ప్రభుత్వ భూముల్లో మట్టి స్వాహా..!

ABN , First Publish Date - 2021-07-30T06:02:40+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూముల్లో మట్టిని అక్రమంగా.. యథేశ్చగా.. తవ్వి రియల్‌ వెంచర్లకు తరలిస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో మట్టి స్వాహా..!
మడకశిర ఘాట్‌ రోడ్డు వద్ద ప్రభుత్వ భూముల్లో మట్టిని తొవ్వుతున్న దృశ్యం


 పెనుకొండలో ‘రియల్‌’ ఆగడాలు

    ప్రభుత్వ ఆదాయానికి గండి

    స్పందించని అధికారులు


పెనుకొండ, జూలై 29 : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూముల్లో మట్టిని  అక్రమంగా..  యథేశ్చగా.. తవ్వి రియల్‌ వెంచర్లకు తరలిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి వారు గండి కొడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్లే...  పట్టణ షీప్‌ ఫారం వద్ద రూ.450 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రియల్‌ వ్యాపారులు వాగులు, వంకలు, మిట్టలున్న, ఎత్తుపల్లాలున్న భూమిని అతి తక్కువ ధరతో కొనుగోలు చేసి.. వెంచర్లు వేశారు. ప్రస్తుతం ఆ భూముల ధర రూ. కోట్లు పలుకుతోంది.  ఆ భూములు చదును కోసం మడకశిర ఘాట్‌ రోడ్డులో కొత్తగా నిర్మించిన రోడ్డుకు పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోని మట్టిని తవ్వేస్తున్నారు. ప్రభుత్వానికి రాయితీ రూపంలో వచ్చే ఆదాయానికి గండికొడుతున్నారు.  అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్‌, నాగరాజు 

ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా మట్టిని తరలించడం నేరం. మట్టిని తోడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. వీటిపై దర్యాప్తు చేస్తాము. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టిని తరలించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 







Updated Date - 2021-07-30T06:02:40+05:30 IST