చేతులెలా వచ్చాయో!

ABN , First Publish Date - 2022-05-29T14:13:36+05:30 IST

అప్పటి వరకూ తన భార్యాపిల్లల్ని అపురూపంగా చూసుకున్న ఓ వ్యక్తి.. రాత్రికి రాత్రే వారి పాలిట కాలయముడయ్యాడు. చెప్పుకోలేని ఏ కష్టమొచ్చిందో?.. భరించలేని ఏ

చేతులెలా వచ్చాయో!

- భార్యాపిల్లలను చంపి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య 

- ముందుగా మత్తు మందు ఇచ్చి.. ఆపై రంపంతో మెడలు కోసి...

- పల్లావరంలో కలకలం


పెరంబూర్‌(చెన్నై): అప్పటి వరకూ తన భార్యాపిల్లల్ని అపురూపంగా చూసుకున్న ఓ వ్యక్తి.. రాత్రికి రాత్రే వారి పాలిట కాలయముడయ్యాడు. చెప్పుకోలేని ఏ కష్టమొచ్చిందో?.. భరించలేని ఏ బాధ అతడిని అంత కఠిన నిర్ణయానికి పురిగొల్పిందో గానీ.. భార్యాపిల్లల్ని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానిక పల్లావరం సమీపంలోని పొళిచ్ఛలూరుకు చెందిన ప్రకాష్‌ (41)కు భార్య గాయత్రి (39), కుమార్తె నిత్యశ్రీ (13), కుమారుడు హరిహరన్‌ (8) వున్నారు. ఆ కుటుంబం ఆడుతూపాడుతూ సంతోషంగా సాగిపోతుండేది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వారి ఇంటినుంచి  దుర్వాసన వస్తుండడం, తెల్లవారిన తరువాత కూడా ఆ కుటుంబీకులెవ్వరూ బయట కు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు లోనికెళ్లి చూశారు. అంతే! అక్కడ కనిపించిన హృదయవిదారకరమైన ఘటనను చూసి దిగ్ర్భాంతి చెందారు. నలుగురి మృతదేహాలు రక్తపు మడుగులో పడి వుండగా, మెడలు తెగిన స్థితిలో బీభత్స దృశ్యం చూసి వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీ నం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద స్థలిలో ఓ గోడపై అంటించిన పేపర్‌పై ‘ఆత్మహత్య చేసుకోవాలని సామూహికంగా నిర్ణయించుకున్నాం’ అని రాసి వుంది. ఆ గదిలో అన్వేషించిన పోలీసులకు ప్రకాష్‌ ఇతరులకు రాసిచ్చిన రూ.3.5 లక్షల విలువైన రుణపత్రాలు కూడా లభించాయి. ప్రాథమిక దర్యాప్తులో ప్రకాష్‌ కుటుంబానికి అప్పులున్నట్లు తేలింది. రుణదాతల నుంచి వచ్చిన ఒత్తిడిని భరించలేకే ఆ కుటుంబం బలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


 శీతల పానీయంలో మత్తు మందు కలిపి...

ప్రకాష్‌ తన ఇద్దరు పిల్లలకు, భార్యకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి, వారి స్పృహ కోల్పోయాక, బ్యాటరీతో పనిచేసే రంపంతో మెడలు కోసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం అదే రంపంతో అతను తన మెడ కోసుకున్నాడు. 


సులభంగా మెడ తెగుతుందనీ..

నిజానికి ఎంత పదునైన రంపం అయినా మెడ కోయడం కష్టమని పోలీసులు చెబుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన ప్రకాష్‌.. బ్యాటరీతో నడిచే అతి పదునైన రంపాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అది ఈ నెల 19వ తేదీ అతని ఇంట్లో డెలివరీ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. బ్యాటరీతో నడిచే రంపం అయితే మెడకు తగిలించిన తెగిపోతుందని, అందుకే దానిని ప్రకాష్‌ తెప్పించి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరైనా హత్య చేసి, దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 


వివాహ దినోత్సవం నాడే దారుణం

శుక్రవారం ప్రకాష్-గాయత్రి దంపతుల వివాహ దినోత్సవమని స్థానికులు తెలిపారు.పెళ్లిరోజు సందర్భంగా ఆ కుటుం బం శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సినిమాకు కూడా వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు శీతలపానీయాలు తెచ్చుకున్నారు. కాగా గాయత్రి బీజేపీలో స్థానిక కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆమే చుట్టుపక్కల వారివద్ద అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమె వివిధ రకాల మూలికలు కూడా విక్రయించేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 

Updated Date - 2022-05-29T14:13:36+05:30 IST