వెంకన్నకు ఏకాంతోత్సవం

ABN , First Publish Date - 2020-09-18T05:30:00+05:30 IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కరోనా కారణంగా ఈసారి అన్నీ సేవలు ఏకాంతంగానే జరుగుతాయి...

వెంకన్నకు ఏకాంతోత్సవం

  • తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనగానే భక్త జన 
  • ప్రవాహం, తన్మయత్వంతో మిన్నంటేలా వారు చేసే గోవింద నామ 
  • స్మరణ, మాడ వీధుల్లో దేవేరులతో స్వామి ఊరేగింపులూ, సాటిలేని 
  • వైభవంతో సాగే వాహన సేవలు కళ్ళ ముందు కదులుతాయి. ఈ ఏడాది 
  • అధికమాసం కారణంగా రెండు సార్లు బ్రహ్మోత్సవాలను 
  • నిర్వహించబోతున్నారు. కానీ కరోనా కారణంగా ఈసారి అన్నీ  
  • ఏకాంతంగానే జరుగుతాయి. ఇలా జరగడం ఇదే మొదటిసారి!


శ్రీవేంకటేశ్వరస్వామి వేంకటాద్రిపై వెలసిన తొలినాళ్ళలో ఆయన బ్రహ్మదేవుడిని పిలిచి,  లోకకల్యాణంలో కోసం తనకు విశేషమైన ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారని పురాణాలు చెబుతున్నాయి.  బ్రహ్మదేవుడు సంతోషంగా అంగీకరించి, శ్రీనివాసుడి కొలువైన తిరుమల క్షేత్రంలో కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణం నక్షత్రం రోజుకు పూర్తయ్యేలా తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించాడట. అందుకే ఈ ఉత్సవాలు ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధి చెందాయి.


తిరుమల చరిత్రను పరిశీలిస్తే వందల ఏళ్ళ నుంచీ వివిధ ఉత్సవాల నిర్వహణ సాగుతోంది. క్షేత్ర పరిపాలన బాధ్యతలను 1843 వరకు ఎందరో రాజులు, ఆర్కాటు నవాబులు, ఈస్టిండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిష్‌ అధికారులు చేపట్టారు. ఆ తర్వాత హథీరాం మహంతులు 1933 వరకు నిర్వహించారు. ఒకప్పుడు నెలకు ఒకసారి బ్రహ్మోత్సవాలు జరిగేవట. కొన్ని ఇబ్బందులు, సమస్యల కారణంగా ఏడాదికి ఒకసారి, అధిక మాసంలో రెండుసార్లకు బ్రహ్మోత్సవాలు పరిమితం అయ్యాయి. ఈ వేడుకల్లో శ్రీ వేంకట్వేరుడు తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినప్పటికీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం కానీ, ఏకాంతంగా నిర్వహించడం కానీ తిరుమయ క్షేత్ర చరిత్రలో లేదు. కాగా 1998లో వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు రాత్రి  అశ్వవాహన సేవ ప్రారంభానికి ముందు కుండపోత వర్షం కురిసింది. తిరుమల చెరువును తలపించింది.


మోకాళ్ళ లోతువరకు నీరు రావడంతో ఆ వాహన సేవను రద్దు చేయాలని అర్చకులు, ఆగమపండితులు, అధికారులు నిర్ణయించారు. అయితే రెండు గంటల తర్వాత వర్షం నిలిచిపోయింది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోయింది. దీంతో రద్దు చేద్దామనుకున్న అశ్వ వాహన సేవను మాడవీధుల్లో యథాప్రకారం కొనసాగించారు. పూర్వం యుద్ధాలు, దండయాత్రలు జరిగిన రోజుల్లోనూ బ్రహ్మోత్సవాలూ, స్వామి ఊరేగింపులూ ఆగిన సందర్భాలు తమకు తెలిసి ఎక్కడా లేవని అర్చకులు చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా శ్రీనివాసుడు తన ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరిస్తూ భక్తకోటిని కటాక్షిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల మీద కూడా పడింది. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. తిరుమల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం.


