్చులు పోను రైతుకి రూ.1,400 మాత్రమే చేతికొస్తున్నాయి. ఒక్క భద్రాచలం పేపరు పరిశ్రమకు తోలగలిగితే రైతుకి టన్నుకి జామాయిల్‌కి రూ.2400, సుబాబుల్‌కి రూ. 2,800వరకు దక్కుతోంది. అయితే ప్రస్తుతం ఆ మిల్లు జిల్లాలోని ఏజెంట్లకు ఇచ్చే ఇండెంట్లను గణనీయంగా తగ్గించింది. పక్షంరోజులుగా పూర్తిగా నిలిపివేసింది. కోతలు తిరిగి ప్రారంభమైనా కేవలం రోజుకి పది లారీలకు మాత్రమే పర్మిట్లు ఇస్తున్నారని చెబుతున్నారు. జిల్లాలో భద్రాచలం పేపరు పరిశ్రమకు ఇద్దరు ప్రధాన ఏజెంట్లు ఉండగా వారిద్వారా గతంలో రోజూ 40 లారీల సరుకు తరలేది. అయితే ప్రస్తుతం వారిద్దరికీ కలిపి కూడా రోజుకి 9 లారీలకే పర్మిట్లు ఇస్తుండటంతో జామాయిల్‌, సుబాబుల్‌ అమ్ముకోవటం రైతుకు తలకి మించిన భారంగా మారింది.


చోద్యం చూస్తున్న ప్రభుత్వం

జామాయిల్‌, సుబాబుల్‌ రైతులు కొన్నేళ్లుగా నిలువుదోపిడీకి గురవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏటా పెట్టుబడులకు అనుగుణంగా సమీక్షించి మద్దతు ధరను ప్రకటించాల్సిన ప్రభుత్వం ఐదేళ్లుగా ఆవైపు దృష్టి సారించలేదు. గత ప్రభుత్వంలోను చివరి మూడేళ్లు ధరపై సమీక్ష చేపట్టకపోగా, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు పట్టించుకోలేదు. దీంతో ఐదేళ్ల క్రితం నిర్ణయించిన టన్ను రూ.4,400 ధరే అమలులో ఉంది. అయితే టన్నుకి రూ. 4,400 పేరుకే గానీ రైతులకు కనీసం రూ.2వేలు కూడా దక్కని దయనీయ పరిస్థితి నెలకొంది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని గ్రామాల్లో ఉండే దళారులు టన్ను రూ.వెయ్యి, పన్నెండు వందలకు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖామంత్రి మోపిదేవి వెంకటరమణ  నేతృత్వంలో పలుమార్లు సమావేశాలు ఏర్పాటుచేయగా కందుకూరు ఎమ్మెల్యే మహీధరరెడ్డి, మరికొందరు ప్రజాప్రతినిధులు రైతుల దుస్థితిని సవివరంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం శూన్యం.


 జిల్లాలో 1.20లక్షల ఎకరాల్లో సాగు

 జిల్లాలో లక్షా 20వేల ఎకరాల్లో జామాయిల్‌, సుబాబుల్‌ సాగులో ఉన్నట్లు అంచనా.  అయితే పేపరు పరిశ్రమలు మాత్రం తెలంగాణ , మహారాష్ట్ర, కర్ణాటకలలో అధికంగా ఉన్నాయి. జామాయిల్‌ సాగుని నిషేధించిన కర్ణాటకలో పేపరు పరిశ్రమలు ఉండగా విస్తారంగా సాగులో ఉన్న మన రాష్ట్రంలో ఒక్క రాజమండ్రి పేపరు పరిశ్రమ తప్ప మరొకటి లేదు. రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న ఏపీ పేపరు మిల్లు (రాజమండ్రి) పనితీరు కూడా అంతంతమాత్రం కావటంతో రైతుకి ఏమాత్రం న్యాయం జరగటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దులో పేపరు పరిశ్రమ ఏర్పాటయ్యేలా చూడటం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు సూచిస్తున్నారు. తక్షణ  పరిష్కారంగా మార్కెట్‌ యార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపించాలని వారు కోరుకుంటున్నారు. 


ఐదేళ్లుగా రైతులకు ఏటా రూ.50కోట్ల నష్టం

పేపరు పరిశ్రమలు, దళారీల దోపిడీ కారణంగా జిల్లాలోని రైతులు  ఏటా రూ.50 కోట్లు నష్టపోతున్నారు. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ మేరకు పేపరు పరిశ్రమలు, దళారీలు లాభపడ్డారు.  ఇటీవలి కాలంలో తప్ప ఐదేళ్లుగా జిల్లా నుంచి సరాసరిన ప్రతిరోజూ 30 లారీలకు తక్కువ కాకుండా జామాయిల్‌, సుబాబుల్‌ తరలి వెళ్లేది. లారీకి 22 టన్నులు వేసుకుని ఏడాదిలో సెలవులు, ఇతరత్రా కొన్నిరోజులు తీసివేసి 300 రోజులే సరకు రవాణా జరిగిందనుకున్నా ఏటా లక్షా 98వేల టన్నుల జామాయిల్‌ జిల్లా నుంచి  వెళ్లుంది. ప్రభుత్వం ప్రకటించిన టన్నుకి రూ.4400 మద్దతు ధర ప్రకారం చూస్తే కొందరు రైతులు రూ.2వేలు, మరికొందరు రూ.3వేలు నష్టపోతున్నట్లు అర్థమవుతుంది. ఆ లెక్కన టన్నుకి సరాసరిన రూ.2500 వరకు రైతు శ్రమదోపిడీ జరుగుతోంది. అలా చూస్తే ఏటా యాభై కోట్లు, ఐదేళ్లలో రూ.250 కోట్లు జిల్లాలోని సామాజికవనాల రైతులు నష్టపోయారు. 


Updated Date - 2021-04-13T06:31:12+05:30 IST