మరిన్ని బలగాలు వెనక్కి!

ABN , First Publish Date - 2022-02-17T07:24:59+05:30 IST

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య ఏ క్షణమైనా పరిస్థితులు మారొచ్చంటూ.. అమెరికా చేస్తున్న హెచ్చరికలకు భిన్నంగా రష్యా వ్యవహరిస్తోంది. .....

మరిన్ని బలగాలు వెనక్కి!

రష్యా వ్యూహాత్మక నిర్ణయం

 వీడియో విడుదల చేసిన మంత్రి

 అయినా నమ్మేది లేదు: అమెరికా, నాటో


మాస్కో/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉక్రెయిన్‌, రష్యాల మధ్య ఏ క్షణమైనా పరిస్థితులు మారొచ్చంటూ.. అమెరికా చేస్తున్న హెచ్చరికలకు భిన్నంగా రష్యా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల వెంబడి మోహరించిన బలగాలను భారీ సంఖ్యలో వెనక్కి రప్పించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. రష్యా రక్షణ శాఖ మంత్రి ఒక వీడియో విడుదల చేశారు. దీనిలో సాయుధ బలగాలతో కూడిన రైళ్లు వెనక్కి వస్తున్న దృశ్యాలున్నాయి. తమ శాశ్వత బేస్‌ల నుంచి బలగాలను తొలగించే పక్రియలో ఇది కొంత మాత్రమేనని రక్షణ మంత్రి తెలిపారు. అయితే, ఎన్ని బలగాలను వెనక్కి తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు పుతిన్‌ కూడా తాను యు ద్ధం కోరుకోవడం లేదని, చర్చలకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. నాటోలో ఉక్రెయిన్‌కు చోటు కల్పించకుండా ఉండాలనే విషయంపై మాత్రం ఆయ న పట్టుబడుతున్నారు. అయితే.. బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునే విషయంపై మాత్రం పుతిన్‌ ఇప్పటికీ మౌనంగానే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అమెరికా సహా పశ్చిమ దేశాలు.. రష్యా పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రష్యా డిమాండ్లను అమెరికా సహా దాని మిత్రదేశాలు తోసిపుచ్చడంతో పాటు ఐరోపాలో భద్రతను పెంచే విషయంపై మాత్రమే చర్చలు జరపాలని సూచించారు. కాగా, బుధవారం ఉక్రెయిన్‌ ఉత్తర భాగానికి ఆవల ఉ న్న బెలారస్‌ మీదుగా రష్యన్‌ ఫైటర్‌ జెట్స్‌ శిక్షణా మి షన్లను ఎగురవేశాయి. అయితే.. దీనిపై బెలారస్‌ విదేశాంగ మంత్రి వ్లాదమిర్‌ మేకీ మాట్లాడుతూ.. రష్యా బలగాలు విన్యాసాలు చేస్తున్నాయని, ఆదివారం ఇవి ముగియగానే బలగాలు వెళ్లిపోయతాయన్నారు. మరోవైపు.. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించాలని రష్యా చట్టసభల సభ్యులు పుతిన్‌ను కోరారు. అయితే దీనికి తాను సంసిద్ధంగా లేనని చెప్పారు.  కాగా, రష్యా దూ కుడు కొనసాగితే.. నిర్ణయాత్మక సమాధానం చెబుతామని అమెరికా మరోసారి హెచ్చరించింది. రష్యా చెబుతున్న విషయాలపై అమెరికా పరిశీలించాల్సి ఉందని అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. చర్చలకు అమెరికా అన్ని మార్గాలను తెరిచే ఉందని తెలిపారు. 


భారత్‌ మరింత అప్రమత్తం

రష్యా, ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలపై భారత్‌ మరింత అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తక్షణమే వెనక్కిరావాలని పిలుపునిచ్చిన భారత్‌.. వారు స్వదేశం చేరుకునేందుకు వీలుగా విమానాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. మరోవైపు.. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఉక్రెయిన్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి భారతీయులకు దీని నుంచి సేవలు అందిస్తామని అధికారులు చెప్పారు. కాగా, భారతీయులను రప్పించే విషయంపై పార్లమెంటరీ కమిటీ కూడా రంగంలోకి దిగింది.  

Updated Date - 2022-02-17T07:24:59+05:30 IST