స్వైన్‌ఫ్లూ ఎఫెక్ట్ : మూడు నగరాల్లో సాఫ్ట్‌వేర్ కార్యాలయాల మూసివేత

ABN , First Publish Date - 2020-02-21T16:44:23+05:30 IST

బెంగళూరు నగరంలో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమ కంపెనీ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు....

స్వైన్‌ఫ్లూ ఎఫెక్ట్ :  మూడు నగరాల్లో సాఫ్ట్‌వేర్ కార్యాలయాల మూసివేత

  • ఇంటి నుంచే పనిచేయాలని టెకీలకు కంపెనీ ఆదేశాలు

న్యూఢిల్లీ : బెంగళూరు నగరంలో ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తమ కంపెనీ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ జెయింట్ ఎస్ఏపీ శుక్రవారం ప్రకటించింది. బెంగళూరుతోపాటు గురుగ్రామ్, ముంబై నగరాల్లో ఎస్ఏపీ కార్యాలయాలను మూసివేస్తున్నామని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని జర్మన్ టెక్ దిగ్గజం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బెంగళూరు నగరంలోని ఆర్ఎంజడ్ ఎకోవరల్డ్ ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఏపీ ఉద్యోగులకు హెచ్1 ఎన్1 వైరస్ సోకిన నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టామని కంపెనీ వివరించింది. తమ సంస్థ కార్యాలయాల్లో విస్తృతమైన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపడతామని కంపెనీ తెలిపింది. ఈ నెల 20 నుంచి 28వతేదీ వరకు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. తమ సంస్థ ఉద్యోగులు లేదా కుటుంబసభ్యులకు ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వస్తే వైద్యచికిత్స తీసుకోవాలని కంపెనీ సూచించింది. తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయం ఎంతో ప్రాధాన్యమని, అందుకే ఈ వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని కంపెనీ వివరించింది. 

Updated Date - 2020-02-21T16:44:23+05:30 IST