Abn logo
Nov 26 2021 @ 01:12AM

గతమెంతో ఘనం.. నేడంతా దైన్యం

- పాతికేళ్ల క్రితమే హరితహారం..

- గ్రామస్థుల సమష్టి కృషి.. పెరిగిన అటవీ విస్తీర్ణం

- ఓగులాపూర్‌ అటవీ క్షేత్రంపై నేడు గొడ్డలి వేటు

మల్యాల, నవంబరు 25: ఆ గ్రామస్థుల సమష్టి కృషితో అటవీ విస్తీర్ణం పెరిగింది. గ్రామస్థుల ఐక్యతతో పాతికేళ్ల క్రితమే హరితహారానికి నాంది పలికారు. హరితహరం కార్యక్రమంతో పాటు వనసంరక్షణ, వనాల పెంపునకు ఈ గ్రామస్థుల కృషికి సార్క్‌ దేశాలే అబ్బుర పడ్డాయి. నాటి సీఎం చంద్రబాబును కూడా అమితంగా ఆకర్షించగా, ఆయన గ్రామస్థులను ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు నెలకొనడం గ్రామస్థులను కలచివేస్తోంది. అడవి దొంగల దాటికి అటవీ ప్రాంతం గొడ్డలి వేటుకు గురవుతోంది. గతంలో ఎంతో ప్రత్యేక చర్యలు తీసుకున్న అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్యాల మండలం ఓగులాపూర్‌ గ్రామం అటవీ ప్రాంతంలో పచ్చని గుట్టల మధ్య ఉంది. ఈ గ్రామ పరిధిలో దాదాపు 4,619 ఎకరాల పరిధిలో అటవీ విస్తీర్ణం ఉంది. అప్పటి ప్రభుత్వం వనసంరక్షణ సమితులను ఏర్పాటు చేయగా ఇక్కడ కూడా గ్రామస్థులు రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా వనం పెంపునకు కృషి చేశారు. విచక్షణరహితంగా వనాలను నరికి వేస్తూ భవిష్యత్‌ను ప్రమాదంలో నెట్టివేయడాన్ని గమనించి వనాల పెంపును చేపట్టారు. ముఖ్యంగా టేకు వనంను పెంచడంతో ఈ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. గ్రామస్థుల పర్యవేక్షణతో దాదాపు 5వేల ఎకరాల్లో టేకు వనం పరచుకుంది. గ్రామస్థులు వనం సంరక్షణతో పాటు వాటర్‌ షెడ్‌, రాక్‌ఫెల్‌ డ్యాంలు నిర్మించి ఆధర్శంగా నిలిచారు. నాటి వనసంరక్షణకు ఇటీవల బీటలు వారుతున్నాయని, ఈ ప్రాంతంలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే వనసంరక్షణ ఫలాలు ముందు తరాలకు చేరుతాయని గ్రామస్థులు అంటున్నారు.

- సార్క్‌దేశాల గుర్తింపు.. చంద్రబాబు ప్రశంశలు

ఓగులాపూర్‌ గ్రామస్థుల సమష్టి కృషితో అటవీ విస్తీర్ణం పెరగడంతో అప్పట్లో సార్క్‌ దేశాలను ఆకట్టుకుంది. 20 ఏళ్ల క్రితం గోవాలో జరిగిన సార్క్‌ సదస్సులో 8 దేశాల ప్రతినిధులు పాల్గొనగా అప్పటి విఎస్‌ఎస్‌ చైర్మన్‌ వెంకటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమష్టి కృషిని వివరించారు. దీంతో సార్క్‌ దేశాల ప్రతినిధులు వీరి కృషిని అభినందించారు. ఓగులాపూర్‌ గ్రామస్థుల కృషిని, వనసంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామస్థుల కృషిని అభినందిస్తూ ప్రశంస పత్రం పంపించారు. అటవీ అభివృధికి నిధులు మంజూరు చేస్తూ ఓగులాపూర్‌ వాసుల ఆదర్శాన్ని కొనియాడారు. 

- తగ్గుతున్న వనం..

ఓగులాపూర్‌ అటవీ ప్రాంతంపై కొన్నాళ్లుగా స్మగ్లర్లు కన్నేయడంతో విలువైన టేకు సంపద అక్రమంగా తరలిపోతోంది. కోట్లాది విలువ చేసే టేకు వనం అభివృద్ధి చెందగా నిత్యం అక్రమార్కుల గొడ్డలి వేటుకు గురౌతుంది. అటవీ సంరక్షణకు ఈ ప్రాంతంలో చెక్‌పోస్టులు లేకపోవడం, ఇన్‌చార్జీ అటవీ అధికారులు ఉండడంతో టేకు కలప కనుమరుగు అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల్లో కలప తరలిపోతుండగా ఓగులాపూర్‌ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వివిధ దూరప్రాంతాల నుంచి వచ్చె స్మగ్లర్లు ముందుగా టేకు కలపను నరికివేసి అర్ధరాత్రి వేళల్లో వాహనాల్లో తరలిస్తున్నారని, తాము చాలా సందర్భాల్లో పట్టుకున్నపట్టికి తమ పలుకుబడితో చిన్న పాటి జరిమానాలు చెల్లిస్తూ యఽథావిధిగా కలపను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గత వైభవం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

-  మరింతగా ప్రోత్సహించాలి..

పొన్నం సరోజన, సర్పంచ్‌

టేకు వనాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. గ్రామస్థుల కృషితోనే అటవీ అభివృద్ధి చెందింది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన దీన్ని మరింత గుర్తించి ప్రోత్సాహించాలి. టేకు అక్రమార్కులు పాలు కాకుండా ప్రభుత్వపరంగా ఏపుగా పెరిగిన టేకు కలపను విక్రయస్తే రూ. కోట్లలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కనీసం 10శాతం కేటాయించినా గ్రామ అభివృద్ధికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. తద్వారా గ్రామస్తుల కృషికి ఫలితం దక్కినట్లు అవుతుంది. పైగా ప్రత్యేక కార్యచరణతో టేకు వనం మళ్లీ విస్తరించే అవకాశాలు ఉంటాయి.

-  నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

రత్న, పారెస్ట్‌ సెక్షన్‌ అధికారి

ఓగులాపూర్‌ అటవీ ప్రాంతంలో నిత్యం పర్యవేక్షిస్తున్నాం. అక్రమంగా కలపను నరికివేసిన, తరలించినా చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణపై సమాచారం తెలిసిన వారు తమకు తెలుపుతే పట్టుకుంటాం. అక్రమంగా తరలిస్తున్నారనేది తమ దృష్టికి రాలేదు. అటవీ సంరక్షణకు పాటు పడుతున్నాం.