మెతుకు సందర్భం

ABN , First Publish Date - 2020-12-31T06:03:16+05:30 IST

వేల మెట్రిక్‌ టన్నుల బరువు మట్టిని ఒత్తుతోంది దేశ సౌభాగ్యాల కల...

మెతుకు సందర్భం

వేల మెట్రిక్‌ టన్నుల బరువు

మట్టిని ఒత్తుతోంది

దేశ సౌభాగ్యాల కల

నేల రాలుతోంది


సమస్తం కృత్రిమమే

సకలం ముసుగులే

కీటకాల అడవిలో

కంకులు తలవంచాయా


నాగలి మోస్తున్న 

భుజం నలిగింది

మట్టి పూసుకున్న 

ఒళ్లు పగిలింది

ఆరుగాలం చెమట లెక్కింపులు

గిట్టుబాటు మద్దతులోకి చేరవంట

ప్రపంచీకరణ మాయ అట


పుడమితల్లి మెతుకు పాటలకు

నిరంతర చేతనల 

శ్రమ ఫలాలకు

దేశం కడుపులోకి విసిరే

అన్నం ముద్దల సాక్షిగా

ఇపుడు- 

పిడికిలి గళమెత్తింది

తలపాగాకు చలి వణికింది. 

దాట్ల దేవదానం రాజు

జక్రియనగర్‌, యానాం, 9440105987

Updated Date - 2020-12-31T06:03:16+05:30 IST