ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు దూసుకెళ్లి..టిప్పర్‌ బీభత్సం

ABN , First Publish Date - 2022-01-19T15:38:46+05:30 IST

నగర శివారు విజయవాడ జాతీయ రహదారిపై ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా డివైడర్‌ను దాటి అవతలివైపు రోడ్డుపై వెళ్తున్న కారుపైకి..

ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు దూసుకెళ్లి..టిప్పర్‌ బీభత్సం

కారులో ఇరుక్కుపోయిన సాఫ్ట్‌వేర్‌ కుటుంబం  

సంక్రాంతి ముగించుకుని నగరానికి వస్తుండగా ప్రమాదం 

గాయాలతో బయటపడ్డ సభ్యులు 

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): నగర శివారు విజయవాడ జాతీయ రహదారిపై ఓ టిప్పర్‌ బీభత్సం సృష్టించింది. డ్రైవర్‌ అజాగ్రత్త కారణంగా డివైడర్‌ను దాటి అవతలివైపు రోడ్డుపై వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్‌ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్‌ కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది.  


గచ్చిబౌలిలో ఉంటున్న బి.తనుజా, వంశీకృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈనెల 12న తనుజా దంపతులు కూతురు షైనశ్రీ(3)తో కలిసి కారులో విజయవాడలోని ఆమె సోదరి నీరజ ఇంటికి వెళ్లారు. సోమవారం రాత్రి 12గంటలకు సోదరి నీరజను వెంటబెట్టుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. తనుజా కారు నడుపుతుండగా ముందుసీట్లో నీరజ, వెనుక సీట్లో వంశీకృష్ణ, చిన్నారి షైనశ్రీ కూర్చున్నారు. కాగా వీరు తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నగర శివారు బాటసింగారం వద్దకు రాగానే దేశ్‌ముఖ్‌కాలనీ రోడ్డు నుంచి జాతీయ రహదారివైపు వేగంగా వస్తున్న టిప్పర్‌ (ఏపీ29టీ5106) డివైడర్‌ను దాటి వీరి కారుపైకి దూసుకెళ్లింది. అనంతరం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. అదే సమయంలో వెనకాలే వస్తున్న ఆర్టీసీ బస్‌ కారును ఢీకొట్టింది.


ఏకకాలంలో రెండు వాహనాలు ఢీకొట్టడంతో కారు పూర్తిగా దెబ్బతింది. కారులో ఇరుక్కుపోయిన నలుగురు కుటుంబసభ్యులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇతర వాహనదారులు వారిని అతి కష్టంమీద బయటకి తీశారు. క్షతగాత్రులను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వంశీకృష్ణకు ఛాతితోపాటు ఇతర భాగాల్లో, నీరజకు భుజంపై, తనుజా చేతి వేళ్లకు గాయాలుకాగా, షైనశ్రీ కాళ్లకు గాయాలయ్యాయి. బస్‌ డ్రైవర్‌తోపాటు టిప్పర్‌ డ్రైవర్‌కు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-19T15:38:46+05:30 IST