Abn logo
Sep 27 2021 @ 03:00AM

మణికొండ వరదలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గల్లంతు

  • ధ్రువీకరించని కుటుంబీకులు
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి సబిత
  • 60 మందితో గాలింపు
  • వరదలో గల్లంతైన టెకీ రజనీకాంత్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షం కారణంగా డ్రైనేజీ గుంతలో పడి మణికొండలోని పుప్పాలగూడకు చెందిన టెకీ రజనీకాంత్‌ గల్లంతయ్యారు. పుప్పాలగూడ గోల్డెన్‌ టెంపుల్‌ ప్రాంతంలో నివసించే రజనీకాంత్‌ శనివారం రాత్రి 9 గంటల సమీపంలో ఇంటి నుంచి బయటకు వచ్చారు. చీకట్లో రోడ్డు దాటి గోల్డెన్‌ టెంపుల్‌ వైపునకు వెళ్లగా.. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్‌ గుంతలో పడిపోయి గల్లంతయ్యారు. సాయంత్రం వరకు నిర్మాణ పనులు చేసిన సిబ్బంది అక్కడ ఎలాంటి సూచికలూ, బారికేడ్లు పెట్టకుండా వెళ్లిపోయారు. చీకట్లో డ్రైనేజీ గోతిలో పడ్డ రజనీకాంత్‌ వరద ఉధృతికి కొట్టుకొని పోయారు. స్థానికుడు తీసిన వీడియోలో ఇదంతా రికార్డు కావడంతో ప్రమాద విషయం బయటకు వచ్చింది. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు అటువైపు ఎవరూ వెళ్లకుండా కర్రలు, బారికేడ్లు పెట్టారు. ఆదివారం ఉదయం 7 గంటలకు గాలింపు చర్యలు ప్రారంభించారు. డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 3 బృందాలు, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 16 మంది సభ్యులు, 10 మంది గజ ఈతగాళ్లు.. మొత్తం 60 మంది గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నారు. పుప్పాలగూడ నుంచి డ్రైనేజీ లైన్‌ పందెన్‌ వాగులోకి చేరుతుంది. గోల్డెన్‌ టెంపుల్‌ నుంచి పందెన్‌వాగు వరకు  పైప్‌లైన్‌ ఉంది. అక్కడి నుంచి 3.44 కిలోమీటర్ల దూరం ప్రవహించి, తారమతి ప్రాంతంలో మూసీ నదిలో కలుస్తుంది. గోల్డెన్‌ టెంపుల్‌ నుంచి పందెన్‌వాగు వరకు ఉన్న పైప్‌లైన్‌ను క్షుణ్ణం గా పరిశీలించారు. పందెన్‌ వాగు పరిసరాల్లో వెతుకులాట ప్రారంభించారు. వాగులో బోట్ల ద్వారా గాలింపు చేపట్టారు.


మూసీలో కూడా వెతికారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం రజనీకాంత్‌ గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ డ్రైనేజీ పనులు జరిగినా తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్‌ అమేయ్‌కుమార్‌ ఘట నా స్థలానికి చేరి పరిస్థితిని సమీక్షించారు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.


అధికారుల తప్పిదం లేదు: జయంత్‌, మునిసిపాలిటీ కమిషనర్‌ 

గల్లంతైన వ్యక్తి కోసం ఉదయం 7 గంటల నుంచి వెతుకులాట ప్రారంభించాం. పందెన్‌వాగులో బోట్ల ద్వారా వెతికినా ఫలితం లేదు. రాత్రి 7 గంటల సమయంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిలిపివేశాం. నిర్లక్ష్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తాం. గోల్డెన్‌ టెంపుల్‌ ప్రాంతంలో మూడు వైపుల నుంచి వర్షం నీరు భారీగా చేరడంతో బారికేడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో అధికారుల నిర్లక్ష్యం లేదు.


100కు సమాచారమిచ్చిన హాసిని

డ్రైనేజీ గుంతలో పడి వ్యక్తి గల్లంతైన విషయాన్ని శ్రీనివాసాచారి చెప్పగానే.. ఇంట్లో ఉన్న ఆయన కూతురు హాసిని 100కు డయల్‌ చేసింది. పోలీసులకు లోకేషన్‌ వివరాలను అందజేసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చారు. 


గల్లంతయ్యింది రజనీకాంతే..!

టెకీ రజనీకాంత్‌ గల్లంతును కుటుంబసభ్యులు ధ్రువీకరించడం లేదు. అయితే వీడియోలో గల్లంతైన వ్యక్తిని చూసి బంధువులు, స్థానికులు రజనీకాంత్‌ అనే చెబుతున్నారు. రజనీకాంత్‌ ఉండే అపార్ట్‌మెంట్‌వాసులు సైతం అంగీకరిస్తున్నారు. వీడియో తీసిన వ్యక్తి ఇచ్చిన వివరాల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం రజనీకాంత్‌ గల్లంతైనట్లు అంగీకరించడంలేదని, శనివారం రాత్రి నుంచి ఆయన మొబైల్‌ స్విచ్ఛా్‌ఫలో ఉందని, ఇంట్లోనూ లేడని పోలీసులు తెలిపారు.


చూస్తుండగానే కొట్టుకుపోయాడు.. :శ్రీనివాసాచారి, ప్రత్యక్ష సాక్షి

‘చాలా దారుణం. నా కళ్ల ముందే ఓ వ్యక్తి డ్రైనేజీలో కొట్టుకుపోయాడు’ అని ప్రత్యక్ష సాక్షి యాసోజు శ్రీనివాసాచారి తెలిపారు. గోల్డెన్‌ టెంపుల్‌ ఎదురుగా ఉన్న భవనంలో శ్రీనివాసాచారి నివాసముంటున్నారు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత బాల్కనీలో నుంచి వరదను తన మొబైల్‌లో వీడియో తీస్తున్నారు. ఈ క్రమంలోనే మోకాల్లోతు వరద నీటిలో నడుచుకుంటూ వస్తున్న రజనీకాంత్‌ డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు. ఆయన వీడియో తీయకపోయి ఉంటే రజనీకాంత్‌ గల్లంతైన విషయం తెలిసేదే కాదని స్థానికులు చెబుతున్నారు.