సౌర విద్యుత్తు తీర్పు సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-07-21T07:37:42+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ జారీ చేసిన రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌ (ఆర్‌ఎ్‌ఫఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు

సౌర విద్యుత్తు తీర్పు సస్పెన్షన్‌

వచ్చేనెల 16 వరకు సింగిల్‌ జడ్జి తీర్పు నిలిపివేత

మధ్యంతర ఉత్తర్వులు మాత్రం అమల్లోనే

టెండరు దక్కిన కంపెనీలతో ఒప్పందాలు వద్దు

లోతైన విచారణ జరపాల్సి ఉంది: ధర్మాసనం

విచారణ ఆగస్టు 16కి వాయిదా 


అమరావతి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ జారీ చేసిన రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌ (ఆర్‌ఎ్‌ఫఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం నిబంధనలను రద్దు చేస్తూ గత నెల 17న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ఆగస్టు 16 వరకు హైకోర్టు ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. అయితే బిడ్డింగ్‌ ప్రక్రియలో విజేతగా నిలిచిన కంపెనీతో ఎలాంటి ఒప్పందాలూ చేసుకోవద్దని సింగిల్‌ జడ్జి ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ అప్పీళ్లు దాఖలు చేసేందుకు అనుమతించాలంటూ హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌, అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ల (లీవ్‌ పిటిషన్ల్లు)ను విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయడింది. విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. 


రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సామర్థ్యంతో ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సౌర విద్యుత్కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గత ఏడాది నవంబరులో పిలిచిన టెండర్లలో ఆర్‌ఎ్‌ఫఎస్‌, ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం నిబంధనలు కేంద్ర విద్యుత్‌ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్‌ రెన్యువబల్‌ ఎనర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్‌ జడ్జి ఆర్‌ఎ్‌ఫఎస్‌, ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం నిబంధనలు రద్దు చేస్తూ జూన్‌ 17న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ మొత్తం ఐదు అప్పీళ్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్‌కో ఓ అప్పీల్‌ వేయగా.. ఈపీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ మరో అప్పీల్‌, వేలం ప్రక్రియలో విజేతలుగా నిలిచిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ , అదానీ ఎనర్జీ, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా వేర్వేరుగా మరో మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి. మంగళవారం ఇవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.


ప్రజాప్రయోజనం లేదు..

షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, అదానీ ఎనర్జీ తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, హెచ్‌ఈఎస్‌ తరపున న్యాయవాది దీపక్‌ చౌదరి వాదనలు వినిపించారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో తాము విజేతలుగా నిలిచామన్నారు. బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు టాటా పవర్‌ సమయం పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరిందని.. ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆ కంపెనీ కోర్టును ఆశ్రయించిందని.. దాని పిటిషన్‌లో ప్రజా ప్రయోజనం ఇమిడి లేదని తెలిపారు. ‘బిడ్డింగ్‌లో విజేతలుగా నిలిచిన మా వాదనలు వినకుండానే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను కంపెనీలు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు అందజేస్తాయి.. వినియోగదారులకు నేరుగా విద్యుత్‌ సరఫరా చేయవు. అందుచేత కేంద్ర విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63 ఆ కంపెనీలకు వర్తించదు. బిల్డ్‌.. ఆపరేట్‌.. ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) పద్ధతిలో సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నాం. 30 ఏళ్ల తర్వాత ఇవి ప్రభుత్వపరమవుతాయి. మెగా ప్రాజెక్టు ఏర్పాటు విధానానికి సంబంధించిన జీవోను టాటా పవర్‌ సవాల్‌ చేయలేదు. సింగిల్‌ జడ్జి దగ్గర వ్యాజ్యంలో మమ్మల్ని ప్రతివాదులుగా చేర్చలేదు. దీంతో మా వాదనలు వినపించేందుకు అవకాశం లేకుండా పోయింది. టెండర్‌ ప్రక్రియ వేలానికి సంబంధించినది అయితేనే యూనిట్‌ ధరను ఖరారు చేసే విషయంలో ఏపీఈఆర్‌సీ ఆమోదం అవసరం. సింగిల్‌ జడ్జి నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం, బిడ్డింగ్‌లో విజేతలుగా నిలిచిన కంపెనీలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలి’ అని కోరారు.


లైసెన్సులు అవసరం లేదు..

రాష్ట్ర ఇంధనశాఖ, గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌, విద్యుత్‌ పంపిణీ సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీ రఘురామ్‌ వాదనలు వినిపించారు. ‘విద్యుదుత్పత్తి సంస్థలకు ఎలాంటి లైసెన్సులూ అవసరం లేదు. సౌర విద్యుత్‌ ప్రాజెక్టును నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు చేపట్టిన వినూత్న ప్రాజెక్టు ఇది. సింగిల్‌ జడ్జి నిర్ణయం వల్ల ప్రాజెక్టు ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. దీనివల్ల రాష్ట్రప్రభుత్వంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎక్కువ మొత్తం చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తుంది. సింగిల్‌ జడ్జి మా వాదనలు, దస్త్రాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ ఆదేశాలను సస్పెండ్‌ చేయండి’ అని కోరారు.


ఇతరులకు మేలు చేసేందుకే..

టాటా పవర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ సింఘ్వీ, డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రాష్ట్రప్రభుత్వం ఇతరులకు మేలు చేసేందుకు టెండర్‌ ప్రక్రియలో కేంద్ర విద్యుత్‌ చట్టం నిబంధనలను బైపాస్‌ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ డిసెంబరులో హైకోర్టును ఆశ్రయించాం. అప్పటికి బిడ్లు ఖరారు కాలేదు. సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చిన తర్వాతే విజేతలను ప్రకటించారు. సింగిల్‌ జడ్జి ఇచ్చే తుది తీర్పునకు లోబడి వేలం ప్రక్రియ ఉంటుందని వేలంలో పాల్గొన్న కంపెనీలకు ప్రభుత్వం  సమాచారం ఇచ్చింది. అయినా బిడ్డింగ్‌లో పాల్గొన్న కంపెనీలు సింగిల్‌ జడ్జి వద్ద వాదనలు వినిపించలేదు. విద్యుత్‌ అందించే వ్యవహారానికి చెందిన టెండరు ప్రక్రియలో విద్యుత్‌ చట్టం వర్తించదని ప్రభుత్వం చెప్పడం సరికాదు. ప్రాజెక్టు ఏర్పాటు, టారిఫ్‌ ఖరారు విషయంలో ఏపీఈఆర్‌సీ ఆమోదం తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే ఉంది. బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు టాటా పవర్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి. బిడ్డింగ్‌ ప్రక్రియలో చట్ట విరుద్ధంగా ఉన్న నిబంధనలు మార్చాలని మాత్రమే కోరాం. సింగిల్‌ జడ్జి తుది తీర్పు ఇచ్చిన తర్వాత హడావుడిగా అప్పీళ్లు దాఖలు చేశారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. అప్పీళ్లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపాకే తుది నిర్ణయం తీసుకోండి’ అని అభ్యర్థించారు.

Updated Date - 2021-07-21T07:37:42+05:30 IST