సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-01-13T09:54:24+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌కు ఏపీ జేఏసీ అమరావతి, ఏపీఎన్జీవో సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

సమస్యలు పరిష్కరించండి

  • సీఎంకు ఉద్యోగ సంఘాల వినతి
  • ముఖ్యమంత్రితో ఏపీ జేఏసీ అమరావతి,
  • ఏపీ ఎన్జీవో సంఘాల నేతల భేటీ
  • నాయకులను సత్కరించిన సీఎం జగన్‌
  • ‘స్థానికం’ వద్దన్న నేపథ్యంలో ఆహ్వానం! 


విజయవాడ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్‌కు ఏపీ జేఏసీ అమరావతి, ఏపీఎన్జీవో సంఘాలు విజ్ఞప్తి చేశాయి. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సీహెచ్‌ చంద్రశేఖరెడ్డిలు ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగుల సమస్యలపై వినతులు సమర్పించారు. పోటాపోటీగా సీఎం చేత కేలండర్లు, డైరీల ఆవిష్కరణలు చేయించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలను సీఎం శాలువాలు కప్పి సన్మానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువరించిన నేపథ్యంలో.. ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు ఎన్నికల షెడ్యూల్‌ను డిస్మిస్‌ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నుంచి అందిన ఆహ్వానం మేరకు నేతలు ఆయన్ను కలిసినట్టు సమాచారం. కరోనా బారిన పడిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో వైద్యం అందించాలని బొప్పరాజు, వైవీ రావు విజ్ఞప్తి చేశారు. సమస్యలను త్వరగా పరిష్కారించాలని అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిని సీఎం ఆదేశించారు.  


55% ఫిట్‌మెంట్‌ ఇవ్వండి: ఏపీ ఎన్జీవో

కొత్త పీఆర్‌సీని 2018 జూలై 1 నుంచి 55% ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని చంద్రశేఖరరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీవో కేలండర్‌ను, ఏపీపీటీడీ ఎన్‌ఎంయూ అసోసియేషన్‌ తదితర జేఏసీ సంఘాల డైరీలు, క్యాలండర్లను జగన్‌ ఆవిష్కరించారు.  ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు ఆయనకు వినతి పత్రాన్ని సమర్పించారు. 2018 జూలై 1 నుంచి 55% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావాలని కోరారు. డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ సీహెచ్‌ జోసఫ్‌, ఏపీ పీటీడీ ఎన్‌ఎంయూ నేతలు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T09:54:24+05:30 IST