మహా రథానికి సైతం విరామం

ఈ ఏడాది ఆశ్వయుజంలో అధికమాసం వచ్చింది. కాబట్టి వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలను అధిక మాసంలో, నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిజ మాసంలో నిర్వహించబోతున్నారు. ఇవన్నీ ఆలయంలోని కల్యాణమండపం, రంగనాయక మండపంలోనే జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే తొలి రోజు పెద్దశేషవాహనం నుంచి చివరిరోజు అశ్వవాహనం వరకు అన్ని వాహన సేవలనూ కల్యాణ వేదికలోనే కొనసాగిస్తారు. ఉత్సవమూర్తులకు అలంకరణ, సల్లింపు, శాత్తుమెర, స్నపన తిరుమంజనం వంటి కార్యక్రమాలు రంగనాయక మండపంలో జరుగనున్నాయి. ఏ రోజు వాహనాన్ని ఆ రోజు కల్యాణ వేదికలో సిద్ధంగా ఉంచుతారు. విశేష అలంకరణలో ఉత్సవమూర్తులను తిరుచ్చిపై మంగళవాయిద్యాలతో పక్కనే ఉన్న కల్యాణవేదికకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, వాహనంపై కొలువు తీర్చుతారు. అక్కడ దివ్య ప్రబంధ పారాయణం, వేదపారాయణం, హారతి, నైవేద్య సమర్పణ చేస్తారు. అనంతరం జీయర్‌ బృందం శాత్తుమొర నిర్వహిస్తుంది. ఆ తర్వాత మరోసారి హారతి సమర్పించి ఉత్సవమూర్తులు తిరిగి రంగనాయక మండపానికి వేంచేపు చేస్తారు. ఈ విధంగా ఆలయం నుంచి వాహనాన్ని వెలుపలకు తీసుకురాకుండా, భక్తులెవరినీ అనుమతించకుండా పూజలను, ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఏకాంత కార్యక్రమాల్లో అర్చకులు, జీయర్‌స్వాములు, అధికారులు సైతం పరిమిత సంఖ్యలో పాల్గొంటారు.


సాధారణంగా మాడవీధుల్లో రెండు గంటల పాటు కొనసాగే వాహనసేవ రంగనాయక మండపంలో నలభై అయిదు నిమిషాల నుంచి గంట సేపు మాత్రమే ఉంటుంది. ఉదయం వాహన సేవలు తొమ్మిది గంటలకు, రాత్రి వాహన సేవలు ఏడు గంటలకు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజులూ వైదిక కార్యక్రమాలన్నిటినీ ఆలయానికే పరిమితం చేస్తున్నారు. చివరి రోజు పుష్కరిణిలో అత్యంత వైభవంగా జరిగే చక్రస్నానం కూడా ఆలయంలోనే నిర్వహించనున్నారు. అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన స్వర్ణ రథోత్సవం, మహా రథోత్సవాల ఊరేగింపులను రద్దు చేశారు. వాటికి బదులు ఆ సమయాల్లో సర్వభూపాల వాహనంపై ఉత్సవమూర్తులను కొలువుతీర్చి హారతులిస్తారు. దాదాపు ఆరువందల ఏళ్ళ చరిత్ర కలిగిన మహారథం సైతం ఈసారి బ్రహ్మోత్సవాల్లో కనిపించదు. 


ఈ ఏడాది రెండుసార్లు..     

చాంద్రమానం ప్రకారం మూడేళ్ళకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక (సాలకట్ల) బ్రహ్మోత్సవాలనూ, నిజ ఆశ్వయుజంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అధికమాసం ఆశ్వయుజంలో వచ్చింది. కాబట్టి వార్షిక బ్రహ్మోత్సవాలు అధిక ఆశ్వయుజంలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్దగా వత్యాసం లేదు. వైఖానస ఆగమం ప్రకారం మొదటి బ్రహ్మోత్సవాల కన్నా రెండవ బ్రహ్మోత్సవాలను కాస్త తక్కువ స్థాయిలో, కొద్దిపాటి మార్పులతో నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం, ప్రభుత్వం పట్టువస్త్రాల సమర్పణ, స్నపన తిరుమంజనం, కొత్త గొడుగుల సమర్పణ, మహారథం ఊరేగింపు, శ్రీవిల్లిపుత్తూరు మాలల సమర్పణ లాంటివి ఉండవు. ఉత్సవాల ఆరో రోజున సాయంత్రం స్వర్ణ రథోత్సవానికి బదులుగా పుష్పకవిమానంలో స్వామివారు విహరిస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 16 నుంచి 24 వరకూ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

- జగదీశ్‌, తిరుమల

Updated Date - 2020-09-18T05:30:00+05:30 IST