Abn logo
Sep 27 2021 @ 02:51AM

రూ.14 లక్షల కట్నం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లి.. సరిగ్గా 27వ రోజు కూతుర్ని చూసేందుకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు..

నవ వధువు దారుణ హత్య

ఆమెపై అనుమానంతో కట్టుకున్న భర్తే చంపాడు

మెడ కోసి చంపి.. మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం

చావుబతుకుల్లో భర్త.. పెళ్లయిన 27 రోజులకే..

హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో ఘటన


నిజాంపేట్‌, కామారెడ్డి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని ఆ తల్లిదండ్రులు అడిగినంత కట్నంతో తమ కూతురునిచ్చి వైభవంగా పెళ్లి చేశారు. పెళ్లయి 27 రోజులే అయింది. కూతురుని, అల్లుడిని ఓసారి చూసొద్దామని ఇంటికొచ్చిన ఆ కన్నవారికి కలలో కూడా ఊహించని దృశ్యం కనిపించింది. పడక గదిలో బెడ్‌పై రక్తపు మడుగులో కన్నకూతురు మృతదేహం కనిపించింది. ఆమె మెడ.. కాళ్లు, చేతులకు కత్తితో కోసిన గాయాలున్నాయి. అక్కడే మెడ, మణికట్టుకు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అల్లుడు కనిపించాడు. హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో ఈ దారుణం జరిగింది. పెళ్లయిన తెల్లారి నుంచే అనుమానంతో భార్యను వేధిస్తుండటం, ఫోనొస్తే కూడా ఆమెను మాట్లాడనివ్వకపోవడంతో భర్తే ఆమెను హత్యచేసి, ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భావిస్తున్నారు. కాళ్లపారాణి ఆరకముందే కూతురు దారుణ హత్యకు గురవడంతో ఆ తల్లిదండ్రులు కంటికి మంటికీ ధారగా రోదిస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా, దేవునిపల్లికి చెందిన పుట్టల గంగా రాం వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు.


ఆయనకు ముగ్గురు సంతానంలో సుధారాణి (23) చిన్న కూతురు.  కామారెడ్డిలోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటు న్న  సిద్ధిరాములు కుమారుడు, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎర్రోళ్ల కిరణ్‌ కుమార్‌తో గత నెల 28న సుధారాణి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 14 లక్షల నగదు, కామారెడ్డిలో ఓ ప్లాట్‌, పది తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లయిన మర్నా టి నుంచే సుధారాణిని కిరణ్‌ మానసిక, శారీరక వేధింపులకు గురిచేశాడు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి ఆమె తీసుకెళ్లడంతో వారు అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. 15 రోజుల క్రితం ప్రగతినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో తాను కొన్న ప్లాట్‌లో భార్యతో కలిసి కిరణ్‌ దిగాడు. కూతురు ను చూసేందుకు గంగారామ్‌ దంపతులు శనివారం (25వ తేదీ) భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తమ స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలోనే సుధారాణికి ఆమె తల్లి ఫోన్‌ చేసి ‘మేము వస్తున్నామమ్మా’ అని చెప్పింది. ఆవలి వైపు నుంచి కూతురు గొంతులోంచి ‘వస్తున్నారా’ అనే మాటొక్కటే వినిపించి ఆగిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు వారు ప్రగతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 7గంటల దాకా తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. 8గంటల ప్రాంతం లో ఫోలీసులకు ఫోన్‌ చేస్తే..వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడ గా.. బెడ్‌రూంలో సుధారాణి-కిరణ్‌ రక్తపు మడుగులో పడివున్నారు. అప్పటికే సుధారాణి మృతి చెందింది.


కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యాహ్నం 3గంటలకే సుధారాణిని కిరణ్‌ హత్యచేసి, ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధారాణి హత్యతో ఆమె తరఫువారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కామారెడ్డి శ్రీరాంనగర్‌ కాలనీలో కిరణ్‌ తండ్రి సిద్ధిరాములు ఇంటి వద్ద వారు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లోపలికి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. కిరణ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడని చెప్పడంతోనే తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేశామని, ఇంతటి దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదని తల్లిదండ్రులు రోదించారు.